Lakshmi Puja : శ్రావణ మాసం అంటేనే పవిత్రతకు, దైవారాధనకు ప్రసిద్ధి. ఈ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి పూజకు అత్యంత విశిష్టమైనదిగా భావిస్తారు. శ్రావణ శుక్రవారం నాడు లక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే సిరి సంపదలు, సుఖ సంతోషాలు లభిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. శ్రావణ శుక్రవారం రోజు లక్ష్మీదేవిని ఏ విధంగా పూజించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
శ్రావణ శుక్రవారం రోజు తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం చేసి.. పరిశుభ్రమైన వస్త్రాలు ధరించాలి. తర్వాత ఇంటిని, పూజ గదిని శుభ్రం చేసుకుని, ముగ్గులతో అలంకరించాలి. పూజ గదిలో లక్ష్మీదేవి విగ్రహం లేదా పటాన్ని ప్రతిష్టించాలి. పూజకు ముందుగా గణపతి పూజ చేయడం ఆనవాయితీ. ఎందుకంటే.. విఘ్నేశ్వరుడిని పూజించడం వల్ల పూజ నిర్విఘ్నంగా జరుగుతుంది.
లక్ష్మీదేవి పూజకు కమలాలు, గులాబీలు, చామంతి వంటి ఎరుపు, పసుపు రంగుల పూలు శ్రేష్ఠమైనవి. అమ్మవారికి ముందుగా దీపారాధన చేసి.. అగరుబత్తులు వెలిగించాలి. ఆ తర్వాత.. అష్టలక్ష్మీ స్తోత్రం, కనకధారా స్తోత్రం లేదా లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పారాయణం చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం తొందరగా కలుగుతుందని నమ్మకం. ఈ స్తోత్రాలను భక్తి శ్రద్ధలతో పఠిస్తున్నప్పుడు మనసులో లక్ష్మీదేవిని ధ్యానించాలి.
నైవేద్యంగా పాయసం, శనగలు, బెల్లం అన్నం, కొబ్బరికాయ, పండ్లు, అటుకులు వంటివి కూడా సమర్పించవచ్చు. ముఖ్యంగా.. శ్రావణ శుక్రవారం నాడు కొబ్బరితో చేసిన ప్రసాదాలు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనవిగా భావిస్తారు. పూజ పూర్తయ్యాక.. లక్ష్మీదేవికి హారతి ఇవ్వాలి. పూజానంతరం, ఇంటిల్లిపాదీ ప్రసాదాన్ని స్వీకరించాలి.
శ్రావణ శుక్రవారం రోజున ఉపవాసం ఉండగలిగితే అది మరింత మంచిది. ఉపవాసం ఉండలేని వారు పాలు, పండ్లు వంటివి కూడా తీసుకోవచ్చు. ఈ రోజున ముత్తయిదువులకు తాంబూలం, పసుపు, కుంకుమ, గాజులు ఇవ్వడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని ప్రతీతి. పేదవారికి దానం చేయడం, అన్నదానం చేయడం కూడా పుణ్యకార్యాలుగా పరిగణిస్తారు.
Also Read: శ్రావణ మాసంలో ఈ పరిహారాలు చేస్తే.. అప్పుల బాధలే ఉండవు
శ్రావణ శుక్రవారం కేవలం పూజకే పరిమితం కాదు.. ఈ రోజున ఇంటి వాతావరణం ప్రశాంతంగా, ఆనందంగా ఉండేలా చూసుకోవాలి. కలహాలు, లేకుండా ఉండటం శ్రేయస్కరం. ఇలా చేయడం వల్ల మాత్రమే లక్ష్మీదేవి ప్రశాంత వాతావరణంలో కొలువై ఉంటుందని నమ్మకం. నిష్టతో, శ్రద్ధతో శ్రావణ శుక్రవారం నాడు లక్ష్మీదేవిని పూజించిన వారికి ఆర్థిక వృద్ధి, ఆరోగ్యం, కుటుంబ సౌఖ్యం లభించి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తులు దృఢంగా విశ్వసిస్తారు. కాబట్టి.. ఈ శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవిని పూజించి, మీ జీవితంలో సిరి సంపదలను ఆహ్వానించండి.