82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం గురించి చాలామందికి తెలుసు. ఇండియన్ స్టాండర్డ్ టైమ్ ని ఈ రేఖాంశం ఆధారంగానే పరిగణిస్తారు. అయితే భారత దేశానికి సంబంధించి 79 డిగ్రీల తూర్పు రేఖాంశానికి కూడా ఓ ప్రత్యేకత ఉంది. అదేంటో తెలుసా.. ఆ రేఖాంశం అనేక పురాతన ఆలయాలకు ఆలవాలం. సరిగ్గా అదే రేఖాంశాన్ని ఆధారంగా చేసుకుని ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు అనేక పవిత్రమైన ఆలయాల నిర్మాణం జరిగింది. సరిగ్గా ఆ రేఖాంశం మీదుగా ఈ నిర్మాణం జరగడం, అది కూడా అక్షాంశాలు, రేఖాంశాలు అని మనం లెక్కలు వేసుకోకముందే ఆ నిర్మాణాలు జరగడం విశేషం. ఇది మన సనాతన ధర్మం గొప్పదనం. మన పూర్వీకుల మేధస్సుకి తార్కాణం.
మొదటిది కేదార్ నాథ్..
79 డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని శివ శక్తి ఆకాశ రేఖ, లేదా శివశక్తి అక్షాంశం అని పిలుస్తారు. ఈ రేఖ భారత దేశాన్ని తూర్పు పడమరలుగా విభజిస్తుంది. ఉత్తర భారత దేశంలో ఈ రేఖపై ప్రముఖ ఆలయాలున్నాయి. అందులో మొదటికి కేదార్ నాథ్ క్షేత్రం. ఉత్తరాఖండ్ లో ఉన్న ఈ జ్యోతిర్లింగ క్షేత్రం శివశక్తి ఆకాశరేఖపైనే ఉంది. రెండోది బద్రీనాథ్ క్షేత్రం. ఇది వైష్ణవ ఆలయం. ఇది కూడా ఉత్తరాఖండ్ లోనే ఉంది. శివశక్తి ఆకాశ రేఖపై శివాలయాలతోపాటు విష్ణుమూర్తి ఆలయాలు కూడా ఉండటం విశేషం.
జ్యోతిర్లింగ క్షేత్రాలు ఓంకారేశ్వర్, మహాకాళేశ్వర్..
మధ్యప్రదేశ్ లోని ఓంకారేశ్వర్, మహాకాళేశ్వర్ ఆలయాలు కూడా శివశక్తి ఆకాశ రేఖ దగ్గరే ఉన్నాయి. ఈ రెండూ జ్యోతిర్లింగ క్షేత్రాలు. శివారాధకులకు జ్యోతిర్లింగ క్షేత్రాలు అత్యంత పవిత్రమైనవి. జ్యోతిర్లింగ క్షేత్రాల దర్శనం సకల పాప హరణం అంటారు. అలాంటి జ్యోతిర్లింగ క్షేత్రాలతోపాటు ఇతర ప్రముఖ ఆలయాలన్నీ శివశక్తి రేఖను ఆనుకునే ఉండటం విశేషం.
తెలంగాణలో కాళేశ్వరం
తెలంగాణలోని కాళేశ్వరం సరిగ్గా శివశక్తి రేఖపై ఉంటుంది. ఈ ఆలయం గోదావరి, ప్రాణహిత కలసిన ప్రాంతంలో నిర్మించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాల్లో కాళేశ్వరం ప్రముఖమైనది. కాళేశ్వర ఆలయం కాస్త అటు ఇటు కాకుండా సరిగ్గా 79 డిగ్రీల తూర్పు రేఖాంశంపైనే ఉండటం విశేషం.
ఆంధ్ర ప్రదేశ్ లోని శ్రీశైలం
ఆంధ్రప్రదేశ్ లోని జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలం. ఇది కూడా శివశక్తి రేఖపైనే ఉంది. శ్రీశైల క్షేత్రానికి మరో ప్రాముఖ్యత ఉంది. ఇది అమ్మవారి శక్తిపీఠం కూడా. ఇక్కడ భ్రమరాంబికా దేవి కొలువై ఉంది. శివుడు, శక్తి.. ఈ రెండు రూపాలకు ఈ క్షేత్రం ప్రసిద్ధి. అలాంటి ఈ క్షేత్రం కూడా శివశక్తి రేఖపైనే ఉంటుంది.
తిరుమల, కాళహస్తి..
విష్ణు ఆలయాల్లో ప్రముఖమైనది తిరుమల. తిరుమలలో శ్రీ వెంకటేశ్వరుడు కొలువై ఉన్నాడు. ఈ ఆలయం కూడా శివశక్తి ఆకాశ రేఖపైనే ఉంటుంది. ఇక తిరుమల క్షేత్రానికి సమీపంలో ఉన్న మరో ఆలయం శ్రీకాళహస్తి. కాళహస్తీశ్వరుడు వాయులింగం రూపంలో కొలువైన క్షేత్రం ఇది. పంచభూతాల రూపంలో ఐదు ఆలయాల్లో పరమేశ్వరుడు వివిధ ప్రాంతాల్లో దర్శనమిస్తాడు. ఆ పంచభూత ఆలయాల్లో ఒకటి వాయులింగం ఉన్న కాళహస్తీశ్వరాలయం. ఈ ఆలయం కూడా శివశక్తి ఆకాశ రేఖపై ఉంది.
అరుణాచలం – అగ్ని లింగం
పరమేశ్వరుడు నటరాజు రూపంలో కొలువైన ఆలయం చిదంబరేశ్వరాలయం. ఇది కూడా పంచభూత శివలింగాల్లో ఒకటి. ఇక్కడ శివలింగం ఆకాశానికి ప్రతిరూపం. తమిళనాడులోని చిదంబరం క్షేత్రం కూడా శివశక్తి రేఖపైనే ఉంది. కాంచీపురంలోని ఏకాంబరేశ్వర ఆలయం కూడా ఇదే రేఖపై ఉంది. ఇక్కడ శివలింగం భూమికి ప్రతీక. తిరువన్నామలై లోని అరుణాచలేశ్వర ఆలయం కూడా ఇదే రేఖాంశంపై ఉంది. ఇక్కడ శివలింగం అగ్నికి ప్రతీక. అగ్నిలింగాన్ని దర్శించుకోవడం జన్మ జన్మల సుకృతంగా భావిస్తారు. రామేశ్వరంలోని రామనాథ స్వామి ఆలయం ఈ రేఖాంశంపై దక్షిణ కొనలో ఉన్న చివరి ఆలయం. ఈ ఆలయాన్ని కూడా పరమపవిత్ర క్షేత్రంగా భావిస్తారు.
శివశక్తి ఆకాశ రేఖ మహిమ..
ఈ ఆలయాల నిర్మాణం అద్భుతం, అనన్య సామాన్యం. సనాతన ధర్మం పరిఢవిల్లిన సమయంలో ఈ ఆలయాలను అద్భుత మేధస్సుతో నిర్మించారు. ఇవన్నీ ఒకే రేఖపై ఉండటం నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. శివశక్తి రేఖకు ఏదో ఒక మహిమ ఉండటం వల్లే వీటన్నిటినీ ఇలా నిర్మించారని, అందుకే ఇవన్నీ నేటికీ ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలుగా వెలుగొందుతున్నాయని భక్తుల నమ్మకం.