Rural Healthcare: స్వేచ్ఛ బ్యూరో: గ్రామీణ ప్రజలకు చేరువగా మెరుగైన వైద్యం అందించాలన్న ప్రభుత్వ లక్ష్యం కొందరు ఉద్యోగుల పైరవీలతో నీరుగారిపోతోంది. పల్లెల్లో పోస్టింగ్‌లు పొంది, డిప్యుటేషన్ల ముసుగులో పట్టణాల్లో తిష్టవేస్తున్నారు. ఫలితంగా క్షేత్రస్థాయిలో ప్రజలకు వైద్య సేవలు అందని ద్రాక్షగా మారుతున్నాయి. హుజూరాబాద్ మండలంలోని చెల్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ)తో పాటు దాని పరిధిలోని కనుకులగిద్దె ఆరోగ్య ఉపకేంద్రంలో ఈ సమస్య తీవ్రంగా ఉంది. గత ప్రభుత్వంలో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణలో భాగంగా 2023లో నరేందర్ అనే వ్యక్తి కనుకులగిద్దె ఉపకేంద్రానికి మేల్ హెల్త్ అసిస్టెంట్‌గా నియమితులయ్యారు. అయితే విధుల్లో చేరిన వెంటనే ఉన్నతాధికారుల అండతో డిప్యుటేషన్‌పై కరీంనగర్‌కు వెళ్లినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఫలితంగా కనుకులగిద్దె, రాంపూర్, రంగాపూర్, జూపాక తదితర గ్రామాల ప్రజలు సేవలందక ఇబ్బందులు పడుతున్నారు.
మరోవైపు నిత్యం రద్దీగా ఉండే చెల్పూర్ పీహెచ్‌సీలో రెండో వైద్యాధికారిగా వచ్చిన డాక్టర్ శ్రీనివాస్ సైతం డిప్యుటేషన్‌పై జమ్మికుంట ఆసుపత్రికి వెళ్లడంతో, ఒక్కరే ఓపీతో పాటు పాలనా వ్యవహారాలు చూసుకోవాల్సి వస్తోంది. వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలుతుండటంతో పేదలు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించి ఆర్థికంగా నష్టపోతున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, వైద్యశాఖ ఉన్నతాధికారులు స్పందించి అక్రమ డిప్యుటేషన్లను రద్దు చేసి, సిబ్బందిని క్షేత్రస్థాయికి పంపాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Also read: తెలుగు రాష్ట్రాలకు రైల్వే నిధుల పండుగ.. విజయవాడ, విశాఖపట్నం స్టేషన్లకు గుడ్ న్యూస్!
కనుకులగిద్దె పల్లె దవాఖానలో పనిచేయాల్సిన మేల్ హెల్త్ అసిస్టెంట్ నరేందర్ విధులకు హాజరుకావడం లేదని స్థానిక పల్లెదవాఖాన వైద్యాధికారి డాక్టర్ శశాంక్ స్పష్టం చేశారు. “నేను ఇక్కడ బాధ్యతలు చేపట్టి రెండేళ్లుగా కావస్తున్నా సదరు ఉద్యోగిని చూడలేదు. ఆయన ఎక్కడుంటారో కూడా సమాచారం లేదు. ఇక్కడి హాజరు పట్టికలోనూ ఆయన పేరు నమోదు కావడం లేదు. డీఎంహెచ్‌వో కార్యాలయం పరిధిలో డిప్యుటేషన్‌పై ఉన్నట్లు చెబుతున్నా, ఆయన వేతనం ఎక్కడి నుంచి డ్రా అవుతోందనే అంశంపై స్పష్టత లేదు” అని తెలిపారు. కీలకమైన పురుష కార్యకర్త లేకపోవడంతో ఆశాలు, ఏఎన్ఎంలపైనే అదనపు భారం పడుతోందని పేర్కొన్నారు.
Also read: వింత వింత జంతువులతో క్రేజీ అడ్వెంచర్… తెలుగులోనే ఈ కిడ్స్ అండ్ ఫ్యామిలీ ధమాకా