Hindu tradition: ఇంట్లో ఎవరైనా మరణిస్తే ఏడాది వరకు పూజలు చేయకూడదా? దైవకార్యాలకు విరాళాలు ఇవ్వకూడదా? ఏటి సూతకంలో దేవుడిని మొక్కకూడదా..? ఇంట్లో దీపం వెలిగించకూడదా..? ఇలాంటి అనుమానాలు చాలా మందికి వస్తుంటాయి. అయితే ఏటి సూతకంలో ఏం చేయాలో ఏం చేయకూడదో హిందూ గ్రంథాల్లో చెప్పబడిందని పండితులు చెప్తున్నారు. ఇంతకీ ఏటిసూతకంలో చేయాల్సిన పనులేంటి..? చేయకూడదని పనులేంటో.. ఈ కథనంలో తెలుసుకుందాం.
ఇంట్లో ఎవరైనా మరణిస్తే వారికి మైల ఉంటుందని సంవత్సరం వరకు ఆ ఇంట్లో కానీ ఆ కుటుంబ సభ్యులు కానీ ఎలాంటి దైవ సంబంధమైన విషయాలలో పాల్గొనకూడదని.. కనీసం పూజలు కూడా ఇంట్లో చేసుకోకూడదని చాలా మంది చెప్తుంటారు. అయితే హిందూ సంప్రదాయంలో ప్రతి సమస్యకు పరిష్కార మార్గం ఉందని పండితులు చెప్తున్నారు. అలాగే ఏటి సూతకం గురించి కూడా పలు పురాణాల్లో వివరంగా ఉందని కానీ ఆ విషయాలేవీ చాలా మందికి తెలియదని ఉత్తిత్తి పుకార్లు మాత్రం షికార్లు చేస్తుంటాయని చెప్తున్నారు పండితులు. ఇంకొందరైతే దైవ కార్యాలకు కనీసం చందాలు కూడా ఇవ్వకూడదని ప్రచారం చేస్తున్నారని.. అలాంటి వారి మాటలు నమ్మి చాలా మంది ఇంట్లో దేవుళ్ల ఫోటోలు కానీ ప్రతిమలు కానీ ఒక బట్టలో చుట్టి అటక మీదపెట్టేస్తున్నారని సంవత్సరీకాలన్నీ అయిపోయాక మరుసటి ఏడాది దేవుళ్ళ చిత్రపటాలను క్రిందకు దింపి, శుభ్రం చేసి పూజ చేస్తుంటారనిన.. మనుషులు ఉన్న ఇంట్లో ఏడాది పాటు దీపారాధాన, దైవ పూజ, నివేదన లేకుండా చేస్తున్నారని.. ఇది సరైన పద్దతి కాదని పండితులు సూచిస్తున్నారు. శాస్త్రంలో ఇలాంటి పద్దతి ఎక్కడా లేదని తెలియజేస్తున్నారు.
దైవ సంబంధిత కార్యాలకు సేవా కార్యక్రమాలకు ఏటి సూతక సమయంలో ఇచ్చిన విరాళాలకు అత్యంత విశేష ఫలితాలు కలుగుతాయట. అందుకే పూర్వకాలంలో శాశ్వత దాతలు అనే పేరుతో సేవలు ఏర్పాటు చేశారని.. ఎటువంటి సందర్భంలోనైనా..? ఆ కార్యక్రమాలు ఆపకూడదనే ఉద్దేశంతో.. ఇలాంటి ఏర్పాట్లు చేశారని పండితులు చెప్తున్నారు. సూతకంలో చేసిన దాన ధర్మాలు, దైవకార్య విరాళాల వలన పైలోకంలో ఉన్న పితృదేవతలకు శాంతి కలుగుతుందని.. తద్వారా వారి కుటుంబానికి దైవానుగ్రహంతో పాటు విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయట. దీపం లేని ఇల్లు స్మశానంతో సమానం. దీపం శుభానికి సంకేతం. దీపం ఎక్కడ వెలిగిస్తే అక్కడకు దేవతలొస్తారు. ప్రతి ఇంట్లోను నిత్యదీపారాధాన జరగాలి. మరణం సంభవించిన ఇంట్లో 11 వరోజు తర్వాత శుద్ధి కార్యక్రమం జరుగుతుంది. 12 వరోజు శుభస్వీకారం జరుగుతుంది. ఆ కుటుంబం ఆ 11 రోజులు మాత్రమే ప్రత్యేకంగా పూజ చేయకూడదు. అంతవరకే శాస్త్రంలో చెప్పబడింది. అంతేకానీ ఏడాది పాటు దీపం వెలిగించకూడదని, పూజలు చేయకూడదని ఎక్కడా లేదని పండితులు చెప్తున్నారు.
నిజానికి సూతకంలో ఉన్న సమయంలో కూడా సంధ్యావందనం చేయాలని, అర్ఘ్య ప్రధానం వరకు బాహ్యంలో చేసి మిగితాది మానసికంగా చేయాలని శాస్త్రం చెప్పిందట. అలాగే ఏడాది పాటు ఆలయాలకు వెళ్ళకూడదని కూడా ఏ శాస్త్రంలోనూ లేదని చెప్తున్నారు. ఇంట్లో నిత్య పూజలు కూడా చేసుకోవచ్చు కానీ కొత్త పూజలు మాత్రం ప్రారంభించకూడదట. మనం నిత్యం అర్చించడం వలన మనం పూజించే చిత్రపటాల్లో దేవతలు వచ్చి కూర్చుంటారట. అలా ఏడాదిపాటు వారికి ధూప, దీప, నైవేధ్యాలు మొదలైన ఉపచారాలు చేయకుండా, బట్టలో చుట్టి పక్కన పెట్టడమే తప్పు. అది దోషము, అరిష్టము కూడా. కనుక తప్పకుండా ఇంట్లో నిత్య దీపారాధన, దైవారాధన జరగాలి. ఇంటికి గానీ, ఇంటి సభ్యులకు కానీ ఎలాంటి దోషాలున్నా, వాటినన్నింటినీ ఆపే శక్తి ఆ ఇంట్లో చేసే దైవారాధనకు ఉంటుందట. కనుక ఎన్నడూ దైవారాధన, దీపారాధన మానకూడదట.
పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.