Visakhapatnam: విశాఖపట్నంలో క్రిప్టో కరెన్సీ పేరిట జరిగిన ఒక భారీ మోసం వెలుగుచూసింది. అధిక లాభాలు, ఎక్కువ వడ్డీ ఇస్తామంటూ నమ్మించి దాదాపు రూ.10 కోట్ల వరకు వసూలు చేసిన మహ్మద్ అజీమ్ ఖాన్ అనే నిందితుడిని కంచరపాలెం పోలీసులు అరెస్ట్ చేశారు.
నిందితుడు బిర్లా జంక్షన్ దగ్గరున్న బొత్స స్క్వేర్ అపార్ట్‌మెంట్స్ కేంద్రంగా పంక్ పాండా, ఐటీసీ గ్లోబల్, కేగుష్ అనే క్రిప్టోకరెన్సీ వెబ్‌సైట్లను నడిపేవాడు. తక్కువ కాలంలోనే ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చంటూ జూమ్ మీటింగుల ద్వారా అమాయకులను నమ్మించేవాడు. ఇతని మాటలు నమ్మి ఎన్ఏడీ కూడలికి చెందిన పి.రత్నరాజు అనే వ్యక్తి 2021 నుంచి 2025 మధ్య కాలంలో రూ.36 లక్షలు పెట్టుబడి పెట్టాడు. అంతేకాదు, తెలుగు రాష్ట్రాల్లోని తన స్నేహితులను కూడా ఇందులో చేర్పించాడు. అలా నిందితుడు మొత్తం 50 మంది నుంచి రూ.10 కోట్ల వరకు వసూలు చేశాడు.
ఆ తర్వాత నిందితుడు వెబ్‌సైట్లు, యాప్‌లను మూసేసి బాధితులకు అందుబాటులో లేకుండా పోయాడు. మోసపోయానని గ్రహించిన రత్నరాజు తన డబ్బులు తిరిగి ఇవ్వాలని అడగడంతో, నిందితుడు బెదిరింపులకు దిగాడు. తనకు పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్లు, ప్రభుత్వ ఉన్నతాధికారులతో పరిచయాలు ఉన్నాయని, ఎదురుతిరిగితే హనీట్రాప్ కేసులో ఇరికిస్తానని భయపెట్టాడు. ఆ బెదిరింపులకు భయపడి రత్నరాజు మరో రూ.10 లక్షలు కూడా ఇచ్చాడు. అయినా నిందితుడి వేధింపులు ఆగకపోవడంతో, చివరకు రత్నరాజు అన్ని ఆధారాలతో కంచరపాలెం పోలీసులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని కటకటాల వెనక్కి నెట్టారు.
Also Read: దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై ఘోరం.. యువతి ఆత్మహత్య!