శనివారం ఏ వస్తువులు పడితే ఆ వస్తువులు కొనకూడదు. ఆరోజు కొనే వస్తువులను చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి. అలా మీరు శనివారం కొనకూడని వస్తువులలో ఇనుము కూడా ఒకటి. నేరుగా ఇనుము ముక్కలను ఎవరూ కొనరు. కానీ ఇనుముతో చేసిన వస్తువులను కొనే అవకాశం ఉంది. ఇనుముతో చేసిన చాకులు, గిన్నెలు, ఇంట్లో వాడే ఇతర ఉపకరణాలు ఏవైనా శనివారం మాత్రం కొనకండి. అలా కొంటె దురదృష్టం వెంటాడుతుంది. శని దేవుడు ఆగ్రహానికి మీరు గురవుతారు.
శనివారం శని దేవుని రోజు అని నమ్ముతారు. శనివారం ఇనుమును కొనుగోలు చేస్తే శని దేవునికి ఆగ్రహం రావచ్చు. శని దేవుడి ప్రభావం మీపై ప్రతికూలంగా ఉండవచ్చు. ఇనుమును శనిదేవునికి కారకంగా పరిగణిస్తారు. శనివారం ఇనుము కొనడం వల్ల శని దేవుడి చూపు మీపై చెడుగా పడే అవకాశం ఉంటుంది.
ఇనుముతో శని దేవుడి బంధం
శని దేవుడికి ఇనుముతో అనుబంధం ఉందని అంటారు. శనిగ్రహం ఇనుము వల్ల బలంగా మారుతాడని చెబుతారు. ఇనుము కూడా స్థితిస్థాపకతకు, బలానికి చిహ్నంలా ఉంటుంది. అందుకే శని జయంతి రోజున ఇనుము వస్తువులను దానం చేయడం, ఇనుముతో చేసిన వస్తువులను ధరించడం వల్ల శని దోషం నుండి రక్షణ పొందవచ్చు. కానీ శనివారం పూట మాత్రం ఇనుముతో చేసిన వస్తువులను కొనడానికి దూరంగా ఉండాలి.
శని దేవుడిని ప్రతీకారం, న్యాయం, కర్మ దేవుడిగా పరిగణిస్తారు. మీరు చేసే ప్రతి పనిని ఆచితూచి శిక్షను వేసేది ఆయనే. శని దేవుడు ఇనుము ద్వారానే నియంత్రణలోకి వస్తాడని కూడా నమ్ముతారు. శని దోషం ఉన్నవారు ఇనుము వస్తువులను దానం చేస్తే శని దేవుడిని ప్రసన్నం చేసుకోవచ్చని కూడా చెబుతారు.
ఇనుముతోనే ఆయుధాలను, తాయెత్తులను తయారు చేస్తూ ఉంటారు. ఇలా ఇనుముతో తయారుచేసిన వాటిని వాడడం వల్ల శని దేవుడు పెట్టే కష్టాలను, అడ్డంకులను అధిగమించే సామర్థ్యం వస్తుందని నమ్ముతారు. శని దేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు ఆయన ఆలయాలకు వెళ్లి ఇనుముతో తయారు చేసిన వస్తువులను అంటే ఇనుప మేకులను సమర్పించి వస్తే ఎంతో మేలు జరుగుతుంది. శని దుష్ప్రభావాలు ఆ భక్తుడి జీవితంపై చాలావరకు తగ్గుతాయని చెబుతారు. అలాగే శని దోషంతో బాధపడేవారు శని ప్రతికూల ప్రభావాన్ని తప్పించుకోవడానికి ఇనుముతో చేసిన వస్తువులను, పాత్రలను దానం చేస్తే మేలు జరుగుతుంది. దానధర్మాలు శని గ్రహాన్ని శాంతింపజేస్తాయి. శక్తిని సమతుల్యం చేస్తాయి.
సూర్యుడి నుండి ఆరవ గ్రహమైన శని క్రమశిక్షణకు, బాధ్యతకు, కృషికి మూలమైనది. వేద జ్యోతి శాస్త్రంలో శని గ్రహాన్ని నెమ్మదిగా కదిలే గ్రహంగా పరిగణిస్తారు. ఎందుకంటే ఒక రాశి నుండి మరో రాశికి శనిగ్రహం సంచరించాలంటే కనీసం రెండున్నర సంవత్సరాలు పడుతుంది. ఆ రెండున్నర సంవత్సరాలు ఆ రాసి జాతకునికి సవాళ్లు, ఆటంకాలు, పోరాటాలతో నిండిన జీవితం వస్తుంది. కానీ పట్టుదలతో, కృషితో ముందుకు వెళితే మాత్రం మంచి ఫలితాలను ఇచ్చే గ్రహం శని. ఇనుములాగానే శని శక్తి కూడా చాలా బరువుగా ఉంటుంది. ఇనుము ఎంత కఠినంగా ఉంటుందో… శని వల్ల కలిగే సమస్యలు కూడా అంతే కఠినంగా ఉంటాయి. ఇలా ఇనుముకు, శని దేవుడికి మధ్య ఎన్నో సారూప్యతలు అనుబంధాలు ఉన్నాయి.