Devotional News: సనాతన ధర్మం, భారతీయ సంస్కృతిలో.. ప్రతి సమయానికి దానిదైన ప్రత్యేకత ఉంది.ముఖ్యంగా సాయంత్రం వేళ (సంధ్యా సమయం) అంటే సూర్యాస్తమయం అయ్యే సమయం (సుమారు 5 గంటల నుంచి 7 గంటల వరకు), అత్యంత కీలకమైనదిగా భావిస్తారు. ఈ సమయాన్ని దేవతలు, పితృ దేవతలు, పవిత్ర శక్తుల సంచారం ఉండే శుభ సమయంగా పరిగణించి.. కొన్ని పనులను చేయకూడదని చెబుతుంటారు. సంధ్యా సమయంలో కొన్ని పనులు చేయడం ద్వారా.. లక్ష్మీ దేవికి కోపం వచ్చి, పరమ దరిద్రం వెంటాడుతుందని నమ్మకం. అందుకే పెద్దలు ఈ సమయాన్ని పూజలకు, ధ్యానానికి కేటాయించాలని సూచిస్తారు.పురాణాలు , శాస్త్రాల ప్రకారం సాయంత్రం పూట చేయకూడని పనులేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
సాయంత్రం పూట చేయకూడని పనులు:
1. నిద్రించడం లేదా సోమరితనంగా ఉండడం:
సాయంత్రం సంధ్యా సమయంలో.. నిద్రపోవడం లేదా మంచం మీద సోమరితనంగా ఉండడం అస్సలు మంచిది కాదు.
ఈ సమయం లక్ష్మీ దేవి ఇంట్లోకి ప్రవేశించే సమయంగా భావిస్తారు. అంతే కాకుండా ఈ సమయంలో నిద్రించే ఇంట్లో లక్ష్మీ దేవి ఉండదని, ఆ స్థానంలో దరిద్ర దేవత నివాసం ఉంటుందని చెబుతారు.
పరిహారం: నిద్ర మానేసి, దీపారాధన చేసి దేవుడికి నమస్కరించాలి.
2.ఇంటిని శుభ్రం చేయడం:
సూర్యాస్తమయం తరువాత, ముఖ్యంగా సంధ్యా సమయంలో చీపురుతో ఇల్లు ఊడ్చడం లేదా చెత్తను బయట పారవేయడం అశుభంగా భావిస్తారు.
చీపురు లక్ష్మీ దేవి స్వరూపంగా భావిస్తారు. చీపురు వాడటం ద్వారా ఇంట్లో ఉన్న ధనం, అదృష్టం కూడా చెత్తతో పాటు బయటకు వెళ్ళిపోతాయని నమ్మకం.
పరిహారం:ఇంటిని శుభ్రం చేయాలనుకుంటే.. సూర్యాస్తమయానికి ముందే పూర్తి చేయాలి. చీకటి పడిన తరువాత చీపురు వాడకూడదు.
3. ఉప్పు,పాలు,పెరుగు ఇవ్వడం:
సంధ్యా సమయంలో ఉప్పు, పాలు, పెరుగు వంటి తెల్లని వస్తువులను ఇతరులకు దానం చేయడంగానీ, అప్పుగా ఇవ్వడంగానీ చేయకూడదు. ఉప్పును లక్ష్మీ దేవికి సంబంధించిన అంశంగా భావిస్తారు. సాయంత్రం పూట ఉప్పును బయటకు ఇవ్వడం ద్వారా.. ఇంటిలోని సిరిసంపదలు బయటకు వెళ్లిపోతాయని, ఆర్ధిక ఇబ్బందులు వస్తాయని నమ్మకం.
4. తులసి మొక్కను తాకడం:
సంధ్యా సమయంలో లేదా రాత్రి పూట తులసి మొక్కను తాకడం, ఆకులను తెంపడం లేదా దానికి నీరు పోయడం చేయకూడదు.
తులసి మొక్కను సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. రాత్రి పూట తాకడం వల్ల తులసి కోపం చెందుతుందని, ఇంటికి దురదృష్టం వస్తుందని నమ్మకం.
పరిహారం: సాయంత్రం వేళ తులసి కోట దగ్గర దీపం వెలిగించి నమస్కరించాలి.
5. గట్టిగా మాట్లాడటం, గొడవలు పెట్టుకోవడం:
సంధ్యా సమయం ప్రశాంతంగా ఉండాలి. ఈ సమయంలో ఇంట్లో గట్టిగా మాట్లాడటం, అరుపులు లేదా గొడవలు పెట్టుకోవడం మంచిది కాదు.
ఇంట్లో గొడవలు, అశాంతి ఉన్న చోట లక్ష్మీ దేవి నివాసం ఉండదు. ఇలాంటి వాతావరణం దారిద్రం, మానసిక క్షోభను మాత్రమే తీసుకొస్తుందని పెద్దలు చెబుతారు.
Also Read: ఇంట్లో ఒకే దేవుడి పటాలు ఒకటి కంటే ఎక్కువ పెట్టొచ్చా? శాస్త్రం ఏం చెబుతోంది ?
సాయంత్రం పూట చేయాల్సిన పనులు:
సంధ్యా సమయం పరమ పవిత్రమైనది కాబట్టి.. ఈ సమయంలో ఈ పనులు చేయాలి.
దీపారాధన:ఇంటి ప్రధాన ద్వారం వద్ద, దేవుడి గదిలో దీపం వెలిగించాలి.
పూజ/ధ్యానం: భగవంతుని నామస్మరణ లేదా ధ్యానం చేయాలి.
శుభ్రత: ఈ సమయానికి ఇల్లు పరిశుభ్రంగా, ప్రశాంతంగా ఉండాలి.
ఈ నియమాలను పాటించడం ద్వారా లక్ష్మీ దేవి అనుగ్రహం లభిస్తుందని, ఆర్ధిక బాధలు తొలగి, ఇంట్లో సుఖ శాంతులు, ఐశ్వర్యం నిలుస్తాయని ప్రగాఢ నమ్మకం