Ganesh Chaturthi 2025: వినాయక చవితిని ఎంతో భక్తితో ,ఉత్సాహంగా జరుపుకుంటారు. ప్రధానంగా ఈ పండుగ మహారాష్ట్రలో చాలా గొప్పగా నిర్వహిస్తారు. ఈ రోజున, ప్రజలు తమ ఇళ్లలో, మండపాలలో అడ్డంకులను నాశనం చేసే గణేశుడిని ప్రతిష్టించి పది రోజుల పాటు పూజిస్తారు. ఈ సమయంలో.. వినాయకుడిని ఆరాధించడం వల్ల ఇంట్లో, కుటుంబంలో ఆనందం, శ్రేయస్సు, అదృష్టం లభిస్తాయని నమ్ముతారు.
ఈ సంవత్సరం పవిత్రమైన వినాయకుడి పండుగను ఆగస్టు 27వ తేదీన బుధవారం నాడు జరుపుకోనున్నాము. ఈ పది రోజులు చాలా ప్రత్యేకమైనవి. ఇదిలా ఉంటే.. మత విశ్వాసాల ప్రకారం.. గణేష్ చతుర్థికి ముందు ఇంటి నుంచి బయటపడేయాల్సిన కొన్ని వస్తువులు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ వస్తువులను ఇంట్లో ఉంచవద్దు:
విరిగిన లేదా దెబ్బతిన్న విగ్రహాలను ఇంట్లో ఎప్పుడూ ఉంచకూడదని వాస్తు శాస్త్రం చెబుతుంది. కాబట్టి.. చాలా పాత విగ్రహాలను కూడా ఇంట్లో ఉంచుకోవడం శుభప్రదంగా పరిగణించబడదు. అలాంటి విగ్రహాలు మీ ఇంట్లో ఉంటే.. వాటిని నదిలో లేదా ప్రవహించే నీటిలో నిమజ్జనం చేయండి.
గణపతిని ఇంట్లో ప్రతిష్టించే ముందు, ఇంటి నుంచి అనవసరమైన వస్తువులను తొలగించాలి. వాస్తు శాస్త్రం ప్రకారం.. పనికిరాని వస్తువులు ఇంట్లో ప్రతికూల శక్తిని పెంచుతాయి. కాబట్టి.. ఇంటిని శుభ్రపరచడంతో పాటు, పాత , అనవసరమైన వస్తువులను కూడా బయట పడేయాలి.
వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంట్లో విరిగిన లేదా ఆగిపోయిన గడియారాన్ని ఉంచుకోవడం అశుభంగా పరిగణించబడుతుంది. దీని వల్ల ఇంట్లో పేదరికం, దురదృష్టం ఏర్పడతాయి. మీ ఇంట్లో గడియారం విరిగిపోతే.. వెంటనే దాన్ని రిపేర్ చేయించండి. లేదా తీసివేయండి.
గణపతి పూజ కోసం కేటాయించిన స్థలాన్ని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలి. పూజా సమయంలో సమర్పించిన పువ్వులు, దండలు, ఆకులను ఒకే చోట చాలా రోజులు ఉంచడం వాస్తు ప్రకారం శుభప్రదంగా పరిగణించబడదు. పూజా స్థలాన్ని క్రమం తప్పకుండా శుభ్రం చేసి శుభ్రంగా ఉంచడం ద్వారా.. బప్పా ఆశీస్సులు లభిస్తాయి. పూజలో ఎటువంటి ఆటంకం ఉండదు.