 
					Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఎంతవరకు వచ్చింది? కీలక నేతలు రంగంలోకి దిగుతున్నారా? ఎప్పటికప్పుడు పార్టీల తమ వ్యూహాలను మార్చుకుంటు న్నాయా? శుక్రవారం కీలక నేతలు ప్రచారంలోకి దిగబోతున్నారా? అదే జరిగితే ఆ నియోజకవర్గంలో ట్రాఫిక్ జామ్ అవ్వడం ఖాయమా? అవుననే అంటున్నారు.
జూబ్లీహిల్స్ బైపోల్‌లో వేడెక్కిన ప్రచారం
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం తారాస్థాయికి చేరింది. ప్రచారానికి కేవలం పది రోజులు మాత్రమే మిగిలివుంది. నేతలు ఇంటింటికీ ప్రచారం చేస్తున్నా, పెద్దగా జోష్ రాలేదని అంటున్నారు. కీలక నేతలు రంగంలోకి దిగితే ఓ రేంజ్‌లో ఉంటుందని అంటున్నారు. శుక్రవారం సాయంత్రం కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు మద్దతుగా సీఎం రేవంత్‌రెడ్డి రోడ్ షో నిర్వహించనున్నారు.
రోజుకు రెండు డివిజన్ల చొప్పున మూడు విడతలుగా ప్రచారం చేయనున్నారు. సాయంత్రం వెంగళరావునగర్ డివిజన్‌లో రోడ్ షోలో పాల్గొంటున్నారు సీఎం. PJR సర్కిల్ నుంచి జవహర్‌నగర్, సాయిబాబా టెంపుల్ వరకు రోడ్ షో జరగనుంది. సాయిబాబా టెంపుల్ ఆవరణలో కార్నర్ మీటింగ్‌లో ప్రసంగించనున్న సీఎం రేవంత్‌రెడ్డి. ఆ తర్వాత సోమాజిగూడ డివిజన్‌లోని ఎల్లారెడ్డిగూడ మార్కెట్ ఏరియా వద్ద కార్నర్ మీటింగ్‌కు హాజరవుతారు.
ఓవైపు సీఎం రేవంత్.. ఇంకోవైపు కేటీఆర్
ఇదిలావుండగా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సాయంత్రం రోడ్ షో చేయనున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా ఆయన రోడ్ షో నిర్వహించనున్నారు. షేక్‌పేట నాలా, ఓయూ కాలనీ రోడ్, పీస్ సిటీ కాలనీ, హనుమాన్ టెంపుల్, సామ్‌తా కాలనీ, ఆధిత్యనగర్ ప్రాంతంలో ముగింపు కానుంది.
ALSO READ: బీజేపీ ద్వంద వైఖరికి నిదర్శనమన్న మంత్రి ఉత్తమ్‌కుమార్
స్టార్టింగ్, ఎండింగ్ పాయింట్ల వద్ద మీటింగ్ జరగనున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. షేక్‌పేట్ డివిజన్‌లో బీఆర్ఎస్ రోడ్ షో వెనుక కారణాలు చాలానే ఉన్నాయని అంటున్నారు. శుక్రవారం మధ్యాహ్నం అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ వర్గం ఓట్లు అటువైపు డైవర్ట్ కాకుండా ఉండేందుకు బీఆర్ఎస్, షేక్‌పేట్ డివిజన్‌ను ఇవాళ ప్రచారానికి ఎంచుకున్నట్లు తెలుస్తోంది.
ఇద్దరు నేతలు ఒకేసారి సాయంత్రం రోడ్ షోలు నిర్వహించడంతో ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. హైటెక్ సిటీ నుంచి వచ్చేవారంతా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నుంచి రావాల్సివుంది. ఎటుచూసినా ట్రాఫిక్ జామ్ అయ్యే ఛాన్స్ ఉంది. సీఎం రేవంత్‌రెడ్డి రోడ్ షో రూట్ మ్యాప్‌ను ఇప్పటికే వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాస్ పరిశీలించారు. అటు బీఆర్ఎస్ రోడ్ మ్యాప్‌ను షేక్‌పేట్ పోలీసులు పరిశీలించారు.