UP Crime: ఈ మధ్యకాలంలో ప్రేమ పెళ్లిళ్లు ఎక్కువయ్యాయి. ఎవరైనా ప్రశ్నిస్తే మనసులు కలిశాయి.. వివాహం చేసుకున్నామని చెబుతున్నారు. అందులో తప్పేమిలేదు. కాకపోతే ఎన్నాళ్లు కలిసి ఉంటున్నారనేది అసలు ప్రశ్న. తొమ్మిదేళ్లు ప్రేమించుకున్న ఓ జంట.. వివాహం చేసుకుని రెండు నెలలు అయ్యింది. చివరకు భార్యభర్తల మధ్య ఏం జరిగిందో తెలీదుగానీ, భర్త అత్యంత దారుణంగా హత్యకు గురయ్యాడు. ఇంతకీ ఎక్కడో తెలుసా?
యూపీలో ఘోరం.. తొమ్మిదేళ్ల ప్రేమ, ఆపై పెళ్లి
యూపీలోని బరేలీకి చెందిన జితేంద్ర.. ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్‌లో కాంట్రాక్ట్ కార్మికుడిగా పని చేస్తున్నాడు. జితేంద్రకు చిన్న అలవాటు ఉంది. అప్పుడప్పుడు జూదం అడుతాడు. జ్యోతి ఉత్తరప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థలో బస్ కండక్టర్‌గా ఉద్యోగం చేస్తోంది. జితేంద్ర-జ్యోతి తొమ్మిదేళ్లుగా ప్రేమించుకున్నారు.. ఇద్దరికీ ఉద్యోగాలు రావడంతో వివాహం చేసుకోవాలని డిసైడ్ అయ్యారు.
గత నవంబర్ 25న ఇరు కుటుంబాల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. పెళ్లయిన కొద్ది వారాలు భార్యభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. జ్యోతి బ్యాంకు ఖాతా నుండి జితేంద్ర రూ.20 వేలు డ్రా చేశాడు. ఆ డబ్బుతో ఆన్‌లైన్ జూదం ఆడాడు. ఈ వ్యవహారం దంపతుల మధ్య వివాదానికి దారి తీసింది. జనవరి 26న డబ్బు విషయంలో దంపతులు గొడవపడ్డారు. పట్టరాని కోపంతో జ్యోతి.. తల్లిదండ్రులు-సోదరులను ఇంటికి రప్పించింది.
భర్తని చంపేసిన భార్య, కేవలం అందుకే
భర్త ఓ వైపు జూదంలో డబ్బులు పోగొట్టిన విషయం జ్యోతి కుటుంబసభ్యులకు తెలిపింది. అగ్నిపుట్టేలా మాటలు చెప్పారు. ఫలితంగా భర్తని చంపాలని డిసైడ్ అయ్యింది జ్యోతి. జనవరి 26న రాత్రి భోజనం తర్వాత అందరూ కలిసి కబుర్లు చెప్పుకున్నారు. అప్పటికి జితేంద్ర నిద్రపోతున్నాడు. ముందుగా జ్యోతి, ఆమె కుటుంబసభ్యులు వేసుకున్న ప్లాన్ ప్రకారం అమలు చేశారు.
తొలుత జితేంద్ర కాళ్లు, చేతులు కదలకుండా గట్టిగా పట్టుకున్నారు జ్యోతి కుటుంబసభ్యులు. ఆ తర్వాత జ్యోతి.. భర్త గొంతు నులిమి హత్య చేసింది. జితేంద్ర చనిపోయిన తర్వాత ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్లాన్ చేశారు. కిటికీ జితేంద్ర మృతదేహాన్ని వేలాడ దీసి అల్లుడు ఆత్మహత్య చేసుకున్నాడని చుట్టుపక్కలవారిని నమ్మించే ప్రయత్నం చేశారు.
ALSO READ: కుక్కకాటు నుంచి కాపాడుకుందామనుకుంటే.. కాలయముడైన ఇంజక్షన్?
జితేంద్ర తన వ్యవహారాలను ఎప్పటికప్పుడు తన కుటుంబసభ్యులకు చెప్పేవాడు. పోలీసులు తొలుత ఆత్మహత్యగా భావించారు. అయితే జితేంద్ర సోదరుడు అజయ్ ఫిర్యాదుతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదైంది. పోస్టుమార్టం నివేదికలో గొంతు నులిమి హత్య చేసినట్లుగా తేలింది. నివేదిక ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జ్యోతితో పాటు ఆమె తల్లిదండ్రులను అరెస్టు చేసి ప్రశ్నించారు. దీంతో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. పరారీలో ఉన్న ఆమె సోదరుడు కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటన వెనుక ఆర్థిక వివాదాలు కారణమని భార్య జ్యోతి తెలిపింది.