Karthika masam 2024: కార్తీకమాసంలో ఇతరత్రా కారణాలతో పూజలు, దీపారాధనకు నోచుకోలేదని బాధ పడుతున్నారా.. అయితే మీలాంటి భక్తుల కోసమే ఈ చక్కని అవకాశం. ఈ ఒక్కరోజు మీరు నిశ్చలమైన భక్తితో పూజలు, దీపారాధన నిర్వహిస్తే కలిగే భాగ్యం మీ ఊహకు అందనిదే.
మాసాలలో పవిత్రమాసం కార్తీకమాసం. అటువంటి కార్తీకమాసంలో వచ్చే బహుళ అమావాస్య చాలా ముఖ్యమైన రోజు. వచ్చే ఆదివారం అంటే డిసెంబర్ 1వతేదీన ఆ బృహత్తర రోజు రానే వచ్చింది. ఈ మాసంలో 30 రోజుల్లో దీపారాధన చేయలేకపోయిన వారికి బహుళ అమావాస్య రోజు ఒక వరం. ఈరోజున వారు ఒక్క పూజ చేస్తే, చక్కని పుణ్యఫలం దక్కుతుంది. అసలేం చేయాలంటే.. ఈ రోజున ప్రాతఃకాలం సూర్యోదయం కంటే ముందు దీపారాధన చేయటం, దీపాన్ని దర్శించటం, దేవాలయ దర్శనం చేయటం వలన కార్తీక మాసంలో 30 రోజులు దీపారాధన చేసినంత ఫలితం కలుగుతుంది.
మీ దోషాలు తొలగేందుకు ఇలా చేయండి
కార్తీక మాసంలో ప్రతిరోజూ పిండితో చేసిన దీపాన్ని దానం చేయటం వల్ల కలిగే సౌభాగ్యం, 30వ రోజున వెండి దీపంలో బంగారు వత్తువేసి దానం చేయటం వల్ల అఖండ సామ్రాజ్య ప్రాప్తి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజున చేసిన దీపదానం వలన అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. అలాగే అమావాస్య రోజున పితృదేవతలను ఉద్దేశించి స్వయంపాకం దానం చేయటం వలన పితృదేవతల అనుగ్రహంతో వంశాభివృద్ధి కలుగుతుందని ప్రతీతి. ఈ మాసంలో నెల రోజులు ఉపవాసం చేయలేని వారు, చివరి రోజైన అమావాస్యన పగలంతా ఉపవాసం ఆచరించి, సాయం సంధ్య వేళ శివారాధన చేసి శివుడికి ప్రీతికరంగా జలాభిషేకం చేయటం వలన అపమృత్య దోషం తొలగుతుంది. దీనితో ఉన్న దోషాలు తొలగి, ఆ ఇంట లక్ష్మీకటాక్షం కలుగుతుందని వేదపండితులు తెలుపుతున్నారు.
కార్తీకమాస వ్రత మహత్యం
కార్తీకమాస వ్రత మహత్యం గురించి సాక్షాత్తు వశిష్టుల వారు జనక మహారాజుకు తెలియజేశారు. ఇదే విషయాన్ని పరమేశ్వరుడు పార్వతీదేవికి తెలియజేశారు. అదే విషయాన్ని శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవికి తెలియజేశారని స్కంద పురాణంలో స్పష్టంగా చెప్పబడింది. అందుకే కార్తీకమాసంలో వ్రతాన్ని ఆచరించడం వల్ల భక్తులు ఎన్నో భాగ్యాలను పొందే అవకాశం ఉంటుంది.
కార్తీక బహుళ అమావాస్య రోజు ఇలా చేయండి
ఈసారి ఆదివారం అమావాస్య రావటం చాలా విశేషం. ఈరోజు పగలంతా ఉపవాసం ఉండి సాయం సంధ్య వేళ – ప్రదోష వేళ రాహుకాల సమయంలో దీపారాధన చేయటం వల్ల అప మృత్యుదోషం తొలగిపోతుంది. ఆ సమయంలో శివుడికి సంబంధించి మహా మృత్యుంజయ మంత్ర జపం చేయటం వల్ల ఆయుష్షు పెరుగుతుంది. కార్తీక బహుళ అమావాస్య కార్తీక మాసంలో చివరి రోజు. ఈ రోజు చాలా అద్భుతమైన రోజుగా వేదాలు చెబుతున్నాయి.
Also Read: Mercury Transit: బుధుడి సంచారం.. ఈ రాశుల వారి జీవితాలు తలక్రిందులు
ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని స్నానము, దానము, జపము, తపస్సు చేయటం వల్ల విశేషమైన ఫలితాలు కలిగే అవకాశం ఉంది. కార్తీక మాసంలో 30 రోజులు ఎటువంటి పూజలు, దీపారాధన కూడా చేయలేని వారు, ఈ ఒక్క రోజును సద్వినియోగం చేసుకొని చక్కగా సూర్యోదయానికి ముందే స్నానం చేసి దీపారాధన చేసి దైవ దర్శనం చేసుకోవాలి. అనంతరం జపం చేసుకుని ఉపవాసం ఉండి, సాయం సంధ్యా సమయాన మళ్లీ దేవతార్చన చేసి అన్నదానం చేసి ఆహారం స్వీకరించటం వల్ల వారికి ఉత్తమ ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి. ఇంతటి భాగ్యాన్ని అందించే బహుళ అమావాస్య రోజును అందరూ దీపారాధన చేసి, ఆ పరమేశ్వరుని కృపకు పాత్రులు కాగలరని మనవి.
– డాక్టర్ శృతి