Chiranjeevis: వందలు కాదు వేలు కాదు ఏకంగా లక్షల సంవత్సరాలు వారు బతికే ఉన్నారట. ఇంకా లక్షల సంవత్సరాలైనా వాళ్లు బతికే ఉంటారట. ఇది చదవటానికి వింతగా విడ్డూరంగా అనిపించినా ఇదే నిజమని ఘోషిస్తున్నాయి హిందూ గ్రంథాలు. ఇంతకీ లక్షల సంవత్సరాలు అయినా బతికే వాళ్లు ఎవరు..? వాళ్లు అలా బతకడానికి గల కారణాలు ఏంటి అనే ఆసక్తికరమైన విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
ఈ కాలంలో ఒక మనిషి వంద సంవత్సరాలు బతికాడంటేనే చాలా ఆశ్చర్యంగా చూస్తారు. కానీ ఇప్పటికీ కొంత మంది లక్షల సంవత్సరాలుగా బతికే ఉన్నారంటే నమ్ముతారా..? ఇంకా లక్షల సంవత్సరాలు బతుకుతారంటే అసలు నమ్మరు కదా..? కానీ కొంత మంది మాత్రం యుగాలు ఈ భూమ్మీదే జీవిస్తున్నారని.. ఇంకా కలియుగం పూర్తయ్యే వరకు అంటే దాదాపు నాలుగు లక్షల సంవత్సరాలు బతుకుతారని హిందూ పురాణాలు తెలియజేస్తున్నాయి. హిందూ పురాణాల ప్రకారం లక్షల సంవత్సరాలు బతికే వారిని సప్త చిరంజీవులు అంటారట. ఆ సప్త చిరంజీవులు ఎవరో..? ఇప్పుడు తెలుసుకుందాం.
హనుమంతుని పేరు చెబితే భక్తికి శక్తికి తార్కాణంగా అందరూ భక్తి పారవశ్యంతో పొంగిపోతారు. శ్రీరాముని పట్ల అచంచలమైన భక్తి కలిగిన వ్యక్తిగా హనుమంతుడి పాత్ర మనందరికీ సుపరిచితమే అలాంటి హనుమంతుడు ఇప్పటికీ ఈ భూమ్మీద బతికే ఉన్నాడని పురాణాలు చెప్తున్నాయి. ఆ మధ్య హిమాలయాల్లో హనుమంతుని జాడలు కనిపించాయని కూడా వార్తలు వచ్చాయి. రామనామం ఎక్కడ వినిపిస్తే అక్కడ హనుమంతుడు ఉంటాడని కూడా భక్తుల నమ్మకం. కలియుగాంతం వరకు హనుమంతుడు ఈ భూమ్మీద ఉంటాడట. అందుకే సప్త చిరంజీవులలో మొదటివాడు హనుమంతుడు.
వేదవ్యాసుడి అసలు పేరు కృష్ణద్వైపాయణుడు. వేదాలను నాలుగు భాగాలు విభజించారు కాబట్టే ఈ మహర్షిని వేద వ్యాసుడు అంటారు. ఈయన ద్వాపరయుగంలో జన్మించారు. సప్త చిరంజీవులలో రెండో వాడు వేద వ్యాసుడు. మహాభారతం, వేదాలు, అష్టాదశ పురాణాలను ఈ లోకానికి అందించాడని ప్రతీతి.
పరుశరాముడు అతి శక్తివంతమైన విష్ణువు యొక్క ఆరవ అవతారం. అన్యాయాన్ని ఎదిరించే ధైర్యం. యుద్ద విద్యలో ప్రావీణ్యం సాధించిన గొప్ప వీరుడు. రాబోయే కల్కి అవతారానికి గురువు ఉండాల్సి వ్యక్తి పరుశరాముడు. అందుకే కలియుగాంతం వరకు ఈ భూమ్మీద బతికి ఉండాల్సిన వ్యక్తి పరుశరాముడు అని చెప్తుంటారు.
రాక్షస చక్రవర్తి అయిన రావణాసురుడి తమ్ముడు విభీషణుడు. త్రేతాయుగానికి చెందిన ఈయన ఇప్పటికీ బతికే ఉన్నారని.. కలియుగాంతం వరకు బతికే ఉంటారని.. హిందూ గ్రంథాలలో ఉన్నట్టు పండితులు చెప్తుంటారు. ఇప్పటికి కర్ణాటకలోని ఓ రామాలయంలో ప్రతి రోజు తెల్లవారుజామున పూజలు చేసి వెళ్తుంటారని కూడా చెప్తుంటారు.
ద్వాపర యుగానికి చెందిన అశ్వత్థామ కౌరవ, పాండవులు గురువైన ద్రోణాచార్యుని కుమారుడు. కురుక్షేత్ర యుద్ద సమయంలో తల్లి కడుపులో ఉన్న అర్జునుడి కొడుకును చంపిన పాపానికి గానూ శ్రీకృష్ణుడి శాపం వల్ల కలియుగాంతం వరకు బతికే ఉంటాడని పురాణాల్లో ఉన్నట్టు హిందూ పండితులు చెప్తుంటారు. శ్రీమహావిష్ణువు కల్కి అవతారం ఎత్తినప్పుడు ఆయనకు సహాయంగా మంచి కోసం చేసే యుద్దంలో అశ్వత్థామకు శాప విముక్తి కలుగుతుందని చెప్తుంటారు.
రాక్షస రాజు అయినప్పటికీ గొప్ప దాతగా సత్యసంధుడిగా పేరు పొందాడు. వామనుడికి తన సర్వస్వం దానం చేసిన త్యాగశీలి. ప్రతి సంవత్సరం ఓనం పండుగ సమయంలో ( కేరళలో ప్రజలు జరుపుకునే పండుగ) తన ప్రజలను చూడటానికి వస్తాడని నమ్మకం.
కురువంశపు గురువు. యుద్ధ నీతిని, రాజ ధర్మాన్ని పాటించడంలో నిష్పాక్షికతకు పెట్టింది పేరు. బాధ్యతను సక్రమంగా నిర్వహించడంలో ఈయనకు సాటి ఎవ్వరూ ఉండరట. అలాంటి కృపాచార్యుడు కూడా ఇప్పటికీ బతికే ఉన్నాడని పురాణాలు ఉందని చెప్తుంటారు.
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.