Arunachalam: శివ శివా. అరుణాచల శివా. ఘోరం. అపచారం. మహా పాపం. పరమ పవిత్రమైన తిరువన్నామలైలో అరాచకం జరిగింది. రమణ మహర్షి తపస్సు చేసిన పావనమైన స్కందాశ్రమ ప్రదేశంలో అమానుషం చోటు చేసుకుంది. ఫ్రాన్స్ నుంచి వచ్చిన మహిళను స్థానిక టూరిస్ట్ గైడ్ రేప్ చేయడం తీవ్ర కలకలం రేపింది. విషయం తెలిసి యావత్ భక్త లోకం నిర్ఘాంతపోతోంది. అరుణాచలం.. అందులోనూ అరుణగిరిపై.. స్కందాశ్రమ సమీపంలో ఇలాంటి దారుణమైన ఘటనను అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. నమ్మశక్యంగా లేకపోయినా ఇది నమ్మాల్సిన చేదు నిజం.
అరుణాచలంను తమిళనాడులో తిరువన్నామలై అంటారు. అరుణాచల శివుడు కొలువై ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. అక్కడి కొండను సాక్షాత్తూ శివుని అగ్ని లింగంగా భావిస్తారు. అరుణ గిరి చుట్టూ ప్రదక్షణ చేస్తే సకల పాపాలు పోతాయని నమ్ముతారు. ప్రతీ పౌర్ణమికి లక్షల్లో భక్తజనం గిరి ప్రదక్షణ చేస్తుంటారు. తిరువన్నామలైలో ఉన్న రమణ ఆశ్రమం కూడా అంతే ప్రసిద్ధి. రమణులు ఆ అరుణగిరిపై ఉన్న స్కందాశ్రమంలో చాలాకాలం పాటు సమాధిలో ఉన్నారని అంటారు. రమణ మహర్షి ఆశ్రమానికి విదేశీ భక్తులు భారీ సంఖ్యలో వస్తుంటారు. నేను ఎవరు? అనే రమణుల తత్వానికి ఆకర్షితులైన ఫారినర్స్ నిత్యం అక్కడ పదుల సంఖ్యలో కనిపిస్తుంటారు. అలాంటి నమ్మకంతోనే వచ్చిన ఓ ఫ్రాన్స్ భక్తురాలిపై ఇలాంటి దారుణం జరగడం సంచలనంగా మారింది.
ఫ్రాన్స్ నుంచి వచ్చిన మహిళ.. స్థానికుడైన వెంకటేశన్‌ను టూరిస్ట్ గైడ్‌గా నియమించుకుంది. ధ్యానం చేసే స్థలం చూపిస్తానంటూ స్కందాశ్రమంకు తీసుకెళ్లి.. ఆమెపై అత్యాచారానికి తెగబడ్డాడు ఆ దుర్మార్గుడు. వెంకటేశన్‌కు మరో నలుగురు సహకరించారని తెలుస్తోంది. ఆ షాక్ నుంచి తేరుకున్నాక.. స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది ఆ బాధిత ఫ్రాన్స్ మహిళ. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి.. టూరిస్ట్ గైడ్ వెంకటేశన్‌తో పాటు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై కఠిన చర్యలకు సిద్ధమవుతున్నారు.
అరుణాచలం ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సుప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రం. ఇలాంటి చోట విదేశీయురాలిపై ఇంతటి దారుణ ఘటనం జరగడం దిగ్భ్రాంతికర విషయం. ఇప్పటికే నకిలీ టూరిస్ట్ గైడ్లు ఫారినర్స్‌ను దోచుకుంటారనే అపవాదు ఉంది. అలాంటిది.. ఫ్రాన్స్ మహిళపై అత్యాచారానికి పాల్పడటం మామూలు ఘటన కానే కాదు. నిందితులను కఠినంగా శిక్షించి.. తిరువన్నామలై అందరికీ సేఫ్ ప్లేస్ అని చాటిచెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అరుణాచల శివుడి క్షేత్రంలో ఇలాంటి అమానుషం జరగడం మాత్రం మహా ఘోరం.. మహా అపచారం.