Engilipoola Bathukamma: ప్రకృతితో మమేకమైన పండుగ బతుకమ్మ. తెలంగాణ సంస్కృతికి ఇది చిహ్నంగా మారిపోయింది. రంగు రంగుల పూలతో బతుకమ్మ పండుగను సందడిగా చేసుకుంటారు తెలంగాణ మహిళలు. అన్ని పండుగలలో ఇది కలర్ ఫుల్ పండుగని చెప్పుకోవచ్చు. అక్టోబర్ 2 నుంచి బతుకమ్మ సంబరాలు మొదలైపోయాయి. మొదటి రోజున ఎంగిలిపూల బతుకమ్మగా నిర్వహించుకుంటారు. ఎవరికైనా సందేహం వచ్చి ఉండొచ్చు ఎంగిలి పూలు అంటే ఏమిటని? ఎంగిలి అంటే అందరికీ తెలిసిందే, పూలు ఎలా ఎంగిలిగా మారాయి అన్నది ఆలోచించి చూడండి. చిన్న లాజిక్ వల్ల ఈ బతుకమ్మకు ఎంగిలిపూల బతుకమ్మ అని పేరు వచ్చింది.
ఎంగిలిపూలంటే ఏమిటి?
బతుకమ్మను పేర్చడం కోసం ఎన్నో రకాల పూలను మహిళలు ఏరి తెచ్చుకుంటారు. అందులో ముఖ్యమైనవి గునుగు, తంగేడు, తామర, గన్నేరు, పారిజాతం, మందార, మొల్ల, కట్ల వంటి పూలు. ఆ పూలను ఎంగిలి బతుకమ్మ పండుగకు ముందు రోజే ఏరి భద్రపరుస్తారు. ముందు రోజు రాత్రి వాటిని సేకరించి ఇంట్లోనే ఉంచుతారు. రాత్రంతా ఇంట్లోనే నిద్ర చేసిన ఆ పువ్వులు మరుసటి రోజుకు ఎంగిలిపూలుగా మారిపోతాయి.
వాటితోనే బతుకమ్మను పేరుస్తారు కాబట్టి ఎంగిలిపూల బతుకమ్మ అనే పేరు వచ్చింది. కొన్ని ప్రాంతాల్లో భోజనం చేశాక ఈ బతుకమ్మను పేరుస్తారు. దాని వల్ల కూడా ఈ బతుకమ్మకు ఎంగిలిపూల బతుకమ్మ అని పేరు వచ్చినట్టు చెప్పుకుంటారు. బతుకమ్మను పేర్చేటప్పుడు నోటితోనే పూల కాడలను చించడం వంటివి చేస్తుంటారు. నోటితో కొరుకుతూ ఉంటారు… దీని వల్ల కూడా ఎంగిల పూల బతుకమ్మ అనే పేరు వచ్చిందని చెబుతారు.
ఎంగిలిపూల బతుకమ్మ రోజు నైవేద్యంగా ప్రత్యేకంగా నువ్వులు, బియ్యప్పిండి, నూకలు కలిపి బతుకమ్మకు తరువాత గౌరమ్మకు సమర్పిస్తారు. బతుకమ్మ పేర్చి ఇంట్లో గౌరమ్మను పూజిస్తారు.
బతుకమ్మ పండుగను ప్రతి ఏటా భాద్రపద బహుళ అమావాస్య నుంచి నిర్వహించుకుంటారు. తొమ్మిది రోజులు పాటు బతుకమ్మ పండుగ సందడిగా సాగుతుంది. సద్దుల బతుకమ్మతో ఈ పండుగ ముగుస్తుంది.
Also Read: నవరాత్రుల్లో అమ్మవారి ఆశీస్సుల కోసం ఏ రంగు దుస్తులు ధరించాలొ తెలుసా ?
తెలంగాణ రాష్ట్రంలో జరుపుకునే అందమైన పండుగల్లో బతుకమ్మ మొదటి స్థానంలో ఉంటుంది. తెలంగాణ ప్రాంతంలో అమావాస్య రోజు ఈ పండుగ మొదలవుతుంది. ఆ అమావాస్యను పెత్రమాసగా పిలుచుకుంటారు. బతుకమ్మను తయారుచేసి ఆ బతుకమ్మ చుట్టూ తిరుగుతూ ఎన్నో పాటలు పాడుతారు. చివరికి నీటిలో నిమజ్జనం చేస్తారు. ఆ తర్వాత ప్రసాదాన్ని అందరూ తింటారు. ప్రకృతిని ఆరాధించే అందమైన వేడుక. బతుకమ్మలు చూడటానికి రెండు కళ్ళు సరిపోవు.