Maha Shivratri 2026: హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన పర్వదినం మహాశివరాత్రి. లయకారుడైన పరమశివుడు లింగరూపంలో ఉద్భవించిన ఈ రోజున భక్తులు ఉపవాసం, జాగరణలతో శివయ్యను అర్చిస్తారు. ముఖ్యంగా ఈ ఏడాది.. ఫిబ్రవరి 15వ తేదీ ఆదివారం నాడు ఈ మహాపర్వం రానుంది. ఈ ఏడాది దాదాపు 300 ఏళ్ల తర్వాత అరుదైన గ్రహగతులు, శుభ యోగాల కలయికతో మహాశివరాత్రి వస్తుండటం విశేషం. శివుడికి అత్యంత ప్రీతికరమైన రుద్రాభిషేకం చేయడానికి.. ఉపవాస నియమాలు పాటించడానికి ఏ సమయం ఉత్తమమో, పూజా విధానం ఎలా ఉండాలో వివరంగా తెలుసుకుందాం.
మాఘ మాస బహుళ చతుర్దశి తిథి ఫిబ్రవరి 15 ఆదివారం సాయంత్రం ప్రారంభమవుతుంది. శివరాత్రి ప్రధానంగా రాత్రి పూజలకు ప్రాధాన్యత ఇస్తుంది కాబట్టి.. 15వ తేదీనే పండగను జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు.
చతుర్దశి తిథి ప్రారంభం: ఫిబ్రవరి 15, ఆదివారం సాయంత్రం 05:05 గంటలకు.
చతుర్దశి తిథి ముగింపు: ఫిబ్రవరి 16, సోమవారం సాయంత్రం 05:34 గంటలకు.
నిశిత కాల పూజ (లింగోద్భవ సమయం): ఫిబ్రవరి 15 అర్ధరాత్రి 11:55 నుంచి ఫిబ్రవరి 16 తెల్లవారుజామున 12:56 వరకు.
రుద్రాభిషేకం ఎప్పుడు చేయాలి ?
మహాశివరాత్రి నాడు శివలింగానికి రుద్రాభిషేకం చేయడం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం. ఈ ఏడాది రుద్రాభిషేకం చేయడానికి ఫిబ్రవరి 15 సాయంత్రం 05:04 నుండి మరుసటి రోజు ఉదయం 06:59 వరకు అత్యంత శుభప్రదమైన సమయం. ముఖ్యంగా రాత్రి నాలుగు జాములలో అభిషేకాలు చేయడం విశేష ఫలాన్ని ఇస్తుంది.
పూజా సమయాలు:
రాత్రంతా మేల్కొని చేసే ‘జాగరణ’లో భాగంగా ఈ కింది సమయాల్లో శివపూజ/అభిషేకం నిర్వహించుకోవచ్చు.
మొదటి జాము: సాయంత్రం 06:11 నుంచి రాత్రి 09:23 వరకు
రెండవ జాము: రాత్రి 09:23 నుండి అర్ధరాత్రి 12:35 వరకు.
మూడవ జాము (లింగోద్భవం): అర్ధరాత్రి 12:35 నుంచి తెల్లవారుజామున 03:47 వరకు.
నాలుగవ జాము: తెల్లవారుజామున 03:47 నుంచి ఉదయం 06:59 వరకు.
పూజా విధానం:
మహాశివరాత్రి నాడు ఇంటి వద్దే శివపూజ చేసే విధానం .
శుభ్రత: ఉదయమే తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి.
సంకల్పం: పూజకు ముందు చేతిలో అక్షతలు, నీరు తీసుకుని శివయ్యను ధ్యానిస్తూ ఉపవాస దీక్ష సంకల్పం చెప్పుకోవాలి.
అభిషేకం: పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర (పంచామృతాలు) లేదా కేవలం గంగాజలంతో శివలింగానికి అభిషేకం చేయాలి. అభిషేకం చేస్తున్నప్పుడు “ఓం నమః శివాయ” మంత్రాన్ని జపించాలి.
పత్ర సమర్పణ: శివుడికి అత్యంత ప్రీతికరమైన బిల్వ పత్రాలను (మారేడు దళాలు) సమర్పించాలి. వీలైతే ‘త్రిదళం’ (మూడు ఆకులు ఉన్న దళం) సమర్పించడం శ్రేష్ఠం.
నైవేద్యం: పండ్లు, పాలు లేదా ఇంట్లో తయారుచేసిన పిండివంటలను నైవేద్యంగా సమర్పించి ధూపదీపారాధన చేయాలి.
ముఖ్యమైన సూచనలు:
మహాశివరాత్రి రోజున పగలు ఉపవాసం ఉండాలి. ఆరోగ్యం సహకరించని వారు పండ్లు, పాలు తీసుకోవచ్చు. మరుసటి రోజు అంటే.. ఫిబ్రవరి 16 ఉదయం 06:42 గంటల తర్వాత పారణ (ఉపవాస విరమణ) చేయవచ్చు. జాగరణ అంటే కేవలం నిద్రపోకుండా ఉండటమే కాదు. మనసును శివనామ స్మరణలో లగ్నం చేయడం అని గుర్తుంచుకోవాలి.