ఇండియన్ ఇన్ స్టంట్ మేసేజింగ్ యాప్ అరట్టై సరికొత్త ఫీచర్లతో మరింత అప్ డేట్ కాబోతోంది. వాట్సాప్ ను తలదన్నేలా రూపుదిద్దుకోబోతోంది. యాప్ స్టోర్, గూగుల్ ప్లే స్టోర్ లో అత్యధికంగా డౌన్ లోడ్ చేయబడిన యాప్‌లలో ఒకటిగా మారింది. దేశ వ్యాప్తంగా లభిస్తున్న క్రేజ్ నేపథ్యంలో, దాని మాతృ సంస్థ జోహో ఈ యాప్ కు కొత్త ఫీచర్లను పరిచయం చేయాలని యోచిస్తోంది. ఇందులో భాగంగానే డిజిటల్ రంగంలో అత్యంత డిమాండ్ ఉన్న ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ (E2E) కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించింది.
తాజాగా ఓ జాతీయ ఛానెల్ నిర్వహించిన షోలో అరట్టై మాతృసంస్థ జోహో సీఈవో మణి వెంబు ఈ యాప్ కు సంబంధించి కీలక అప్ డేట్స్ గురించి వివరించారు. E2E ఎన్ క్రిప్షన్ ప్రస్తుతం యాక్టివ్ డెవలప్ మెంట్ లో ఉందన్నారు. త్వరలోనే ఈ వెర్షన్ ను విడుదల చేయనున్నట్లు వెంబు వెల్లడించారు. “మేము ఇప్పటికే కాల్స్, వీడియోల కోసం ఎన్ క్రిప్షన్ కు మద్దతు ఇస్తున్నాము. సీక్రెట్ చాటింగ్ మెసేజ్ ను అవకాశం కూడా అందుబాటులో ఉంది. ఇప్పుడు మేము ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ గురించి వర్క్ చేస్తున్నాం. త్వరలోనే అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్దున్నాం. ప్రస్తుతం మా హై ప్రయారిటీ దాని మీదే కొనసాగుతుంది. “ అని వెంబు వెల్లడించారు.
జోహో అరట్టైలో వినియోగదారు ప్రైవసీ, డేటా భద్రతపై ఎక్కువగా ఫోకస్ చేస్తోంది. వాస్తవానికి ఈ ప్లాట్ ఫారమ్ డబ్బు కోసం ప్రకటనలు, వినియోగదారు డేటాను ఎప్పటికీ ఉపయోగించదని వెంబు వెల్లడించారు. ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్షన్ రోల్ అవుట్ తర్వాత పంపిన వారు, స్వీకరించేవారు మాత్రమే మెసేజ్ లను చదివే అవకాశం ఉంటుందన్నారు. దీని వలన ఎవరికీ ఎలాంటి అంతరాయం కలగదన్నారు. భద్రత, ప్రైవసీ మరింత పెరుగుతుందన్నారు. జోహో కూడా వినియోగదారుడి కంటెంట్ ను యాక్సెస్ చేయలేదని వెల్లడించారు.
సెక్యూరిటీ పుష్ తో పాటు అరట్టై.. థర్డ్ పార్టీ యాప్ లు, సర్వీసులను అందించేలా జోహో నిర్ణయం తీసుకుంటుందని వెంబు వెల్లడించారు. “ఈ ప్లాట్ ఫారమ్ ను ఇతరుల కోసం ఎలా అందుబాటులోకి తీసుకురావావో చూస్తున్నాం. వినియోగదారులకు ఉపయోగపడే యాప్ లను రూపొందించడానికి ప్రయత్నిస్తున్నాం. ఇది ఇతర యాప్స్ తో పోల్చితే పూర్తి భిన్నంగా ఉంటుంది” అన్నారు.
అరట్టై గత కొద్ది రోజులులగా దేశంలో అనూహ్య వృద్ధిని సాధించింది. ఈ ప్లాట్ ఫామ్ రోజుకు దాదాపు 3,500 సైన్ అప్‌లను పొందినట్లు వెంబు వెల్లడించారు. ఆ సంఖ్య గత వారంలో ఒకే రోజులో 350,000కి పెరిగిందన్నారు. ఆ తర్వాత ఒక రోజులో పది లక్షలు దాటినట్లు తెలిపారు.
Read Also: దేశంలో అతిపెద్ద బంగారం మార్కెట్లు.. ఇక్కడ వేలకొద్ది గోల్డ్ షాపులు, లక్షల కోట్ల వ్యాపారం