Maha Shivaratri 2026: మహా శివరాత్రి అనేది కేవలం ఉపవాస జాగరణల పండగ మాత్రమే కాదు. అది ఆధ్యాత్మికంగా.. జ్యోతిష్య పరంగా అత్యంత శక్తివంతమైన రోజు. ఈ శుభ ఘడియల్లో శివయ్యను సరైన పద్ధతిలో ఆరాధించడం వల్ల జాతకంలోని గ్రహ దోషాలు తొలగి ‘అఖండ రాజయోగం’ పడుతుందని పండితులు చెబుతున్నారు. సంకల్ప శుద్ధితో చేసే చిన్న చిన్న పరిహారాలు మన జీవితంలో ఆర్థిక ఇబ్బందులను తొలగించి, ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదిస్తాయి. రాజ యోగం పొందేందుకు శివరాత్రి రోజు చేయాల్సిన విశేష పరిహారాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
శివరాత్రి పరిహారాలు – అఖండ రాజయోగ ప్రాప్తి:
శివుడు భోళా శంకరుడు. భక్తులు భక్తితో చిన్న బిల్వ పత్రాన్ని సమర్పించినా పరవశించి పోతాడు. అయితే మహా శివరాత్రి రోజున విశ్వంలో శివ తత్వం అత్యధికంగా ఉంటుంది. ఈ సమయంలో చేసే కొన్ని విశేష పూజా కార్యక్రమాలు సామాన్యుడిని కూడా రాజయోగం దిశగా నడిపిస్తాయి.
1. పంచామృత అభిషేకం – ఐశ్వర్య ప్రాప్తి:
రాజయోగం అంటే కేవలం అధికారం మాత్రమే కాదు.. సుఖమయమైన జీవితం. శివరాత్రి రోజున శివలింగానికి ఆవు పాలు, పెరుగు, నెయ్యి, తేనె , పంచదారతో (పంచామృతాలు) అభిషేకం చేయడం వల్ల జాతకంలోని చంద్ర ,శుక్ర దోషాలు తొలగిపోతాయి. దీని వల్ల ఆర్థిక స్థిరత్వం లభించడమే కాకుండా.. విలాసవంతమైన జీవితాన్ని గడిపే యోగం పడుతుంది.
2. చెరకు రసంతో అభిషేకం:
లక్ష్మీ కటాక్షం కలగాలని కోరుకునే వారు శివరాత్రి నాడు శివలింగానికి చెరకు రసంతో అభిషేకం చేయాలి. ఇది దారిద్ర్యాన్ని పారద్రోలి, వ్యాపార, ఉద్యోగ రంగాల్లో అఖండ విజయాలను అందిస్తుంది. రాజయోగం పట్టాలంటే లక్ష్మి , శివుడి అనుగ్రహం రెండూ ఉండాలి. ఆ అనుగ్రహాన్ని చెరకు రస అభిషేకం ప్రసాదిస్తుంది.
3. బిల్వ పత్రాల సమర్పణ :
శివుడికి అత్యంత ప్రీతికరమైనవి బిల్వ పత్రాలు. మూడు దళాలు ఉన్న బిల్వ పత్రాన్ని శివలింగంపై ఉంచి “ఓం నమః శివాయ” అని స్మరించడం వల్ల మూడు జన్మల పాపాలు తొలగిపోతాయి. రాజయోగం కలగాలంటే ముందుగా కర్మ దోషాలు తొలగాలి. 108 బిల్వ పత్రాలతో అష్టోత్తర పూజ చేయడం వల్ల సమాజంలో గౌరవం, కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి.
4. నల్ల నువ్వులతో పూజ:
జాతకంలో శని ప్రభావం లేదా ఏల్నాటి శని వల్ల ఇబ్బందులు పడుతున్న వారు.. శివరాత్రి రోజు శివలింగానికి నల్ల నువ్వులను సమర్పించాలి. నువ్వులతో అభిషేకం చేయడం వల్ల పనుల్లో ఆటంకాలు తొలగిపోయి, అదృష్టం కలిసి వస్తుంది. శని దోషం తొలగితేనే రాజయోగం స్థిరంగా ఉంటుంది.
5. అన్నదానం, వస్త్రదానం:
రాజయోగం సిద్ధించాలంటే పుణ్య ఫలం అవసరం. శివరాత్రి నాడు ఉపవాసం ఉండి, పేదలకు లేదా అన్నార్తులకు అన్నదానం చేయడం వల్ల మహా పుణ్యం లభిస్తుంది. ధర్మశాస్త్రాల ప్రకారం.. శివరాత్రి రోజు చేసే దానధర్మాలు వేల రెట్ల ఫలితాన్ని ఇస్తాయి. ఇది మీ జాతకంలోని దుష్ట గ్రహాల ప్రభావాన్ని తగ్గించి, శుభ ఫలితాలను ఇస్తుంది.
Also Read: నిజమైన ఉపవాసం అంటే ఏంటి? చాగంటి కోటీశ్వరరావు గారి అద్భుత వివరణ
6. శివపార్వతుల కళ్యాణం, జాగరణ:
శివరాత్రి రోజు రాత్రి పూట లింగోద్భవ కాలంలో (అర్థరాత్రి) శివుడిని దర్శించుకోవడం వల్ల అసాధ్యమైన పనులు కూడా సుసాధ్యమవుతాయి. శివపార్వతుల కళ్యాణాన్ని చూడటం వల్ల కుటుంబ సౌఖ్యం, అఖండ రాజయోగం లభిస్తాయి. జాగరణ చేస్తూ శివ సహస్రనామ స్తోత్రం పఠించడం వల్ల మనోబలం పెరుగుతుంది.
పరిహారాలు అనేవి కేవలం భౌతిక మార్పుల కోసం మాత్రమే కాదు.. అవి మనలోని భక్తిని, క్రమశిక్షణను పెంచుతాయి. శివరాత్రి నాడు నిష్కల్మషమైన మనస్సుతో శివయ్యను శరణు వేడి, ఈ పరిహారాలు పాటిస్తే అఖండ రాజయోగం కలగడం తథ్యం. ఆ పరమేశ్వరుడి కృప అందరిపై ఉండాలని కోరుకుందాం.