Visakha Tragedy: తాము పడ్డ కష్టం తమ పిల్లలు పడకూడదని కొందరు తల్లిదండ్రులు పిల్లలు అడిగినవన్నీ కొనిస్తుంటారు. తమ ఆశలన్నీ చంపుకుని పిల్లలకు నచ్చినవన్నీ ఇస్తుంటారు. తన పిల్లల కోసం ఎంత కష్టానైనా భరించి, వారికి మెరుగై జీవితాన్ని అందిస్తుంటారు. కొత్త బైక్ కోసం తల్లిదండ్రుల వద్ద మారాం చేసిన ఓ యువకుడు చివరికి అదే బైక్ ప్రమాదంలో మరణించిన విషాద ఘటన విశాఖలో చోటుచేసుకుంది.
దసరా రోజున రూ.3 లక్షలు అప్పు చేసి బైక్ కొనిచ్చిన తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చాడు కుమారుడు. విశాఖపట్నం మహారాణిపేటలో నివాసం ఉంటున్న ఆటో డ్రైవర్ శ్రీనివాసరావు కుమారుడు హరీష్ (19) ఇంటర్ పూర్తి చేసి ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాడు. ఇటీవల తండ్రిని బైక్ కావాలని అడిగితే డబ్బుల్లేవని చెప్పాడు. అయినా కుమారుడు వినకుండా మొండిపట్టు పట్టడంతో చివరికి రూ.3 లక్షలు అప్పు చేసి దసరా రోజున బైక్‌ను కొనిచ్చాడు తండ్రి.
టిఫిన్ చేయడానికి నగరంలోని ద్వారకానగర్ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్దకు స్నేహితుడితో కలిసి కొత్త బైక్ పై వెళ్లాడు హరీష్. టిఫిన్ చేసిన తరువాత స్నేహితుడిని ఇంటి వద్ద దించడానికి ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి అతి వేగంతో వెళ్తుండగా సిరిపురం దత్ ఐలాండ్ మలుపు వద్ద బైక్ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హరీష్‌కు తీవ్ర గాయాలు కావడంతో 108 అంబులెన్స్‌లో కేజీహెచ్‌కు తరలించారు. చికిత్స పొందుతూ హరీశ్ మృతి చెందాడు. బైక్ కొన్న ఐదు రోజుల్లోనే కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
ఈ ప్రమాదంలో హరీష్ స్నేహితుడు వినయ్ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: AC explosion: బాచుపల్లిలో దారుణం.. ఏసీ పేలి ఇంట్లో ..
సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం తాళ్లసింగారంలో విషాద ఘటన జరిగింది. కొత్త బైక్ కొనివ్వలేదనే మనస్తాపంతో గణేష్ (17) అనే ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ నెల 3న రాత్రి ఇంట్లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. దసరా రోజున తల్లిదండ్రులు బైక్ కొనివ్వడానికి నిరాకరించడంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్ఐ నాగరాజు తెలిపారు. మృతుడి తండ్రి బిక్షం ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.