Groom Murder | వారిద్దరికీ కొత్తగా పెళ్లి అయింది. పెళ్లికూతురు కొన్ని రోజుల తర్వాత పుట్టింటికి వెళ్లింది. ఆ మరుసటి రోజే వరుడు కూడా అత్తారింటికి బయలుదేరాడు. కానీ ఉదయం బయలుదేరిన అతడు సాయంత్రమైనా చేరుకోలేదు. వరుడి తల్లిదండ్రులు తమ కొడుకు ఎక్కడికి వెళ్లాడో తెలియక వెతుకుతుంటే.. దారిలో అతని బైక్ కింద పడి పోయి కనిపించింది. పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. విచారణలో అతను కిడ్నాప్ అయ్యాడని.. ఆ తరువాత హత్య చేయబడ్డాడని తెలిసింది. అయితే హంతకులెవరు? అనేది తెలుసుకున్నాక.. అందరూ ఆశ్చర్యపోయారు. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలో జరిగింది.
పోలీసుల కథనం ప్రకారం.. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరానికి చెందిన భవిక్ (26) అనే యువకుడికి గాంధీనగర్ కు చెందిన పాయల్ (23)తో నాలుగు రోజుల క్రితం వివాహం జరిగింది. పాయల్ తన తల్లిదండ్రులు గుర్తుకు వస్తున్నారని బాధపడుతుండడంతో ఆమె అత్తమామలు పుట్టింటికి వెళ్లడానికి అనుమతించారు. అలా పాయల్ తండ్రి వచ్చి ఆమెను పుట్టింటికి తీసుకెళ్లారు. మరుసటి రోజు తన అల్లుడు భవిక్ కూడా మరుసటి రోజు రావాలిని ఆహ్వానించి వెళ్లారు.
భవిక్ కూడా తన భార్య కోసం మరుసటి రోజు ఉదయం అత్తారింటికి బయలుదేరాడు. సాయంత్రం భవిక్ తల్లిదండ్రులు తమ కొడుకుకి ఫోన్ చేశారు. కానీ అతని ఫోన్ స్విచాఫ్ వస్తోంది. దీంతో భవిక్ తండ్రి.. తన వియ్యంకుడు, పాయల్ తండ్రికి ఫోన్ చేసి.. భవిక్ సురక్షితంగా గాంధీనగర్ చేరుకున్నాడా? లేదా? అని అడిగారు. దానికి పాయల్ తండ్రి భవిక్ అక్కడికి చేరుకోలేదని అన్నారు. దీంతో ఆందోళన చెందిన భవిక్ తండ్రి తన కొడుకు కోసం వెతకమని అడిగారు. మరోవైపు భవిక్ తండ్రి కూడా అహ్మదాబాద్ లో భవిక్ కోసం వెతకడం ప్రారంభించారు.
Also Read: భర్తకు నిద్రమాత్రలిచ్చి పక్కనే భార్య మరో యువకుడితో.. ఇంట్లో చిన్నపిల్లపై అత్యాచారం..
అయితే ఆ రోజు రాత్రి పాయల్ తండ్రి తన మనుషులతో కలిసి భవిక్ కోసం వెతుకుతుండగా.. అతని బైక్ గాంధీనగర్ శివర్లలో పడి ఉండడం కనిపించింది. దీంతో ఆయన కంగారు పడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేశారు. ఆ ప్రాంతంలో నివసించే ఒక గొర్రెల కాపరి ఘటన జరిగినప్పుడు అక్కడే ఉన్నట్లు తెలసుకొని పోలీసులు అతడిని ప్రశ్నించారు. గొర్రెల కాపరి కథనం ప్రకాం.. ఒక యువకుడు (భవిక్) బైక్ పై వస్తుండగా.. అతడి బైక్ ని ఒక స్కార్పియో కారు వచ్చి ఢీ కొట్టింది. అందులో నుంచి ముగ్గురు మనుషులు దిగి గాయపడిన భవిక్‌ని కొట్టి తమ కారులో తీసుకెళ్లిపోయారు. కానీ ఆ కిడ్నాప్ చేసిన వారెవలో తనకు తెలియదని చెప్పాడు.
పోలీసులు సిసిటివీ వీడియోల కోసం ప్రయత్నించినా ఆ పరిసరాల్లో సిసిటివిలు ఎక్కడా లేవు. దీంతో పోలీసులు మళ్లీ మొదటి నుంచి విచారణ ప్రారంభించారు. వారికి ఇదంతా పెళ్లి జరిగిన కొద్ది రోజులకే జరగడం, పైగా గాంధీనగర్ సమీపంలోనే జరగడంతో పాయల్ కుటుంబ సభ్యులపై అనుమానం కలిగింది. దీంతో ముందుగా పాయల్ నే అదుపులోకి తీసుకొని గట్టిగా ప్రశ్నించారు. అప్పుడామె చెప్పింది విని అందరూ ఆశ్చర్యపోయారు.
పాయల్ పెళ్లికో ముందే తన బావ కల్పేష్ ని ప్రేమించింది. అతడినే పెళ్లి చేసుకుందామనుకుంది. కానీ పాయల్ తండ్రి ఆమెకు భవిక్ తో పెళ్లి చేశారు. దీంతో కల్పేష్, పాయల్ ఒక కుట్ర పన్నారు. భవిక్ ని చంపేస్తే.. పాయల్ కు కల్పేష్‌తో రెండో పెళ్లి చేయడానికి ఆమె తల్లిదండ్రులు అంగీకరిస్తారనుకున్నారు. అందుకే ప్లాన్ ప్రకారం.. పాయల్ తన పుట్టింటికి వెళ్లింది. ఆ తరువాత తన భర్త గాంధీనగర్ కు వస్తున్న విషయం తన బావ కల్పేష్ కు తెలియజేసింది. దీంతో కల్పేష్ తన ఇద్దరు మిత్రులతో కలిసి భవిక్ కిడ్నాప్ చేసి అతడికి ఉరి బిగించి హత్య చేశాడు. ఆ తరువాత భవిక్ శవాన్ని ఊరి చివర ఒక పెద్ద కాలువలో పడేశాడు.
పోలీసులు భవిక్ హత్య, కిడ్నాప్, కుట్ర చేసినందుకు కల్పేష్, పాయల్, కల్పేష్ స్నేహితులను అరెస్టు చేశారు. ఇదంతా తెలిసి ఇటు పాయల్ తల్లిదండ్రులు, భవిక్ కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు.