 
					Kurnool Bus Accident: కర్నూలు చిన్నటేకూరు వద్ద జరిగిన బస్సు ప్రమాదం 19 మంది ప్రాణాలను బలిగొంది. దేశవ్యాప్తంగా కన్నీళ్లు పెట్టించిన ఈ ఘటనలో కాలిబూడిదైన మృతదేహాలను అధికారులు గుర్తించి.. ఇప్పటికే కుటుంబ సభ్యులకు అప్పగించారు. బస్సు ప్రమాద ఘటన వద్ద క్షుణ్ణంగా పరిశీలించి.. విచారణ నిమిత్తం అక్కడి వస్తువులను తరలించారు. అయితే ఈ ప్రమాద ఘటన స్థలానికి దగ్గరలో ఉన్న మహబూబ్‌నగర్ జిల్లా వాసులకు దురాశ పుట్టింది.
కర్నూలు బస్సు ప్రమాదంలో మృతదేహాలు పూర్తిగా కాలిపోయాయి. దీంతో వారు ధరించిన బంగారం, వెండి ఆభరణాలు సైతం మంటల్లో దగ్ధం అయ్యాయి. అయితే మృతుల ఆభరణాలు కరిగి బూడిదలో ఉంటాయనే ఆశతో.. మహబూబ్‌నగర్‌కు చెందిన కొన్ని కుటుంబాలు నిన్న బస్సు దుర్ఘటన ప్రాంతానికి చేరుకున్నాయి. అక్కడి బూడిదను సంచుల్లో సేకరించి, ప్రమాద స్థలం దగ్గర ఉన్న ఓ కుంట వద్దకు తీసుకెళ్లారు. వాటిని నీటిలో కడిగి మరీ పరీక్షించారు. ఈ ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపితే… వీళ్లు మాత్రం బంగారం, వెండి కోసం దూరప్రాంతం నుంచి రావడం అందరినీ ఆశ్చర్యపోయేలా చేస్తోంది.