BigTV English

Makar Sankranti 2024 : శాంతిని, కాంతిని తెచ్చే సంక్రాంతి..!

Makar Sankranti 2024 : శాంతిని, కాంతిని తెచ్చే సంక్రాంతి..!
Makar Sankranti 2024

Makar Sankranti 2024 : మనది ‌వ్యవసాయ ప్రధానమైన దేశం. పంటలు చేతికొచ్చిన ఆనందంలో దానిని పదిమందికి పంచుతూ ఆనందాన్ని పొందడం, ప్రకృతి ప్రసాదించిన ధాన్యాన్ని.. ధాన్యలక్ష్మీ రూపంలో ఆహ్వానించే రోజే.. సంక్రాంతి. ‘సం’ అంటే మిక్కిలి, ‘క్రాంతి’ అంటే సానుకూల మార్పు. ‘సంక్రమణం’ అంటే ‘చక్కగా నడవటం’ అని అర్థం. పుష్యమాసంలోని ఈ రోజే సూర్యుడు మేష రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. నేటి నుంచి ఆదిత్యుని తేజస్సు ఎలా పెరుగుతుందో అలాగే ప్రజల ఆరోగ్యం, సంపదలు వృద్ధి చెందుతాయని పెద్దలు చెబుతారు.


మిగిలిన పండుగలన్నీ చాంద్రమానం ప్రకారం జరుపుకునే భారతీయులు.. ఒక్క సంక్రాంతిని మాత్రం సౌరమానం ప్రకారం జరుపుకోవడం మరొక విశేషం. అప్పటి వరకు భూమధ్య రేఖకు దక్షిణ దిక్కులో ఉన్న సూర్యుడు సంక్రాంతి రోజునుంచి ఉత్తర దిక్కుకు మారతాడు. కనుకనే దీనిని ఉత్తరాయణం అంటారు. ఈ రోజు నుంచి సూర్యుడి తీక్షణత క్రమంగా పెరుగుతూ పోతుంది. ఈ రోజు నుంచి సుదీర్ఘంగా ఉండే రాత్రి వేళలు తగ్గి పగటి సమయం పెరుగుతుంది.

సంక్రాంతి రోజు నుంచి 6 నెలల పాటు ఉండే మోక్ష కాలాన్ని ‘ఉత్తరాయణం’ అంటారు. భగవద్గీత ప్రకారం ఇది దేవతలు మేల్కొనే కాలం. అందుకే పెద్దల పండుగగా చెప్పే సంక్రాంతి రోజున పితృ దేవతలను స్మరిస్తూ దానధర్మాలు చేస్తారు. తన పితృదేవతలను పునీతులను చేసేందుకు భగీరథుడు గంగానదిని మకర సంక్రమణ కాలంలోనే భూమిపైకి రప్పించాడని, బలి చక్రవర్తిని వామనుడు పాతాళానికి పంపినది ఈ మకర సంక్రమణ పుణ్యకాలంలోనే. ఈ మకరరాశిలోని శ్రవణ నక్షత్రంలోనే విష్ణువు.. బ్రహ్మకు అనంత పద్మనాభస్వామిగా సాక్షాత్కరించాడు. ఆదిశంకరులు సన్యసించిన రోజు, శబరిమలైలో మకరవిలక్కు వద్ద అయ్యప్పస్వామి తన భక్తులకు జ్యోతి రూపంలో కనిపించేదీ ఈ రోజే.


సంక్రాంతి రోజున ఉదయాన్నే లేచి, తలస్నానం చేసి, కొత్త బట్టలు కట్టుకుంటారు. నెల రోజుల పాటు ముగ్గుల్లో నిలిపిన గొబ్బెమ్మలను పిడకలుగా చేసి, ఆ పిడకలను మండించి, కొత్త బియ్యం, పాలు, కొత్త బెల్లం వేసి పొంగలి వండి దానిని సూర్యుడికి నివేదిస్తారు. దేవతారాధన తర్వాత పితృదేవతలకు తర్పణాలు వదులుతారు. ఈ రోజున కనిపించే మరో సుందర దృశ్యం.. గంగిరెద్దుల ఆట. చక్కగా అలంకరించిన గంగిరెద్దులను ఇంటింటికీ తిప్పుతూ, డోలు, సన్నాయి రాగాలకు అనుగుణంగా వాటిచేత చేయించే నృత్యాలు చూడటానికి చాలా రమణీయంగా ఉంటాయి. ఆ గంగిరెద్దులు మోకాళ్ల మీద వంగి, మనం ఇచ్చే కానుకలను స్వీకరించటం భలే ముచ్చటగా ఉంటుంది. ఈ రోజున సాయంత్రం ఇళ్లలో బొమ్మల కొలువు పెట్టుకుంటారు.

సంక్రాంతి పండుగకు, తిలలకు (నువ్వులు) దగ్గరి సంబంధం ఉంది. మకరరాశికి అధిపతి.. శని. ఈయనకు ఇష్టమైన నువ్వులను ఈ రోజున తిలదానం చేయటంతో బాటు విరివిగా వంటకాల్లోనూ వాడతారు. నువ్వులు ఈ చలి రోజుల్లో శరీరంలో తగినంత వేడిని కలిగిస్తాయి. నువ్వుల నూనెను శరీరానికి గట్టిగా రాసుకుని నలుగు పెట్టుకుని స్నానం చేస్తే దేహ దారుఢ్యం కలుగుతుంది. నువ్వులు వేసిన పిండివంటలు తినటం వల్ల రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. నువ్వుల దీపం ఇంట్లో పెడితే.. బ్యాక్టీరియాలు నశిస్తాయి. స్నాన సమయంలో నీళ్లలో నువ్వులు వేసుకునే సంప్రదాయమూ ఉంది.

మనిషి ఆనందంగా ఉన్నప్పుడే అతనిలోని దైవత్వం మేల్కొంటుంది. అందుకే రైతులు.. కొత్త పంట ధాన్యలక్ష్మి రూపంలో ఇంటికి చేరిన ఆనందంలో హరిదాసులకు, గంగిరెద్దుల వారికి, వేర్వేరు వృత్తికులాల వారికి తమకు ఉన్నంతలో పిండి వంటలు, కొత్తబట్టలు, ధాన్యం అందిస్తారు. ‘అంద‌రూ బాగుండాలి. అంతా మంచే జ‌ర‌గాలి’ అనే సానుకూల వాతావరణంతో, ప్రతి ఇల్లూ ఓ హరివిల్లులా మారే ఈ మకర సంక్రాతి వేళ.. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.

Related News

Ganesh Chaturthi 2025: వినాయక చవితి రోజు.. ఎలాంటి ప్రసాదాలు దేవుడికి సమర్పించాలి ?

Old Vishnu idol: అడవిలో విశ్రాంతి తీసుకుంటున్న విష్ణుమూర్తి.. ఇదొక అద్భుతం.. మీరు చూసేయండి!

Hyderabad to Tirupati Bus: తిరుపతి భక్తులకు టీజీఎస్‌ఆర్టీసీ బంపర్ ఆఫర్.. డబుల్ హ్యాపీ గ్యారంటీ

Mahaganapathi: గంట కడితే కోర్కెలు తీర్చే గణపతి.. ఎక్కడో తెలుసా?

Ganesh Chathurthi 2025: మొదటి సారి ఇంట్లో వినాయకుడిని ప్రతిష్టిస్తున్నారా ? ఈ నియమాలు తప్పనిసరి !

Ganesh Puja: గణపతి పూజలో.. ఈ రంగు దుస్తులు ధరిస్తే ఆశీర్వాదాలకు దూరమే!

Big Stories

×