Waiting For Help: మొన్నటి వరకు తన స్నేహితులతో పాటు చక్కగా పాఠశాలకు వెళ్లాడు ఆ విద్యార్థి. చదువులోనూ ప్రతిభ కనబరుస్తూ.. టీచర్స్ మెప్పు పొందేవాడు. అయితే హఠాత్తుగా అనారోగ్యానికి గురయ్యాడు. పాఠశాలకు దూరమయ్యాడు. చివరికి ఆ విద్యార్థి రెండు కిడ్నీలు పాడైపోగా.. మంచానికే పరిమితమయ్యాడు. అసలే రోజువారీ కూలీ పనులు చేసుకుంటూ.. జీవనం సాగించే కుటుంబం ఆ విద్యార్థిది.
కుమారుడు మంచానికే పరిమితం కావడంతో ఆ తల్లి రోదన తీరనిదిగా మారింది. తన కుమారుడు పూర్తి ఆరోగ్యవంతుడై.. మునుపటి లాగా బడికి వెళ్లి చదవాలని.. ఆ తల్లి ఆరాట పడుతోంది. ఎవరో వస్తారని.. ఏదో చేస్తారని ఎదురు చూపుల్లో ఉన్న ఆ కుటుంబానికి ఎవరు వస్తారు.. ఏమి చేస్తారు అంటూ నిట్టూర్చే మాటలు వినిపిస్తున్నాయి. అయినా.. ప్రభుత్వం ఆదుకుంటుందన్న నమ్మకం ఆమెలో కనిపిస్తోంది. మరి ఆ నమ్మకానికి తగినట్లుగా.. ఆ తల్లి రోదన తీరేనా.. ఆ విద్యార్థి మళ్లీ పుస్తకం పట్టేనా.. !
నంద్యాల జిల్లాకు చెందిన విద్యార్థి రిజ్వాన్ గత కొద్ది రోజులుగా.. శ్వాస పీల్చుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవాడు. దీనితో అతని తల్లిదండ్రులు.. పలు వైద్యశాలల చుట్టూ తిరిగారు. తమ కుమారుడి వ్యాధి నయమవుతుందని అనుకున్నారు. అప్పుడే వైద్యులు అసలు విషయాన్ని వారికి తెలిపారు. రెండు కిడ్నీలు చెడిపోయాయని, కిడ్నీ ఇచ్చేందుకు తల్లి ముందుకు వచ్చినా.. మార్పుకు రూ.20 లక్షల ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు.
ఇంకేముంది ఆ తల్లిదండ్రుల బాధ అంతా.. ఇంతా కాదు. అసలే రోజువారీ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారము. ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా రూ.20 లక్షలా అంటూ.. ఎక్కడి నుండి తెచ్చేది… నా కుమారుడికి చికిత్స ఎలా చేయించేది అంటూ రిజ్వాన్ తల్లి రోదనకు గురైంది.
Also Read: Pawan Kalyan: పవన్‌కు అస్వస్థత, ఆ సమస్య తిరగబడిందా?
మొన్నటి వరకు ఆరోగ్యంగా ఉన్న తమ కుమారుడు.. అనారోగ్యానికి గురై మంచానికి పరిమితం కావడంతో ఆ కుటుంబం ఎన్నో రోజులుగా ఆనందాలకు దూరమైంది. అసలే కుమారుడి ఆరోగ్యం కోసం అప్పటికే లక్షల రూపాయలను ఖర్చు చేసిన ఆ కుటుంబం.. ఆకలి మంటలతో జీవనం సాగిస్తోంది. ఈ పరిస్థితుల్లో పలువురు సాయం అందించినా.. ఆ సాయం కుమారుడి వైద్యఖర్చులకు, మందులకు సరిపోతున్నాయి.
అయితే నవమాసాలు మోసిన తల్లి కదా ఎంతైనా.. అందుకే తన బిడ్డకు కిడ్నీ ఇవ్వాలని రిజ్వాన్ తల్లి నిర్ణయించుకుంది. ఇక్కడ ఒక పెద్ద సమస్య వచ్చింది. కిడ్నీ మార్చేందుకు రూ.20 లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. ఇప్పుడు తన కుమారుడికి ప్రాణభిక్ష కోసం ఆ తల్లి ఎదురుచూపులు చూస్తోంది. విద్యార్థి రిజ్వాన్ తల్లి బీబీ మాట్లాడుతూ.. అయ్యా సీఎం చంద్రబాబు గారూ.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారూ.. నా కడుపు శోకాన్ని చూడండి. నా బిడ్డకు ప్రాణభిక్ష పెట్టండి.. మేము పేదలమయ్యా.. మీరు కరుణించాలి.. మీరే దయ చూపాలి.. కిడ్నీ నేను ఇస్తానయ్యా.. ఆ ఖర్చు మీరు భరించండయ్యా అంటూ.. కళ్లలో నుండి వస్తున్న కన్నీటిని తుడుచుకుంటూ ప్రాధేయ పడుతోంది. ఈ తల్లి ఆర్తనాదాలు విని.. సీఎం, డీప్యూటీ సీఎం ఏ మేరకు స్పందిస్తారో వేచి చూద్దాం.