Nizamabad Man Suicide Attempt: భూమ్మీద నూకలుండాలే గానీ, పులిబోనులో పడ్డా ప్రాణాలతో తిరిగిగొస్తారని చెప్తారు పెద్దలు. చనిపోవాలని రాసి పెట్టి లేనప్పుడు ఎవరెస్టు మీది నుంచి దూకినా ఏం కాదు. పోవాలని ఉన్నప్పుడు జారి కిందపడ్డా ప్రాణాలు పోతాయి. ఇందంతా సోది ఎందుకు చెప్తున్నానంటే.. ఇప్పుడు తెలుసుకోబోయే స్టోరీ ఇంచుమించు ఇలాగే ఉంటుంది. ప్రాణాలు తీసుకుందామని రైలుకు ఎదురెళ్లి ఓ యువకుడిని గేట్ మెన్ ఏకంగా రైలు ఆపి కాపాడ్డం సంచలనం కలిగించింది. ఈ ఘటన ఎక్కడో కాదు, తెలంగాణలోనే జరిగింది.
ఇంతకీ అసలు విషయం ఏంటంటే?
నిజామాబాద్ జిల్లా భీంగల్ కు చెందిన జగదీష్ ఇవాళ రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాడు. ముందుగా అనుకున్నట్లుగానే రైలు వస్తున్న క్రమంలో దానికి ఎదురుగా పరిగెత్తాడు. రైల్వే స్టేషన్ లోని గేట్ మెన్ జగదీష్ పరిగెత్తడాన్ని చూశాడు. వెంటనే అప్రమత్తం అయ్యాడు. లోకో పైలెట్ కు వైర్ లెస్ సెట్ ద్వారా సమాచారం అందించాడు. రైలు ఆపాలని రిక్వెస్ట్ చేశాడు. గేట్ మెన్ సమాచారంతో రైలుకు ఎమర్జెన్సీ బ్రేకులు వేసి అక్కడే ఆపేశాడు డ్రైవర్. అంతేకాదు, ఘటనకు సంబంధించిన వివరాలను రైల్వే అధికారులతో పాటు పోలీసులకు వివరించారు. అక్కడి చేరుకున్న రైల్వే పోలీసులు జగదీష్ ను అందుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఎమర్జెన్సీగా రైలు ఆగడంతో, ఆ రూట్ లో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సుమారు అరగంటకు పైగా రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి.
ఆత్మహత్యాయత్నానికి కారణం ఏంటంటే?
భీంగల్ పోలీస్ స్టేషన్ రైటర్ వేధింపుల కారణంగానే ఆత్మహత్యా యత్నం చేసినట్లు జగదీష్ వెల్లడించాడు. చిన్న గొడవ విషయంలో జగదీష్ మీద ఫిర్యాదు ఇచ్చారట. దాన్ని ఆసరాగా తీసుకుని సదరు స్టేషన్ రైటర్ వేధింపులకు పాల్పడుతున్నట్లు జగదీష్ ఆరోపించారు. ఆయన వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు. అందులో భాగంగానే రైలు కింద పడి చనిపోవాలి అని నిర్ణయించుకున్నాడు. అనుకున్నట్లుగానే రైలుకు ఎదురుగా వెళ్లాడు. కానీ, గేట్ మెన్ చూడ్డంతో ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం జగదీష్ రైల్వే పోలీసుల అదుపులో ఉన్నాడు. రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగించిన నేపథ్యంలో ఆయనపై రైల్వే చట్టాల ప్రకారం కేసులు నమోదు చేయనున్నట్లు తెలుస్తున్నది. అటు భీంగల్ రైటర్ వేధింపులపై పోలీసులు ఫోకస్ పెట్టినట్లు సమాచారం. అసలు జగదీష్ ఆహత్మ చేసుకోవాలనే నిర్ణయం తీసుకునేంతగా రైటర్ ఏం చేశాడనే అంశంపై ఆరా తీస్తున్నారు.
Read Also: తెలంగాణలోని ఈ ప్రాంతాల మీదుగా ప్రత్యేక రైళ్లు, సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం!
గేట్ మెన్ సమయ స్ఫూర్తిపై రైల్వే అధికారుల ప్రశంసలు
మరోవైపు సమయ స్ఫూర్తితో రైలులు ఆపి, ఓ యువకుడి ప్రాణాలను కాపాడిన గేట్ మెన్ మీద రైల్వే అధికారులు ప్రశంసలు కురిపిస్తున్నారు. అటు సోషల్ మీడియాలోనూ సదరు గేమ్ మెన్ స్పందించిన తీరును పలువురు అభినందిస్తున్నారు.