Wife Killed Husband: ఇటీవల కాలంలో వివాహేతర సంబంధాల కారణాలతో హత్యలు పెరుగుతున్నాయి. అక్రమ సంబంధాలు వ్యక్తిగత జీవితాలనే కాకుండా కుటుంబాలను చిన్నభిన్నం చేస్తున్నాయి. హత్య వంటి తీవ్ర నేరాలకు దారితీస్తున్నాయి. తాజాగా మెదక్ జిల్లాలో ఇలాంటి ఘటన వెలుగుచూసింది. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని.. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది భార్య. ఈ హత్యను ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది.
వివరాల్లోకి వెళ్తే.. తిమ్మాపూర్‌కు చెందిన స్వామి (35), మౌనిక (28) దంపతులకు 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మొదట్లో కుటుంబ జీవితం సజావుగానే సాగినా, గత కొంతకాలంగా మౌనిక ప్రవర్తనలో భర్తకు కొన్ని మార్పులు కనిపించాయి. అయితే కొన్నేళ్ల నుంచి మౌనికకు తనకంటే తక్కువ వయసున్న సంపత్ (23) అనే యువకుడితో పరిచయం ఏర్పడి, అది క్రమంగా వివాహేతర సంబంధంగా మారినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
ఈ విషయం భర్తకు తెలియడంతో భార్యను ప్రశ్నించాడు. అంతేకాదు గ్రామ పెద్దలతో పంచాయితీ పెట్టి సమస్యను పరిష్కరిస్తానని చెప్పాడు. ఈ నేపథ్యంలో మౌనిక అక్రమ సంబంధానికి భర్త అడ్డు వస్తున్నాడన్న భావనతో, అతడిని ఎలాగైనా తొలగించాలనే దురుద్దేశంతో మౌనిక ప్లాన్ వేసినట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ క్రమంలో గత నెల డిసెంబర్ 22న స్వామి మద్యం తాగి ఇంటికి వచ్చి నిద్రపోయాడు. ఇదే అదనుగా భావించిన మౌనిక, తన ప్రియుడు సంపత్‌ను ఇంటికి పిలిచింది. అర్ధరాత్రి సమయంలో ఇద్దరూ కలిసి స్వామి గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. అనంతరం ఈ హత్యను ప్రమాదంగా చిత్రీకరించేందుకు మరో నాటకం మొదలుపెట్టారు.
మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లిన మౌనిక, సంపత్‌లు సమీపంలోని నెరేళ్ల కుంటలో పడేశారు. మద్యం మత్తులో చెరువులో పడి స్వామి చనిపోయినట్లు గ్రామస్తులను నమ్మించేందుకు ప్రయత్నించారు. మొదట్లో ఈ ఘటనను అనుమానాస్పద మృతిగా భావించినప్పటికీ, భార్య మౌనిక ప్రవర్తనలో మార్పు రావడంతో పోలీసులకు అనుమానం కలిగింది.
దీంతో పోలీసులు తమ స్టైల్లో విచారించగా నేరం ఒప్పుకుంది. ప్రియుడు సంపత్‌తో ఉన్న అక్రమ సంబంధం బయటపడుతుందన్న భయంతోనే ఈ హత్యకు పాల్పడినట్లు మౌనిక పోలీసులకు తెలిపినట్లు సమాచారం.
Also Read: జనవరి 4న గచ్చిబౌలిలో ఎగ్జామ్‌థాన్ రన్.. విజేతలకు రూ.10 లక్షల ప్రైజ్ మనీ
ఈ కేసులో కీలక ఆధారాలను సేకరించిన పోలీసులు, మౌనికతో పాటు ప్రియుడు సంపత్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.