హిందూమతంలో ఎంతోమంది దేవతలు. వారిలో కొంతమంది నిత్యం పూజలను అందుకుంటారు. హిందూ సాంప్రదాయాల ప్రకారం, పురాతన గ్రంథాల ప్రకారం లెక్కలేనన్ని మంది దేవతలు ఉన్నారు. సంపదనిచ్చే దేవతలు, యుద్ధంలో కాపాడే దేవతలు, ఆరోగ్యాన్ని ఇచ్చే దేవతలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది దేవతలు. అయితే శివుడు, పార్వతి, దుర్గా దేవి, సరస్వతీ, లక్ష్మీ దేవి, వినాయకుడు, వెంకటేశ్వరుడు వంటి వారే ఇప్పుడు ఎక్కువగా పూజలను అందుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా వీరికి ఎన్నో ఆలయాలు కూడా ఉన్నాయి. అయితే ఇతర దేవతలు కూడా ఎంతోమంది ఉన్నారు. ముఖ్యంగా చాలా తక్కువ మందికి తెలిసిన స్త్రీ దేవతలు కొంతమంది ఉన్నారు. వీరి గురించి తెలుసుకోవడం ఆసక్తికరంగా కూడా ఉంటుంది.
వారుణీ దేవి
వారుణీ దేవి సముద్ర మథనం సమయంలో ఉద్భవించింది. ఆమె ఆనందాన్ని ఇచ్చే దేవత. మనసులో ఆనందమనే మత్తును నింపుతుందని చెప్పుకుంటారు. అందమైన దేవతగా కూడా పురాణాలు చెబుతాయి. ఈమె ద్రాక్షరసం, తేనె పాత్రను చేత్తో పట్టుకొని ఉంటుంది. ఈమె మత్తును కలిగించే దేవత అని అంటారు. కొన్ని తాంత్రిక పద్ధతుల్లో ఈమె ప్రస్తావన ఉందని కూడా నమ్ముతారు.
అలక్ష్మి
సముద్ర మథనం సమయంలో లక్ష్మీదేవి కంటే ముందు ఆమె అక్క అయిన అలక్ష్మి ఉద్భవించింది. లక్ష్మీదేవి సంపదకు, శ్రేయస్సుకు అధిదేవత. అయితే అలక్ష్మి ఆమెకు పూర్తిగా వ్యతిరేకం. పేదరికాలను, కలహాలను, దురదృష్టాన్ని అందిస్తుంది. ప్రజల మధ్య విభేదాలను పెంచుతుంది. కుటుంబాల్లో సామరస్యం, సంతోషం లేకుండా చేస్తుంది. అందుకే ఈమెను ఎవరూ పూజించరు. ఆమె గురించి ఎక్కడ ప్రస్తావించరు.
అరణ్యని
అడవులకు దేవత అరణ్యని దేవి. హిందూ ఆచారాలలో ఈమె ప్రస్తావన ఉన్నప్పటికీ ఈమె గురించి ఎంతోమందికి తెలియదు. ప్రకృతిలో ఉన్న అందానికి, పచ్చదనానికి, సమృద్ధికి, శక్తికి ఈమె కారణమని చెప్పుకుంటారు. జంతువులు, మొక్కలు, చెట్లు, ఆకులు, అడవుల్లోని ప్రతి జీవికి ఈమెనే రక్షకురాలని అంటారు. ఆమె ప్రతి ఆకు చప్పుడులో, ఏనుగులు నడుస్తున్న అడుగుజాడల్లో, పక్షుల కిలకిల రావాలలో ఉంటుందని చెప్పుకుంటారు.
కొట్రవై
ఈమెను కొర్రవై అని కూడా పిలుచుకుంటారు. యుద్దానికి ఈమె ప్రతీక. యుద్ధంలో విజయం సాధించడానికి ఈమె కరుణా కటాక్షం ఉండాలని అంటారు. దక్షిణ భారతదేశంలోని గిరిజన గ్రామీణ సంప్రదాయాలలో ఈ దేవత కనిపిస్తుంది. శక్తికి, ధైర్యానికి ప్రకృతి శక్తులకు ప్రతిరూపమైన భయంకరమైన దేవత ఈమె అని చెప్పుకుంటారు. కొందరు ఈయన దుర్గాదేవి అనుకుంటే మరికొందరు కాళీమాత రూపం అని నమ్ముతారు.
మరియమ్మన్
ఈమె దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లోనే చెప్పుకునే దేవత. వ్యాధులను నయం చేసే శక్తి ఈమెకు ఉందని చెబుతారు. తమిళనాడు, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో పూజిస్తారు. అంటువ్యాధుల నుండి రక్షించే రక్షకురాలిగా చెప్పుకుంటారు. వ్యవసాయ ఆధారిత కుటుంబాలకు చెందినవారు తమ పంట పొలాలకు వర్షాల కోసం ఏమైనా ప్రత్యేకంగా పూజిస్తారు.
Also Read: నక్షత్ర మార్పు.. డిసెంబర్ 24 నుంచి వీరు జాక్ పాట్ కొట్టినట్లే !
మానసా దేవి
పాముల దేవత మానసా దేవి. ఈమెను వైద్య దేవతగా కూడా చెప్పుకుంటారు. అలాగే సంతానోత్పత్తికి మానసా దేవి కారణమని అంటారు. పాము కాటుకు నుంచి రక్షించే దేవతని ఈమెను పూజిస్తారు. ఈమె కమలం లేదా పాము సింహాసనంపై కూర్చున్నట్లు చిత్రీకరిస్తారు. అలాగే ఆమె చుట్టూ ఎన్నో సర్పాలు కూడా ఉంటాయి.