Ganesh Aagman 2026: ముంబైలో మరోసారి గణేశుడి ఆగమనం ఉత్సవాలు భక్తుల్లో ఉత్సాహాన్ని నింపింది. సాధారణంగా సెప్టెంబరు నెలలో జరగే వినాయక చవితి ఎంత ఘనంగా ఉంటుందో.. అంతకంటే ఏమాత్రం తగ్గకుండా మాఘి గణపతి ఉత్సవాలు ముంబై నగరాన్ని సందడిగా మార్చుతున్నాయి. ఈ క్రమంలో కార్టర్ రోడ్ ‘చా రాజా గణపతి’ (ముంబైలోని ప్రసిద్ధ లాల్‌బాగ్‌చా రాజా విగ్రహం. ఇది గణేష్ చతుర్థి పండుగలో అత్యంత ప్రజాదరణ పొందినది. ఆగమన సంబరాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..
సాధారణంగా మన హిందూ పంచాంగం ప్రకారం.. మాఘ మాసంలో వచ్చే మాఘి గణేశ చతుర్థి(వినాయక చవితి)ని గణేశుడి జన్మదినంగా భావిస్తారు. 2026 సంవత్సరంలో ఈ పవిత్ర పండుగ కోసం గురువారం, జనవరి 22న జరగనుంది.
అయితే ఇటీవల జరిగిన ముంబై కార్టర్ రోడ్ ప్రాంతం భక్తులతో కిటకిటలాడింది. కార్టర్ రోడ్ చా రాజా.. గణపతి విగ్రహం ఆగమన్ సందర్భంగా వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
సాధారణంగా సెప్టెంబరులో వచ్చే భాద్రపద వినాయక చవితికి ముంబైలో అతిపెద్ద పండుగగా పేరుంది. కానీ గత పదేళ్లుగా మాఘి గణపతి ఉత్సవాలు కూడా అంతే స్థాయిలో ప్రజాదరణ పొందుతున్నాయి. మొదట్లో ఇది చిన్న స్థాయిలో.. ప్రైవేట్‌గా జరుపుకునే ఉత్సవంగా ఉండేది. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
ముంబైలో బోరివలి, కాండివలి, పరేల్ వంటి ఉపనగరాల్లోని పెద్ద మండళ్లు సెప్టెంబరు ఉత్సవాలను తలపించేలా భారీ విగ్రహాలు, ప్రత్యేక థీమ్‌లతో పండుగను ఘనంగా నిర్వహిస్తున్నాయి. సాధారణంగా వర్షాకాలంలో జరగే వినాయక ఉత్సవాలకు వెళ్లలేని భక్తులకు మాఘి గణపతి ఉత్సవాలు అలాంటి అనుభూతిని అందిస్తున్నాయి.
ఈ ఉత్సవం ప్రధానంగా పార్వతి దేవి గణేశుడిని సృష్టించిన ఘట్టాన్ని స్మరించుకుంటూ జరుపుకుంటారు. ఈ ఉత్సవాల సమయంలో భక్తులు ఉపవాసాలు ఉండటం, అష్టవినాయక క్షేత్రాలను దర్శించుకోవడం వంటి సంప్రదాయాలను పాటిస్తారు. ఇక ముంబైలో అయితే.. బహిరంగ సమావేశ మండపాలు భక్తులకు ప్రత్యేక ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తున్నాయి.
ప్రస్తుతం ఈ ఆగమన్ కార్యక్రమాలు కొనసాగుతున్న నేపథ్యంలో.. రాబోయే రెండు వారాలపాటు ముంబై నగరం వెలుగులతో, సంప్రదాయ సంగీతంతో, భక్తి వాతావరణంతో నిండిపోనుంది. ఏ కాలమైనా.. ఏ రూపమైనా.. గణేశుడిని ఆరాధించడంలో ముంబై నగరం ఎప్పుడూ ముందుంటుందనే విషయాన్ని ఈ మాఘి గణపతి ఉత్సవాలు మరోసారి నిరూపిస్తున్నాయి.
?utm_source=ig_web_button_share_sheet