Wanaparthy District Crime : అర్థరాత్రి వేళ, నిద్ర మత్తులో ఉన్న సమయంలో అనుకోకుండా విరుచుకుపడ్డారు కొంత మంది దుండగులు. రాళ్లు, కత్తులతో దాడి చేశారు. ఏమవుతుందో తేరుకునే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దైవ దర్శనాలకు వెళ్లిన వారు దారిదోపిడికి గురయ్యారు. ఈ ఘటనతో బాధితులంతా ఒక్కసారిగా నిశ్చేష్టులు కాగా.. ఈ వార్త తెలిసిన వాళ్లంతా రాత్రుల వేళ రోడ్డుపై కార్లు ఆపాలంటేనే భయపడిపోతున్నారు.ఈ ఘటన వనపర్తి జిల్లాలో చోటుచేసుకోగా.. నిందితుల కోసం పోలీసులు గాలింపు మొదలుపెట్టారు.
జగిత్యాలకు చెందిన ఓ మూడు కుటుంబాలకు చెందిన 8 మంది తిరుమల దర్శనానికి వెళ్లి వస్తున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకుని అలసిపోయిన వారంతా కారులో పడుకుండిపోయారు. దాంతో.. రాత్రి వేళ ప్రయాణం వద్దనుకుని.. వనపర్తి జిల్లా పెబ్బేరు శివారుకు వచ్చేవరకు కారును నిలిపివేశారు. నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగించే ఆ రోడ్డులో సురక్షితంగా ఉంటుందని.. కాస్త నిద్ర మత్తు వదలగానే ప్రయాణం సాగించవచ్చని ఆగారు. కానీ.. అనుకున్నది ఒకటి అయ్యిందొకటి. వారి అలసట, అవసరాన్ని ఆసరాగా చేసుకుని దారిదోపిడి దొంగలు రెచ్చిపోయారు. ఉన్నపళంగా విరుచుకుపడి.. ఉన్నదంతా దోచుకుపోయారు.
రద్దీగా ఉండే రోడ్డు పక్కన మూత్రశాలల దగ్గర మామూలుగానే కార్లు ఆపి టాయిలెట్లు వాడుకుంటుంటారు. దాంతో అక్కడ కార్లు, ఇతర వాహనాలు నిలిపి ఉంచేందుకు స్థలం ఉంటుంది. రాత్రి వేళ.. అక్కడ సురక్షితమే అనుకున్న ప్రయాణికులు.. కారును ఆపి నిద్రలోకి జారుకున్నారు. అంతలోనే.. కొందరు గుర్తు తెలియని దుండగులు కత్తులు, రాళ్లతో దాడి ప్రారంభించారు. కారులోని ప్రయాణికుల్ని తీవ్రంగా గాయపరిచి.. బంగారాన్ని అపహరించుకుని పోయారు. బాధితుల పోలీసు ఫిర్యాదు మేరకు మొత్తంగా ఎనిమిది మంది నుంచి 14 తులాల బంగారం చోరికి గురైనట్లు గుర్తించారు.
బాధితులంతా జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కూజన్ కొత్తూరు గ్రామానికి చెందిన వారిగా పోలీసులు తెలిపారు. ఇక్కడ ప్రభుత్వ టాయిలెట్లు నిర్వహించే వ్యక్తి అందుబాటులో ఉండగా.. అతని గదికి తాళం వేసిన దుండగులు దారిదోపిడికి పాల్పడ్డారు. సమయం కానీ సమయంలో ఎవరూ అందుబాటులో లేకపోవడంతో కారులోని మహిళలు దిక్కుతోచని స్థితిలో దుండగుల చేతిలో గాయపడ్డారు. వారి ఆర్తనాదాలు ఎవరికి వినిపించకపోవడంతో.. ఆదుకునే వారే లేకుండా పోయారు. చివరికి.. టాయిలెట్లు నిర్వహించే వ్యక్తి గది తాళం తీయగా.. అతనే పోలీసులకు సమాచారం అందించాడు. గాయపడ్డ మహిళల్ని స్థానికంగా ఉండే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Also Read : అత్తారింటికి బయలుదేరిన కొత్త పెళ్లికొడుకు.. దారిలో కిడ్నాప్, హత్య.. కుట్ర ఎవరిదంటే?
బాధితుల ఫిర్యాదుతో జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఘటనా స్థలాన్ని వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ పరిశీలించారు. వనపర్తి డీఎస్పీ వెంకటేశ్వర్ రావు, సీఐ రాంబాబు, ఎస్సై హరిప్రసాద్ రెడ్డిలు ఘటన స్థలానికి చేరుకుని, విచారణ చేపట్టారు. జిల్లాలోని ప్రధాన రహదారిపై, అందునా.. కార్లు, పెద్ద వాహనాలు ఆపేందుకు వీలున్న చోట ఇలాంటి దోపిడీలు జరగడాన్ని పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. ఇలాంటి ఘటనల వల్ల ప్రజల్లో భయం పెరిగిపోతుందంటున్న స్థానికులు.. ప్రజల్లో భయం పోవాలంటే నిందితుల్ని త్వరగా పట్టుకుని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాారు.