 
					Road Accident: హనుమకొండ జిల్లా గోపాల్‌పూర్ క్రాస్‌రోడ్డు వద్ద.. ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.పెళ్లి బృందంతో వెళ్తున్న బొలేరో వాహనాన్ని బోర్ వెల్స్ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. మరో 12 మందికి తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది. వారిలో ఐదుగురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
వివరాల్లోకి వెళ్తే.. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం సూదన్‌పల్లి గ్రామానికి చెందిన ఓ యువతికి.. సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం వెంటకాపురం గ్రామానికి చెందిన యువకుడితో వివాహం జరిగింది. ఆనందోత్సాహాల మధ్య జరిగిన ఈ వివాహ వేడుక ముగిసిన అనంతరం, వధువు బృందం వరుడి ఇంటి నుంచి తిరిగి మహబూబాబాద్ బయలుదేరింది. ఈ నేపథ్యంలో గోపాల్ పుర్ వద్ద బొలేరో వాహనాన్ని ఆపారు. దీంతో వెనుక నుంచి వచ్చిన లారీ వాహనాన్ని ఢీకొట్టింది.
దీంతో అక్కడికక్కడే ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. మరో 12 మందికి తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది. వీరిలో ఐదుగురు పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు.
ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. లారీ డ్రైవర్ మద్యం సేవించి వాహనం నడిపాడా లేక మరేదైనా కారణం ఉందా అన్న కోణంలో  విచారణ సాగుతోంది. లారీ డ్రైవర్ పారిపోయినట్లు సమాచారం. వాహనాలను క్రేన్ సాయంతో అక్కడి నుంచి తరలించారు. ప్రమాదం కారణంగా ఆ ప్రాంతంలో ట్రాఫిక్ కొంతసేపు నిలిచిపోయింది.