BigTV English

Dasara 2023 : అపరాజితా.. నమోస్తుతే..!

Dasara 2023 : అపరాజితా.. నమోస్తుతే..!
Dasara 2023

Dasara 2023 : దేశవ్యాప్తంగా దసరా వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. తొమ్మిది రోజులుగా వివిధరూపాల్లో దర్శనమిచ్చిన లోకజనని.. నేడు పదవ రోజున అపరాజితగా దర్శనమివ్వనుంది. లోకకంటకుల పట్ల రౌద్రం ప్రదర్శించిన జగన్మాత.. తన భక్తులకు అపరాజితాదేవిగా నేడు దర్శనమిస్తుంది.


శత్రువులపై విజయం సాధించేందుకు శక్తి అనుగ్రహం కావాలి. ఆ శక్తే అపరాజిత. ఈ శక్తి ఆశ్వీయజ శుక్ల దశమి తిథిన నక్షత్రోదయ సమయంలో ప్రకృతిలో ఆవహించి జనులకు సకల సుఖాలు ప్రసాదిస్తుందని శాస్త్రం.

దుర్గాదేవికి గల పలు నామాల్లో ‘అపరాజిత’ అనే నామం ఒకటి. అంటే పరాజయమే లేనిదని అర్థం. సకల విజయాలకు ఈ తల్లి అధిదేవత. ‘సర్వకామ్యార్థ సాధనం అపరాజిత పూజనం’ అని చింతామణి గ్రంథం చెబుతోంది.


‘యాదేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా.. నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః’ ( ఏ తల్లి అన్ని జీవుల్లోనూ శక్తి రూపంలో కొలువై ఉంటుందో.. ఆమెయే అపరాజిత) అని అపరాజిత స్తుతి పేర్కొంటోంది.

అపరాజితాదేవి శమీవృక్షంలో(జమ్మిచెట్టులో) కొలువై ఉంటుంది. క్షీరసాగర మథనంలో పుట్టిన దేవతా వృక్షాలలో జమ్మి ఒకటి. దీనిని ‘అగ్నిగర్భ’ అంటారు. యజ్ఞ యాగాదులలో అగ్ని మథనానికి (నిప్పు రాజేయడానికి) దీనినే వాడతారు.

శ్రవణానక్షత్రంతో కూడిన ఆశ్వీయుజ శుక్ల దశమినాటి ‘విజయ’ ముహూర్తంలో రావణవధకు బయలుదేరిన రాముడు.. శమీవృక్ష రూపంలో ఈ దేవిని అర్చించారని, అలాగే. దేవదానవులు పాలసముద్రాన్ని ఈ వేళనే చిలికారని పురాణకథనం.
అందుకే ఈరోజు అందరూ సాయంత్రం వేళ జమ్మ చెట్టును పూజించి, నమస్కరిస్తారు. ‘శమీ శమయతే పాపం.. శమీ శత్రు వినాశినీ… అర్జునస్య ధనుర్ధారీ.. రామస్య ప్రియదర్శినీ’ అనే శ్లోకాన్ని పఠిస్తూ, జమ్మిచెట్టుకు ప్రదక్షిణలు చేయడం వల్ల శనిదోషాలు తొలగిపోతాయని చెబుతారు.

ఈ రోజునే పాండవులు శమీవృక్షంపై ఉన్న తమ ఆయుధాలను తీసుకున్నారని మహాభారతం చెబుతోంది.

పూర్వం రామచంద్రుని పూర్వీకుడైన రఘుమహారాజు కోసం కుబేరుడు జమ్మిచెట్టుపై ‘బంగారు వాన’ కురిపించాడనీ, అందుకు గుర్తుగా నేటికీ దసరా సాయంత్రం జమ్మిఆకును బంగారంగా పంచుకుంటూ పెద్దలకు నమస్కరించటం తెలంగాణ వ్యాప్తంగా ఆచారంగా కొనసాగుతోంది. ఈ రోజు సాయంత్రం శమీపూజతో బాటు పాలపిట్టను చూడటం సంప్రదాయంగా వస్తోంది. పాండవులు అరణ్య, అజ్ఞాతవాసాలు ముగించుకొని వస్తూ పాలపిట్టను చూశారని, నాటినుంచి వారికి అన్నీ జయాలేనని చెబుతారు.

సకల శుభాలకు నెలవైన ఈ దసరా రోజున ఆ అపరాజిత కృపతో మనందరికీ జయాలు కలగాలని మనసారా ఆకాంక్షిస్తూ.. ఆ అమ్మను మనసారా పూజిద్దాం.

Related News

Vastu Tips:ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి..సంతోషంగా ఉండాలంటే ?

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Big Stories

×