Delhi to Srinagar Vande Bharat: తొలి వందేభారత్ స్లీపర్ రైలు పట్టాలు ఎక్కేందుకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు లింక్ (USBRL) ద్వారా న్యూఢిల్లీ నుంచి శ్రీనగర్‌ను ఈ రైలు కలపనుంది. అత్యాధునిక రైలును ప్రధాని మోడీ జనవరి 26న జెండాఊపి ప్రారంభించనున్నారు. ఈ సెమీ హై స్పీడ్ రైలు ఢిల్లీ, కాశ్మీర్ మధ్య 900 కిలో మీటర్ల దూరాన్ని కేవలం 13 గంటల్లోగా పూర్తి చేయనుంది. దేశంలో 800 కిలో మీటర్లకు పైగా ప్రయాణించే తొలి డైరెక్ట్ సర్వీస్ ఇదే కావడం విశేషం.
కోచ్ లు, టికెట్ ధరల వివరాలు
వందేభారత్ స్లీపర్ రైలు న్యూఢిల్లీ నుంచి రాత్రి 7:00 గంటలకు బయల్దేరుతుంది. మరుసటి రోజు ఉదయం 8:00 గంటలకు శ్రీనగర్ చేరుకుంటుంది, జమ్మూ తావి, కత్రా, బనిహాల్ లో హాల్టింగ్ ఉంటుంది. ఇక ఈ రైలు 16 కోచ్ లను కలగి ఉంటుంది. వీలో 11 AC 3-టైర్ కోచ్‌లు, 4 AC 2-టైర్ కోచ్‌లు, 1 ఫస్ట్ AC కోచ్ ను కలిగి ఉంటుంది. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు వందేభారత్ రైలు టికెట్ ఛార్జీ విషయానికి వస్తే.. AC 3-టైర్‌కు రూ. 2,000, AC 2-టైర్‌కు రూ.2,500, ఫస్ట్ ACకి రూ.3,000గా నిర్ణయించారు.
ఈ రైలు ప్రారంభంతో కలిగే లాభాలు
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు లింక్ ప్రాజెక్ట్ తో జమ్మూ కాశ్మీర్ లోని పర్యాటక రంగం మరింత డెవలప్ కానుంది. అక్కడి నుంచి పండ్లు, పూలు, కూరగాయలు ఢిల్లీకి అత్యంత వేగంగా చేరుకోనున్నాయి. స్థానిక వ్యాపారాలకు చక్కటి ప్రోత్సాహం లభించనుంది. కాశ్మీర్- న్యూఢిల్లీ వందేభారత్ రైలు ప్రారంభం తర్వాత పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. జమ్మూకాశ్మీర్ డెవలప్ మెంట్ కు ఈ రైలు అద్భుతమైన ఊతం అందించనుంది.
చివరి దశకు చేరిన రైల్వే ట్రాక్ నిర్మాణం
అటు ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు లింక్ కాశ్మీర్ లోని అన్ని ప్రధాన ఏరియాల మధ్య కనెక్టివిటీని పెంచనుంది. ఇప్పటి వరకు జమ్మూలోని కత్రా వరకు మాత్రమే రైల్వే నెట్ వర్క్ ఉంది. ఈ నేపథ్యంలో కాశ్మీర్ లోని అన్ని ప్రాంతాలకు రైల్వే కనెక్టివిటీ కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 37,012 కోట్లను అందించింది. ఈ డబ్బుతో జమ్మూ- శ్రీనగర్ మధ్య కనెక్టివిటీని ఏర్పాటు చేస్తున్నారు. బారాముల్లా, శ్రీనగర్, ఖాజిగుండ్, బనిహాల్, సంగల్దాన్ మధ్య రైల్వే కనెక్టివిటీ ఇప్పటికే ఉంది. దీనిని ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా లైనుకు కలపనున్నారు. ఈ రైలు సర్వీస్ కోసం చీనాబ్ నదిపై ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వంతెనను ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వం USBRL ప్రాజెక్టులో భాగంగా 272 కిలో మీటర్లలో కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి అనుమతించింది. ఇప్పటికే 255 కిలో మీటర్ల ట్రాక్ నిర్మాణం పూర్తయ్యింది. కత్రా- రియాసీ మధ్య కేవలం 17 కిలో మీటర్ల మేర నిర్మాణం కంప్లీట్ కావాల్సి ఉంది. ఈ ట్రాక్ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. డిసెంబర్ నాటికి ఈ పనులు పూర్తవుతాయి. జనవరిలో ప్రధాని మోడీ ఈ రైల్వే లైన్ మీదుగా కాశ్మీర్-న్యూఢిల్లీని కలిపే వందేభారత్ స్లీపర్ రైలును ప్రారంభించనున్నారు.