SBI Bank Robbery : వరంగల్ జిల్లాలో భారీ దొంగతనం వెలుగుచూసింది. చిన్నా, చితక చోరీలతో సరిపోవడం లేదని ఏకంగా బ్యాంకుకే కన్నం వేశారు కేటుగాళ్లు. దాంతో.. లబోదిబోమంటూ బ్యాంకులకు పరుగులు పెట్టడం ఖాతాదారుల వంతైంది. ఈ విషయం వెలుగులోకి రావడంతో.. జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది.
వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని ఎస్‌బీఐ బ్యాంకులో ఏడాది క్రితం చోరీకి దొంగలు విశ్వప్రయత్నం చేశారు. కానీ.. అప్పుడు చోరికి వీలవలేదు. కానీ.. ఘటన విషయం తెలిసిన తర్వాత కూడా అధికారులు సరైన చర్యలు చేపట్టకపోవడంతో.. వీలుచూసి భారీ చోరికి పాల్పడ్డారు దొంగలు. దాంతో.. ఇప్పుడు తలలు పట్టుకోవడం బ్యాంకు అధికారుల వంతైంది.
మండల కేంద్రంలోని ఎస్ బీఐ బ్యాంకు నిర్వహణ లోపాన్ని ఆసరాగా చేసుకున్న దొంగలు. బ్యాంకుకు కన్నం వేశారు. పైగా.. సొరుగుల్లో సొమ్ముల జోలికి వెళ్లకండూ.. ఏకంగా బంగార ఉన్న లాకర్లనే టార్గెట్ చేసుకున్నారు. సినిమా ఫక్కిలో సాగిన ఈ చోరి కథ.. పోలీసుల్ని సైతం ఆశ్చర్యపరుస్తోంది. పూర్తి ముందస్తు ప్లాన్ తో, ఎలాంటి ఆధారాలు లభించకుండా.. చాలా జాగ్రత్తగా సొమ్ముల్ని అపహరించుకుపోయారు.
చాన్నాళ్లుగా బ్యాంకు దగ్గర రాత్రి వేళల్లో సెక్యూరిటీ లేకపోవడాన్ని గమనించిన దొంగలు.. బ్యాంకును లక్ష్యంగా చేసుకున్నారు. బ్యాంకుల్లోని సెక్యూరిటీ ఆలారం పనిచేయకుండా.. ముందస్తుగా.. అలారం తీగలను కత్తిరించారు. అక్కడి నుంచి చిన్నగా.. కిటికీని తొలగించి బ్యాంకు లోపలికి చొరబడిన దొంగలు.. సీసీ కెమెరాలను వెతికి మరీ తొలగించారు. వాటి వైర్లను కత్తిరించి.. సాంకేతికత ఆధారాలు దొరకకుండా జాగ్రత్తలు పడ్డారు. ముందుగా వారి కదలికలు, ఎలాంటి అలారాలు మోగకుండా చూసుకున్న తర్వాత.. వారి అసలు పని కానిచ్చారు.
బ్యాంకులోని బంగారు లాకర్లను తెరవడం అంత సులభం కాదు. అందుకే.. పక్కా ప్రణాళికతో వచ్చిన దుండగులు.. గ్యాస్ కట్టర్లను సైతం వెంటబెట్టుకుని వచ్చారు. బ్యాంకులో మొత్తం మూడు లాకర్లు ఉండగా.. వాటిలో ఒకదానిని తెరచి, అందులోని మొత్తం బంగారాన్ని కాజేశారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ లాకరులో సుమారు 500 మంది ఖాతాదారులకు సంబంధించిన బంగారాన్ని దాచినట్లు తెలుస్తోంది. ఈ లాకర్ లోని 497 సీజ్ చేసిన ప్యాకెట్ల నుంచి దాదాపు..19 కేజీల అభరణాల్ని ఎత్తుకెళ్లారు. ప్రాథమిక అంచనా ప్రకారం.. వీటి విలువ రూ.15 కోట్లు ఉంటుందని అధికారులు లెక్కలు వేస్తున్నారు.
అనుకున్న తీరుగానే చోరి కానిచ్చిన తర్వాతా.. వారి చాలా జాగ్రత్తగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. బంగారు ఆభరణాలు తీసుకుని వెళ్లే ముందు బ్యాంకులోని సీసీ కెమెరాల హార్డ్‌డిస్క్‌ను సైతం తమ వెంట తీసుకెళ్లారు. దాంతో.. వారు వచ్చే ముందు వరకు, వచ్చి కెమెరాల తీగలు కత్తిరించే దృశ్యాలు సైతం పోలీసులకు చిక్కలేదు. అయితే.. వెళ్లేటప్పుడు వారు తెచ్చిన గ్యాస్ కట్టర్‌ను అక్కడే వదిలివెళ్లారు.
రోజులానే బ్యాంకుకు చేరుకున్న బ్యాంక్ సిబ్బంది.. చోరి జరిగినట్లు తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. భారీ స్థాయిలో పక్కా స్కెచ్ ప్రకారం జరిగిన చోరిని చూసి.. పోలీసులు సైతం ఆశ్చర్యపోతున్నారు. వర్ధన్నపేట సీఐ శ్రీనివాసరావు, రాయపర్తి, వర్ధన్నపేట ఎస్సైలు శ్రావణ్‌కుమార్, రాజు ఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరించతారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన దర్యాప్తు ప్రారంభించారు.
తెల్లవారుజాములే బ్యాంకులో చోరి విషయం తెలుసుకుని.. అందులో బంగారం తాకట్టు పెట్టిన, దాచుకున్న ఖాతాదారులు పరుగుపరుగున బ్యాంకుకు చేరుకున్నారు. తమ బంగారం ఎలా అంటూ ఆందోళనకు దిగారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతుండడంతో.. స్పందించిన బ్యాంకు అధికారులు.. బాధితులకు నష్టం జరగకుండా చూస్తామని హామి ఇవ్వడంతో.. అక్కడి నుంచి వెళ్లిపోయారు. బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని, అపహరణకు గురైన సొత్తు వివరాలు పూర్తిగా తెలియాల్సి ఉందని సీఐ తెలిపారు.
Also Read : నా భూమిని కబ్జా చేసి బతిమాలినా వదల్లేదు.. అందుకే దాడి చేశా.. నిజామాబాద్ ఘటనపై నిందితుడు
బ్యాంకులో ఇంత పెద్ద దొంగతనం జరిగేందుకు అధికారుల నిర్లక్ష్యమే కారణమంటున్నారు. బ్యాంకుకు కాపాల కల్పించడంలో విఫలమయ్యారంటూ విమర్శిస్తున్నారు. రెండేళ్ల క్రితం కూడా ఈ బ్యాంకులో దొంగతనం ప్రయత్నం జరిగిందని గుర్తు చేస్తున్న ఖాతాదారులు.. అప్పుడు ఓ ప్రైవేటు సెక్యూరిటీ గార్డును నియమించారని, ఆ తర్వాత అతను సైతం కనిపించడం లేదని అంటున్నారు. అతను ఉద్యోగం మానేశాడని తెలిపిన బ్యాంకు అధికారులు.. అప్పటి నుంచి మరొకరు విధుల్లో చేరలేదని అంటున్నారు.