Arunachalam temple: ఫస్ట్ టైం అరుణాచలం వెళ్తున్నారా..? అయితే అరుణాచలంలో ఎలా ఉండాలో..? ఎలా గిరి ప్రదక్షిణ చేయాలో మీకు తెలుసా..? తెలియకపోతే ఈ కథనంలో తెలుసుకుందాం. ఇంకా అరుణాచలం టూర్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఈ స్టోరీలోనే తెలుసుకుందాం.
హిందువుల ఆధ్యాత్మిక కేంద్రాలలో అరుణాచలం మొదటివరుసలో ఉంటుంది. లక్షలాది శివ భక్తులు ప్రతిరోజూ అరుణాచలం వెళ్లి అక్కడి అరుణాచలేశ్వరుడిని దర్శించుకుంటారు. అలాగే గిరి ప్రదక్షిణ చేసి పునీతులు అవుతుంటారు. అయితే మొదటిసారి అరుణచలం వెళ్లే వాళ్లు కన్ఫీజ్ కాకుండా ఉండేందుకు ఈ కింది విషయాలు తెలుసుకుంటే మీ టూర్ ప్రశాంతంగా పూర్తి చేసుకోవచ్చు.
అరుణాచలం గిరి ప్రదక్షిణ చేసే వారు ఎక్కడ నుంచి మొదలు పెడతారో.. అక్కడికి చేరుకోవడంతో నే గిరిప్రదక్షిణ పూర్తి అవుతుంది. రాజగోపురం దగ్గరి నుంచి నడక మొదలు పెడితే అక్కడికి వచ్చాక మాత్రమే ప్రదక్షిణ పూర్తి అయినట్టు. ఒకవేళ మీరు నైరుతి లింగం దగ్గర మొదలు పెడితే తిరిగి నైరుతి లింగం వరకు రాగానే మీ ప్రదక్షిణ పూర్తి అయినట్టు. మీరు ఎక్కడి నుంచి గిరి ప్రదక్షిణ మొదలు పెట్టినా కచ్చితంగా అక్కడ ఒక వినాయకుని గుడి ఉంటుంది. ఆ వినాయకుడి ఆశీస్సులు కూడా తీసుకోండి. గిరిప్రదక్షిణ అనేది కచ్చితంగా రోడ్డుకు ఎడమ వైపున మాత్రమే చేయాలి కుడివైపు మార్గం లో సూక్ష్మరూపంలో యోగులు ‘ సిద్ధులు ‘ దేవతలు ప్రదక్షిణలు చేస్తారట.. అందువలన కుడివైపున ప్రదక్షిణ చేయరాదు .
ఆరుణాచలం వెళ్లే ప్రతి వారు కచ్చితంగా పది రూపాయల నోట్లు వీలైనంత ఎక్కువ తీసుకుని వెళ్ళండి. ఎందుకంటే ప్రతి ఆలయంలో పది రూపాయలు దక్షిణగా వేసిన ప్రతి భక్తునికి విభూది ప్యాకెట్ లు ఖచ్చితంగా ఇస్తారు. అలాగే ప్రతి ఆలయంలో విబూది ఇస్తుంటారు.. ఆ విబూదిని భద్రపరుచుకోవడానికి చిన్న డబ్బాలు తీసుకెళ్లడం మర్చిపోకండి.
ఎముకలు అరిగి పోయిన వారు యమ లింగం దగ్గర ఇచ్చే విభూతి ఔషధంగా తీసుకుంటే దాని ఫలితం అమోఘంగా ఉంటుందని చెప్తుంటారు. ఇక నైరుతి లింగం దగ్గర మంత్ర సాధన చేసుకునేవారు కచ్చితంగా అక్కడ జపం చేసుకుంటే వెయ్యి రెట్లు ఫలితం ఉంటుందట. ఏ మంత్రము లేనివారు పంచాక్షరి మంత్రాన్ని జపించుకోవచ్చని పండితులు చెప్తున్నారు.
ప్రదక్షిణ మొదలుపెట్టే ముందు గాని ‘ మధ్యలో గాని ఎక్కువ ఆహారం తీసుకుని మొదలు పెట్టవద్దు. ఖాళీ కడుపుతో చేసే గిరి ప్రదక్షణ వేగవంతంగా ఉంటుంది. సమూహంగా గిరి ప్రదక్షిణ చేసే కంటే ఏకాంతంగా చేసే గిరి ప్రదక్షణ చాలా ప్రశాంతంగా అద్భుతంగా ఉంటుంది. గిరి ప్రదక్షిణ చేసే సందర్భంలో ఎక్కువసార్లు కూర్చోవడం వలన నరాలు పట్టి నడక వేగం తగ్గిపోతుంది. మాక్సిమం కూర్చోకుండా నిలబడి గానీ ‘ తప్పనిసరి పరిస్థితుల్లో అయితే బెంచీపై పడుకోండి అంతే కానీ ఎక్కడా కూర్చోకండి.
కొబ్బరికాయలు పట్టుకొని దర్శనానికి వెళ్లే వారు అరుణాచలేశ్వరుని దర్శనం అనంతరం బయటకు వచ్చిన తర్వాత ఎడమవైపు కార్నర్ లో స్వామి వారి ఉత్సవ విగ్రహాలు ఉంటాయి . అక్కడ మీరు ఇచ్చిన కొబ్బరికాయలు కొట్టి గోత్ర నామాలు చదివి విభూతి ప్రసాదంగా ఇస్తారు. కొబ్బరికాయలు లేకపోతే మీ గోత్రనామాలు చదవరు. ఆలయ ప్రాంగణంలోకి మనం అడుగుపెట్టిన తర్వాత ఎడమవైపున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. కచ్చితంగా దర్శనం చేసుకోండి. అగ్ని లింగానికి రమణ మహర్షి ఆశ్రమానికి మధ్యలో దక్షిణామూర్తి ఆలయం ఉంటుంది . చాలా పెద్ద విగ్రహం అత్యంత శక్తివంతమైన విగ్రహం. అరుణాచల శివుడిని దక్షిణామూర్తి స్వరూపంగా కొలుస్తారు. ఒకవేళ మీరు గురువారం రోజున అక్కడ ఉంటే ఖచ్చితంగా దీపం వెలిగించండి .
ఇంకా చాలా విషయాలు ఉంటాయి అవన్నీ మీకు అక్కడికి వెళ్లాక స్వానుభవం అవుతాయి. ప్రశాంతం వెళ్లండి స్వామి, అమ్మవార్లను దర్శనం చేసుకుని అంతే ప్రశాంతంగా తిరిగి రండి.