మాఘ మాసంలో వచ్చే ప్రధాన పండగలలో వసంత పంచమి ముఖ్యమైనది. దీన్నే సరస్వతీ పూజ అని కూడా పిలుస్తారు. పిల్లలకు చదువును, జ్ఞానాన్ని అందించే సరస్వతి మాత ఇదే రోజు జన్మించిందని చెప్పుకుంటారు. సరస్వతీ మాత రూపం నిండుగా ఉంటుంది. చేతిలో పుస్తకం, వీణ, జపమాలతో తెల్ల కమలం మీద కూర్చుని భక్తులను ఆశీర్వదిస్తుంది. అయితే ఫిబ్రవరిలో సరస్వతీ పూజను ఎప్పుడు చేయాలన్నా సందేహం ఎక్కువమందిలో ఉంది. కొంతమంది ఫిబ్రవరి 2న చేయాలంటే, మరికొందరు మూడో తేదీన చేయాలని చెబుతున్నారు. వసంత పంచమి పండుగను ఈరోజు చేసుకోవాలో తెలుసుకోండి.
జ్ఞానాన్ని, సంగీతాన్ని, కళలను అన్నింటినీ అందించే అధి దేవతా సరస్వతి దేవి. ఆమెను పూజించడం వల్ల కోరుకున్న కళల్లో రాణిస్తారు. సరస్వతి దేవి జన్మదిన వసంత పంచమిని మాఘ పంచమి అని కూడా పిలుస్తారు. అలాగే శ్రీ పంచమి అని కూడా అంటారు. ఈ ఏడాది వసంత పంచమి పై తేదీ పై ఎన్నో సందేహాలు ఉన్నాయి. వసంత పంచమి పండగను మాఘ మాసంలోనే శుక్లపక్షం ఐదవ రోజున నిర్వహించుకుంటారు.
పంచాంగం ప్రకారం వసంత పంచమి ఫిబ్రవరి 2వ తేదీన ఉదయం 9:14 గంటలకు మొదలవుతుంది. ఇది మరుసటి రోజు అంటే ఫిబ్రవరి మూడవ తారీఖున ఉదయం 6:52 నిమిషములకు ముగుస్తుంది. కాబట్టి వసంత పంచమని ఫిబ్రవరి రెండో తారీఖున నిర్వహించుకోవాలి. ఈ పూజను ఫిబ్రవరి రెండో తారీఖున 12:30 లోపు పూర్తిచేస్తే మంచిది. ఎందుకంటే అదే సరస్వతీ పూజకు శుభ సమయం.
సరస్వతి పూజా విధానం
సరస్వతీ దేవిని ఆచారం ప్రకారం పూజించాలి. సరస్వతీదేవి విగ్రహాన్ని లేదా పటాన్ని శుభ్రమైన పసుపు రాసిన వస్త్రంపై ఉంచాలి. అమ్మవారికి పసుపు తిలకం దిద్దాలి. పుష్పాలను సమర్పించాలి. సరస్వతీమాతకు పసుపు రంగు కంటే ఎంతో ఇష్టం. కాబట్టి మీరు ఆ పూజ చేసే రోజు పసుపు రంగు దుస్తులు ధరిస్తే ఎంతో మంచిది. అలాగే పసుపు రంగు పూలు, పసుపు రంగులో ఉన్న మిఠాయిలు, పసుపు రంగులో ఉన్న పండ్లు సమర్పించండి. ఆరోజు చదువు, జ్ఞానానికి సంబంధించిన విషయాలను కోరుకోండి. పిల్లలకు మంచి చదువు రావాలని, జ్ఞానం దక్కాలని ప్రార్థించండి. ఆ తల్లి మీకు అన్ని వరాలను అందిస్తుంది. సరస్వతీ పూజ రోజున పవిత్ర నదులలో స్నానం చేస్తే మంచిదని చెప్పుకుంటారు. కానీ ఇప్పుడున్న కాలంలో నదీ స్నానాలు సులభం కాదు. కాబట్టి ఇంట్లోనే తలకు స్నానం చేసి పూజా విధులు నిర్వహించుకోవడం ఉత్తమం.
Also Read: మీ పడక గదిలో నెమలి పింఛాలు పెట్టుకుని చూడండి, మీ జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయి