హిందూమతంలో పవిత్రమైనది శ్రావణమాసం. ఈ శ్రావణమాసంలో ఎంతోమంది లక్ష్మీదేవినే కాదు శివుడిని కూడా పూజిస్తారు. శివుడికి అభిషేకం చేసి అతడి అనుగ్రహాన్ని పొందాలని చూస్తారు. ధాతురా, నందివర్ధనాలు, గులాబీలు ఇలా ఎన్నో పువ్వులను శివలింగానికి అర్పిస్తారు. కానీ శివుడికి సమర్పించకూడని ఒక పువ్వు ఉంది. ఆ పువ్వును సమర్పిస్తే శివుడి కోపానికి గురవుతారు. అదే మొగలిపువ్వు.
బ్రహ్మ విష్ణువుల మధ్య పోటీ
మొగలి పువ్వులను కేతకి పువ్వులు అని కూడా పిలుస్తారు. శివపురాణం ప్రకారం కేతకి పువ్వు అంటే శివునికి నచ్చదు. దానికి కారణం కూడా ఉంది. ఒకసారి విష్ణువు, బ్రహ్మ మధ్య ఒక వివాదం మొదలవుతుంది. వారిద్దరిలో ఎవరు ఉత్తముడు అనే విషయంపై వాదించుకుంటారు. ఆ వివాదాన్ని శివుడి వద్దకు తీసుకువెళ్తారు. అప్పుడు శివుడు ఒక శివలింగాన్ని సృష్టించి ఆ శివలింగం ముగింపు ఎక్కడ ఉందో కనుక్కోమని చెబుతారు. ఎవరైతే అలా కనుగొంటారో వారే ఉత్తములనే చెబుతారు. అప్పుడు శివలింగం పైకి విష్ణువు వెళ్లి వెతుకుతూ ఉంటాడు. బ్రహ్మదేవుడు శివలింగం ముగింపును కనుక్కోవడానికి కింద ప్రాంతానికి వెళ్తాడు. విష్ణు శివలింగం ముగింపును కనుగొనలేక తన ఓటమిని అంగీకరిస్తాడు. విష్ణువు లాగే బ్రహ్మ దేవుడు కూడా శివలింగం ముగింపును తెలుసుకోలేక పోతాడు.
మొగలి పువ్వు చేసిన తప్పు ఇదే
తిరిగి వారిద్దరూ శివుని వద్దకు ప్రయాణమవుతారు. బ్రహ్మదేవుడు అలా వెళుతూ ఉండగా దారిలో మొగలి పువ్వు కనిపిస్తుంది. బ్రహ్మ ఆ మొగలి పువ్వును సాయం కోరుతాడు. శివుడి వద్దకు వచ్చి తనకు మద్దతుగా మాట్లాడమని చెబుతాడు. దానికి మొగలిపువ్వు ఒప్పుకుంటుంది. బ్రహ్మ, మొగలిపువ్వు కలిసి శివుని వద్దకు వెళతారు. మొగలిపువ్వు బ్రహ్మ దేవుడికి మద్దతు ఇస్తూ శివలింగం ముగింపును బ్రహ్మ కనుగొన్నాడని అబద్ధం చెపుతుంది. అది అబద్ధమని తెలుసుకున్న శివుడికి విపరీతమైన కోపం వస్తుంది. ఆ కోపంతో బ్రహ్మ ఐదవ తలను నరికి వేస్తాడు. ఇక అబద్ధం చెప్పిన మొగలి పువ్వును ఏ పూజకు పనికిరాకుండా ఉండమని శపిస్తాడు. అప్పటినుంచి మొగలి పువ్వులను పూజల్లో వాడడం పూర్తిగా నిషేధించారు.
శివునికి స్వయంగా కోపం తెప్పించిన మొగలిపువ్వును శివ పూజలో వాడితే ఆ శివుని ఆగ్రహానికి గురవ్వాల్సిందే. ఇప్పటికీ మొగలి పువ్వులను ఎక్కడా వాడరు. ఎంతో సుగంధం వేస్తున్నా కూడా అవి అలా వృధా కావడమే తప్ప మొగలి పువ్వులను పూజలో వాడే వారు ఎవరూ లేరు.