Arjuna – Tirumala: తిరుమల కొండల్లో అర్జునుడు తపస్సు చేశాడని మీకు తెలుసా..? అర్జునుడి తపస్సు చేసిన ఆ ప్రాంతం ఇప్పుడు పవిత్రమైన తీర్థాలలో ఒకటిగా ప్రసిద్ది చెందిదని ఎంత మందికి తెలుసు.. అసలు అర్జునుడు తిరుమల గిరులకు ఎందుకు వచ్చాడు. ఎవరి కోసం తపస్సు చేశాడు..? ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం.
కలియుగం దైవం శ్రీ వెంకటేశ్వరుడు కొలువైన తిరుమల గిరిల్లో ద్వారప యుగంలోనే అర్జునుడు సందర్శించాడట. అర్జునుడు మాత్రమే కాదు పాండవులు శ్రీకృష్ణ పరమాత్మ కూడా తిరుమల గిరులకు వెళ్లారట. వెళ్లడమే కాదు అర్జునుడు తిరుమల గిరుల్లోని పవిత్రమైన తీర్థం దగ్గర తపస్సు కూడా చేశాడని పురాణాలు చెప్తున్నాయి. అయితే పాండవులు ఎందుకు తిరుమలకు వెళ్లారు. అక్కడ ఎన్ని రోజులు ఉన్నారు..? ఎవరి చెబితే అక్కడికి వెళ్లారో ఇప్పుడు తెలుసుకుందాం.
తిరుమలలో పవిత్రమైన తీర్థాలలో పాండవ తీర్థం ఒకటి. దీనినే పాండవ గుండు అని కూడా పిలుస్తారు. ఇది తిరుమల శ్రీవారి ఆలయానికి సుమారు 3 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. ఇది ఎంతో మహిమాన్వితమైనదిగా చెప్తుంటారు. పాండవులు తమ 12 సంవత్సరాల వనవాసం కాలంలో ఇక్కడ అంటే తిరుమలలోని పాండవ తీర్థం దగ్గర కొద్ది రోజులు నివసించినట్టు పండితులు చెప్తున్నారు. ఈ పాండవ గుండు గుహలలో వారు ఆశ్రమం నిర్మించుకుని ఉన్నారని అందుకు సంబంధించిన ఆనవాళ్లు ఇక్కడ లభ్యమైనట్టు పురాతత్వ శాస్త్రవేత్తలు నిర్దారించారు. పాండవులు నివసించిన ప్రాంతం కాబట్టే ఈ ప్రాంతాన్ని పాండవ తీర్థం లేదా పాండవ గుండు అని పిలుస్తున్నారట. ఈ తీర్థం వద్ద ఉన్న కొండరాళ్లపై పాండవుల ఆకృతులు, ముఖ్యంగా ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు మరియు ద్రౌపదికి సంబంధించిన గుర్తులు ఉన్నాయని చెప్తుంటారు.
ఇక శ్రీకృష్ణ పరమాత్మ ఆదేశం మేరకు అర్జునుడు, పరమశివుడి కోసం ఇక్కడే తపస్సు చేశాడని అందుకే ఈ పాండవ తీర్థంలో విపరీతమైన ఆధ్యాత్మిక శక్తి ఉంటుందని పండితులు చెప్తుంటారు. తర్వాతి కాలంలో ఎంతో మంది సాధకులు ఇక్కడ తపస్సు చేశారని అంటున్నారు. ఇక్కడ ఒక భారీ రాతి కొండ పైనుంచి నీరు కిందకు జాలువారుతుంది. వర్షాకాలంలో ఈ జలపాతం ఎంతో మనోహరంగా కనిపిస్తుంది. ఈ ప్రదేశాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయం వర్షాకాలం, చుట్టూ పచ్చదనం మరియు రాళ్ల నుండి తెల్లటి నీరు బయటకు రావడంతో ఈ ప్రదేశం మరింత అందంగా కనిపిస్తుంది.
పాండవ తీర్థంలో ఏడాది మొత్తం భక్తులు స్నానాలు చేస్తూనే ఉన్నప్పటికీ వైశాఖ మాసంలో శుక్లపక్ష ద్వాదశి, ఆదివారం కలిసి వచ్చిన రోజు లేదా కృష్ణ పక్ష ద్వాదశి మంగళవారం కలిసి వచ్చిన రోజు స్నానం చేయటం సకల శ్రేష్ఠం అని చెబుతారు.
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.