Pushpa 2: టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్(Allu Arjun) టీం పైన హైదరాబాద్ చిక్కడపల్లి పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. అల్లు అర్జున్(Allu Arjun) ‘పుష్ప 2’ ప్రీమియర్స్ సందర్భంగా హైదరాబాదులోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న సంధ్య థియేటర్ కి వచ్చారు. దీంతో తమ అభిమాన హీరోని చూడడానికి ఫ్యాన్స్ పోటెత్తడంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతిచెందగా, బాలుడు తీవ్ర అస్వస్థతకు గురైనట్లు సమాచారం. ప్రస్తుతం ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
అల్లు అర్జున్ టీం పై క్రిమినల్ కేస్ ఫైల్..
దీంతో సంధ్య థియేటర్ ఘటన పైన చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేయగా.. ఇందులో భాగంగానే సెక్షన్ 105, 118 BNS యాక్ట్ ప్రకారం అల్లు అర్జున్ టీం అలాగే సంధ్యా థియేటర్ యాజమాన్యం పైన కేసు నమోదు చేసినట్లు సమాచారం. అల్లు అర్జున్ థియేటర్ కి వస్తున్న సందర్భంలో భద్రత విషయంలో నిర్లక్ష్యం వహించిన కారణంగా థియేటర్ యాజమాన్యంపై కేసు నమోదు చేయగా, మరొకవైపు అల్లు అర్జున్ వస్తున్న విషయాన్ని పోలీసులకు సరైన సమయంలో చెప్పకుండా బాధ్యత రాహిత్యంగా వ్యవహరించిన అల్లు అర్జున్ టీం పై కూడా పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఈ విషయం కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.. మరి దీనిపై అల్లు అర్జున్ ఏదైనా స్పందిస్తారేమో చూడాలి.
పుష్ప -2 సినిమా విశేషాలు..
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రష్మిక మందన్న హీరోయిన్గా వచ్చిన చిత్రం ఇది. ఫహాద్ ఫాజిల్, అనసూయ, జగపతి బాబు, సునీల్, రావు రమేష్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. 2021లో విడుదలైన పుష్ప సినిమా సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం మిక్స్డ్ టాక్ తో దూసుకుపోతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అటు నార్త్ లో భారీ ఇమేజ్ దక్కించుకున్నా ఇటు సౌత్ లో మాత్రం మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది..
టీజర్ , ట్రైలర్ తో భారీ హైప్..
ఇదిలా ఉండగా ఈ సినిమా నుంచి విడుదల చేసిన టీజర్ అలాగే ట్రైలర్ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ దక్కించుకున్నాయి. ముఖ్యంగా ట్రైలర్ విడుదలైన 24 గంటల్లోనే అత్యధిక వ్యూస్ రాబట్టి, నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది. అలాగే ఈ సినిమా నుంచి విడుదలైన స్పెషల్ సాంగ్ కిస్సిక్ కూడా సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఇందులో శ్రీ లీల తన అద్భుతమైన డాన్స్ పెర్ఫార్మెన్స్ తో మెప్పించింది.. అంతేకాదు ఈ పాట కోసం ఈమె ఏకంగా రెండు కోట్ల రూపాయల పారిపోషకం తీసుకున్నట్లు సమాచారం.
అల్లు అర్జున్ సినిమాలు..
ప్రస్తుతం పుష్ప -2 సక్సెస్ పై జోరుగా ఉన్న ఈయన మరోవైపు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారని సమాచారం. అయితే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది.. అలాగే పూజా కార్యక్రమాలు త్వరలోనే ప్రారంభం కానున్నాయట.