Sravana Masam 2025: శ్రావణ మాసం హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ మాసంలో శివపార్వతులతో పాటు శ్రీమహాలక్ష్మి, శ్రీమహావిష్ణువులను పూజించడం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయని నమ్ముతారు. ముఖ్యంగా ఆర్థిక సమస్యలు, అప్పుల బాధల నుంచి విముక్తి పొందడానికి శ్రావణ మాసంలో కొన్ని ప్రత్యేక పరిహారాలు ఆచరించడం ద్వారా అనుకూలమైన ఫలితాలు లభిస్తాయని చెబుతారు. అప్పుల బాధలు తొలగిపోవాలంటే శ్రావణ మాసంలో ఎలాంటి పరిహారాలు చేయాలనే విషయాలను గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
శ్రావణ మాసంలో అప్పుల బాధల నుంచి విముక్తికి పరిహారాలు:
శ్రావణ మాసం కేవలం ఆధ్యాత్మికంగానే కాకుండా.. ఆర్థిక సమస్యల నివారణకు కూడా ఎంతో ప్రాధాన్యతను కలిగి ఉంటుంది. ఈ మాసంలో చేసే కొన్ని పూజలు, పరిహారాలు అప్పుల నుంచి ఉపశమనం పొందేందుకు సహాయపడతాయని విశ్వసిస్తారు.
1. శ్రావణ శుక్రవారం లక్ష్మీ పూజ:
శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైనది. ఈ రోజున లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల ధనధాన్యాలు, సుఖసంతోషాలు చేకూరుతాయని ప్రగాఢ విశ్వాసం. కొందరు మహిళలు తమ కుటుంబ శ్రేయస్సు, ఐశ్వర్యం కోసం ఈ పూజను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు.
పూజా విధానం:
ఇంటిని శుభ్రం చేసి.. లక్ష్మీదేవి పటం లేదా విగ్రహాన్ని పూజించాలి. ఐశ్వర్యాన్ని ఆకర్షించడానికి ఉప్పు దీపం (ఐశ్వర్య దీపం) వెలిగించడం శుభప్రదం. ఆవునెయ్యి లేదా నువ్వుల నూనెతో ఎరుపు రంగు వత్తులను ఉపయోగించడం మంచిది. పూజలో పసుపు, పచ్చ కర్పూరం, జవ్వాది వంటివి ఉపయోగించడం వల్ల శుభం కలుగుతుంది.
2. శ్రావణ సోమవారం శివారాధన:
శ్రావణ మాసంలోని ప్రతి సోమవారం శివుడికి అత్యంత పవిత్రమైన రోజు. ఈ రోజున శివుడిని పూజించడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం.
పరిహారం: అప్పుల బాధలు తీరడానికి శ్రావణ సోమవారం రోజున శివుడికి శనగపప్పు నైవేద్యంగా సమర్పించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే, రుద్రాభిషేకం చేయడం, “ఓం నమః శివాయ” లేదా “మహామృత్యుంజయ మంత్రం” జపించడం ద్వారా విశేష ఫలితాలు కలుగుతాయి. బిల్వ పత్రాలను సమర్పించడం కూడా శివుడికి అత్యంత ప్రీతికరమైనది.
3. సంకటహర చతుర్థి గణపతి పూజ:
శ్రావణ మాసంలో వచ్చే సంకటహర చతుర్థి రోజున గణపతిని పూజించడం వల్ల అన్ని కష్టాలు, అప్పుల బాధలు తొలగిపోతాయని విశ్వసిస్తారు.
పరిహారం: సంకటహర చతుర్థి రోజున వినాయకుని ముందు నాలుగు దీపాలు వెలిగించి.. శాస్త్రోక్తంగా పూజించాలి. “ఓం గణ గణపతయే నమః” అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. గణపతికి జమ్మి ఆకులను (శమీ పత్రాలు) నైవేద్యంగా సమర్పించడం వల్ల దుఃఖాలు, కష్టాల నుంచి ఉపశమనం లభిస్తుందని చెబుతారు. మోదకాలు లేదా లడ్డూలను నైవేద్యంగా పెట్టడం కూడా శుభప్రదం.
4. తులసి మొక్కను పూజించడం:
తులసి మొక్కను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. శ్రావణ మాసంలో తులసిని పూజించడం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుందని నమ్మకం.
పరిహారం: ప్రతిరోజూ ఉదయం స్నానం చేసి.. తులసి కోటకు దీపం వెలిగించి, ప్రదక్షిణలు చేసి, తులసి స్తోత్రాలను చదవండి. ఇది ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి సహాయపడుతుంది.
5. మారేడు వృక్షాన్ని పూజించడం / నాటడం:
మారేడు వృక్షం (బిల్వ వృక్షం) శివుడికి అత్యంత ప్రీతికరమైనది. శ్రావణ మాసంలో మారేడు చెట్టును ఇంటి ఆవరణలో నాటడం వల్ల దారిద్య్రం తొలగిపోయి ఐశ్వర్యం సిద్ధిస్తుందని బలమైన నమ్మకం.
Also Read: శ్రావణ మాసంలో.. మాంసాహారం ఎందుకు తినకూడదు ?
పరిహారం: మారేడు వృక్షాన్ని పూజించడం లేదా దాని ఆకులను శివుడికి సమర్పించడం వల్ల శుభ ఫలితాలు పొందవచ్చు.
6. ధార్మిక కార్యక్రమాలు:
శ్రావణ మాసంలో చేసే దైవ కార్యాలకు.. దానధర్మాలకు ఎంతో శక్తి ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. పేదలకు అన్నదానం చేయడం, వస్త్ర దానం చేయడం.. ఆలయాలకు విరాళాలు ఇవ్వడం వంటివి చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది. అంతే కాకుండా ఆర్థిక బాధలు తగ్గుతాయని నమ్ముతారు.
ఈ పరిహారాలు కేవలం నమ్మకాలు మాత్రమే కాకుండా.. భక్తిశ్రద్ధలతో, సానుకూల దృక్పథంతో చేసే పనులు మీ మనసుకు ప్రశాంతతను అందించి, సమస్యలను ఎదుర్కొనే శక్తిని ఇస్తాయి. శ్రావణ మాసంలో భక్తితో చేసే పూజలు, పరిహారాలు అప్పుల బాధల నుంచి విముక్తిని కలిగించి, సుఖ సంతోషాలను ప్రసాదిస్తాయి.