K-Electric Vs Pakistan Railways: పాకిస్తాన్ రైల్వే సంస్థ కనీసం విద్యుత్ ఛార్జీలు చెల్లించలేని దుస్థితికి చేరుకుంది. విద్యుత్ బకాయిలు చెల్లించడం లేదంటూ ఏకంగా కరాచీ ఎలక్ట్రిక్ సప్లై కంపెనీ రైల్వేలకు విద్యుత్ సరఫరాను నిలిపివేసింది. ఈ నిర్ణయంతో 38 ప్యాసింజర్ రైళ్లు మార్గం మధ్యలోనే నిలిచిపోయాయి. ఆన్ లైన్ టికెట్ బుకింగ్ నిలిచిపోయింది. వీలైనంత త్వరగా పెండింగ్ బిల్లులు చెల్లించడంతో పాటు నెలవారీ బిల్లులు సక్రమంగా చెల్లిస్తామని రైల్వే అధికారులు హామీ ఇవ్వడంతో విద్యుత్ ను పునరుద్దరించారు.
నిలిచిపోయిన రైళ్లు, ఆగిపోయిన టికెట్ బుకింగ్
తాజాగా ఘటనపై రైల్వే డివిజనల్ సూపరింటెండెంట్ ముహమ్మద్ నాసిర్ ఖలీలీ కీలక విషయాలు వెల్లడించారు. విద్యుత్ సంస్థ తీసుకున్న నిర్ణయంతో రైల్వే ప్రయాణీకులకు తీవ్ర ఇబ్బందులు పడ్డారని చెప్పారు. “పాకిస్తాన్ రైల్వే లోని పలు లైన్లకు, కీలకమైన రైల్వే కార్యాలయాలకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడింది. కరాచీ విద్యుత్ సంస్థ తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా రైల్వే కార్యకలాపాలను తీవ్రంగా ప్రభావితం చేసింది. ఆన్ లైన్ టికెట్ బుకింగ్ వ్యవస్థ నిలిచిపోయింది. ఆటోమేటిక్ సిగ్నలింగ్ వ్యవస్థ ఆగిపోయే ప్రమాదం ఏర్పడింది. ప్యాసింజర్, గూడ్స్ రైళ్లను సమయానికి నడపలేని పరిస్థితి నెలకొన్నది. కరాచీ నుంచి వెళ్లే 38 ప్యాసింజర్ రైళ్లు నిలిచిపోయాయి” అని ఖలీలీ వివరించారు. నిజానికి కరాచీ విద్యుత్ సంస్థ పాకిస్తాన్ రైల్వే సంస్థకు పెద్ద మొత్తంలో బకాయలు చెల్లించాల్సి ఉందన్నారు. అందుకే రైల్వే సంస్థ కూడా బిల్లులు చెల్లించడం లేదని వెల్లడించారు. ఇప్పటికే తమకు రావాల్సిన బకాయిలను చెల్లించాలని కరాచీ విద్యుత్ సంస్థకు నోటీసులు పంపినట్లు వివరించారు. ఒకవేళ చెల్లించకపోతే, తాము కూడా సీరియస్ గా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఖలీలీ హెచ్చరించారు.
Read Also: కాశ్మీర్ వందే భారత్‌కు ముహూర్తం ఫిక్స్.. టికెట్ ధర, ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
బకాయిలు చెల్లించకపోతే విద్యుత్ సరఫరా కష్టం
అటు పాకిస్తాన్ రైల్వే సంస్థ ఇప్పటి వరకు తమ కంపెనీకి పెద్ద మొత్తంలో విద్యుత్ బకాయిలు చెల్లించాల్సి ఉందని కరాచీ విద్యుత్ సంస్థ వెల్లడించింది. విద్యుత్ ఛార్జీలు చెల్లించకుండా విద్యుత్ సరఫరా చేయడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది. “పాకిస్తాన్ రైల్వే సంస్థ మే 2024 నుంచి విద్యుతు ఛార్జీలు చెల్లించడం లేదు. ఇప్పటి వరకు సదరు సంస్థ 430 మిలియన్లు బకాయి పడింది. ఈ పెండింగ్ బిల్లులను వెంటనే క్లియర్ చేయాలని కోరాం. ఇప్పటికే నోటీసులు జారీ చేశాం. కానీ, రైల్వే సంస్థ పట్టించుకోలేదు. చెల్లింపులు లేకుండా విద్యుత్ సరఫరాను కొనసాగించడం సాధ్యం కాదు. అందుకే, డిఫాల్టింగ్ కనెక్షన్లను డిస్ కనెక్ట్ చేశాం. బకాయిలు, నెలవారీ బిల్లులు సకాలంలో చెల్లిస్తామని రైల్వే అధికారులు హామీ ఇవ్వడంతో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాం” అని కరాచీ రైల్వే సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. పాకిస్తాన్ రైల్వేలు కరాచీ డివిజన్ నుండి రోజుకు 50 నుంచి 60 మిలియన్ల వరకు ఆదాయాన్ని సంపాదిస్తున్నది.