Uttam Kumar Reddy: వానాకాలం ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై.. నీటిపారుదల శాఖామంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం పౌర సరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, డైరెక్టర్లు, ఇతర ఉన్నతాధికారుల హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా సాగు పరిస్థితులు, దిగుబడి అంచనాలు, కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లు, రైతులకు చెల్లింపుల సమయపాలన వంటి అంశాలపై సమగ్ర చర్చ జరిగింది.
ఉత్తమ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం వానాకాలం సీజన్‌లో చరిత్రాత్మక రికార్డు సృష్టించబోతోందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సీజన్‌లో 67.57 లక్షల ఎకరాల్లో ధాన్యం సాగు జరిగిందని అన్నారు. అందులో 40.75 లక్షల ఎకరాల్లో సన్నాలు, 26.82 లక్షల ఎకరాల్లో దొడ్డు వడ్ల సాగు నమోదైందని వివరించారు. ఈ సాగు ఆధారంగా రాష్ట్రానికి 148 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి రానుందని అంచనా వేశారు. ఇది భారతదేశ చరిత్రలోనే ఒక సరికొత్త రికార్డు అవుతుందని ఆయన స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు సిద్ధమవుతోందని, ఇప్పటికే సంబంధిత పౌర సరఫరాల శాఖ, మార్కెటింగ్ శాఖ, సహకార సంఘాలు, ఇతర సంస్థలను ఏర్పాటు చేసినట్టు మంత్రి తెలిపారు. తెలంగాణ రైతాంగం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ.. ఇంత పెద్ద ఎత్తున ఉత్పత్తి సాధించడం గర్వకారణమని ఆయన ప్రశంసించారు.
ధాన్యం రకానుసారం సన్నాలు 90.46 లక్షల మెట్రిక్ టన్నులు, దొడ్డు వడ్లు 57.84 లక్షల మెట్రిక్ టన్నులు లభించనున్నాయని చెప్పారు. ఈ సంఖ్యలు తెలంగాణ ఆవిర్భావం తరువాత అత్యధిక ఉత్పత్తిగా నమోదవుతాయని, రైతులు కష్టపడి సాధించిన ఈ విజయానికి రాష్ట్ర ప్రభుత్వం గర్వపడుతోందని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
ధాన్యం కొనుగోలుకు సంబంధించిన వ్యయంపై మంత్రి వివరించారు. కనిష్ట మద్దతు ధర కింద రైతులకు చెల్లించడానికి సుమారు ₹21,112 కోట్లు అవసరమవుతాయని, ఈ మొత్తంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం చెల్లించాల్సిన ₹6,500 కోట్లు తక్షణమే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులకు చెల్లింపుల్లో జాప్యం జరగకుండా ఉండటానికి రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ప్రణాళిక రూపొందించినట్టు ఆయన తెలిపారు.
అంతేకాకుండా, వానాకాలం సన్నాలు పండించిన రైతులకు ప్రతి క్వింటాల్‌పై ₹500 బోనస్ అందజేయనున్నట్టు మంత్రి ప్రకటించారు. అలాగే యాసంగి పంటలకు బోనస్ చెల్లింపుల కోసం సుమారు ₹3,159 కోట్లు అవసరమవుతాయని వివరించారు. ఈ బోనస్ పథకం ద్వారా రైతులు మరింత ఉత్సాహంగా పంట ఉత్పత్తి పెంచుతారని ఆయన అభిప్రాయపడ్డారు.
Also Read: సిరిమానోత్సవంలో అపశృతి.. బొత్స కి తప్పిన ప్రమాదం
వానాకాలం ధాన్యం సేకరణకు క్లస్టర్ ఆధారిత కొనుగోలు కేంద్రాలు.. ఏర్పాటు చేయబడుతున్నాయని, రైతులు ఎటువంటి ఇబ్బంది లేకుండా.. పంటను విక్రయించుకునేలా సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. పంట కొనుగోలు కేంద్రాలలో మిల్లర్లు, మార్కెట్ కమిటీ అధికారులు, పౌర సరఫరాల శాఖ సిబ్బందికి తగిన సూచనలు ఇచ్చినట్టు తెలిపారు.