Sukla Paksha Shashthi 2024: మీ జాతకంలో కుజదోషం ఉందా.. దోషనివారణకు ఏమి చేయాలనే సందేహంలో ఉన్నారా అయితే.. ఈ నెల 7వ తేదీన ఒక్క పూజ చేయండి.. మీకు దోషనివారణ సాధ్యమని వేదాలు చెబుతున్నాయి. ఇంతకు ఏ పూజ చేయాలి? ఏం చేయాలనే ధర్మ సందేహం వద్దు.. ఈ కథనం చదవండి చాలు.
మార్గశిర మాసం శుక్లపక్ష షష్టిని సుబ్రహ్మణ్య షష్టిగా జరుపు కోవాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ పవిత్రమైన రోజు రానే వచ్చింది. అదే ఈనెల 7వ తేదీనే. సుబ్రహ్మణ్యుడికి ప్రీతికరమైన రోజు ప్రతి మాసపు శుక్లపక్ష షష్టి. అయితే కుజదోషం ఉన్నవారు ఈ ప్రత్యేకమైన రోజున పలు పూజలు చేస్తే దోష నివారణ అవుతుందని వేద పండితులు తెలుపుతున్నారు. ముందుగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి చరితం తెలుసుకుందాం.
సుబ్రహ్మణ్య స్వామి చరితం..
సుబ్రహ్మణ్య స్వామి కారణ సంభవుడు. తారకాసురుని సంహరణార్థం జన్మించాడు. కుమారస్వామి, కార్తికేయ, స్కందూడు, దండ యుగ పాణి, ఆర్ముగం, శరవణ, మురుగ, షణ్ముఖ ఇలా అనేక పేర్లు ఉన్నాయి స్వామి వారికి. తారకాసురుడు బ్రహ్మకై తపస్సు చేసి 7 సంవత్సరాల వయసున్న బాలుడి చేత తప్ప దేవతల చేత కూడా మరణం లేనట్లు వరం కోరుకున్నాడు. బ్రహ్మ అనుగ్రహించారు.
బ్రహ్మ వర ప్రభావంతో తారకాసురుడు ముల్లోకాలను ముప్పతిప్పలు పెడుతూ దేవతలను బాధించాడు. ఇక దేవతలంతా ఒకనాడు బ్రహ్మ దగ్గరకు వెళ్లి తారకాసురుడి ఆకృత్యాలు మొరపెట్టుకున్నారు. అంతట బ్రహ్మ, దేవతలతో పరమశివునికి పార్వతితో కళ్యాణం చేస్తే ఆ పుట్టే బిడ్డ దేవతల సేనానిగా మారి తారకాసురుడిని సంహరిస్తారని చెప్పారు.
దేవతలు మన్మధుని సాయంతో శివపార్వతులకు వివాహం జరిపిస్తారు. శివుడు గంధ మాధవ పర్వతంపై పార్వతితో విహరిస్తూ ఉండగా దేవతల ప్రేరణ చేత అగ్నిదేవుడు ఆటంకం కలిగించాడు. అప్పుడు పతనమైన శివుని రేతస్సు అగ్నిదేవుడు భక్షించాడు. దానిని అగ్ని భరించలేక గంగలో విడిచిపెట్టాడు. గంగాదేవి తన గర్భాన కొంతకాలం మోసి రెల్లు గడ్డిలో విడిచింది. అక్కడే సుబ్రమణ్య స్వామి జన్మించారు. కృత్తికా నక్షత్రములు పాలు ఇవ్వగా 6 ముఖాలతో పాలను త్రాగారు స్వామి. ఆరు ముఖాలు కలవాడని స్వామివారిని షణ్ముఖుడు అన్నారు.
రెల్లు గడ్డిలో జన్మించిన కారణం చేత శరవణ భవుడు అనే పేరు కూడా వచ్చింది. కృత్తికా దేవతలు పెంచారు కాబట్టి కార్తికేయడని అన్నారు. దేవతల్లో కెల్లా అందమైన వాడని, ఎల్లప్పుడూ బాలప్రాయంలో ఉంటాడు కనుక, కుమారస్వామి అని, బాలసుబ్రమణ్యం అని పిలుస్తారు. గర్భం నుండి కిందకు జారి పడటం వల్ల స్కందుడు అనే పేరు వచ్చింది. బాలసుబ్రమణ్యుడు దేవతల సైన్యానికి అధిపతిగా తారకాసునితో యుద్ధం చేసి అతన్ని సంహరించాడు.
కుమారస్వామికి ఇద్దరు భార్యలు ఒకరు దేవసేన, మరొకరు వల్లి. తారకాసుర వధ అనంతరం ఇంద్రుడు తన కుమార్తె అయిన దేవసేనను కుమారస్వామికి ఇచ్చే వివాహం చేశారు. వివాహం జరిగిన ప్రదేశమే నేటి పవిత్ర పుణ్యక్షేత్రం తిరుప్పరకుండ్రం ఇది తమిళనాడులో ఉంది. వల్లి కోయ జాతి కన్య. తిరుత్తని ప్రాంతానికి చెందిన ఈ పుళింద కన్య ను వివాహమాడి కొండపై వెలిశాడని చెబుతారు. ఈ తిరుత్తని క్షేత్రం ఆంధ్రప్రదేశ్ కు అతి చేరువలో తమిళనాడులో ఉంది. అయితే మార్గశిర మాసంలో వచ్చే శుక్లపక్ష షష్టిని సుబ్రహ్మణ్య షష్టిగా జరుపు కోవాలని శాస్త్రాలు చెబుతున్నాయి.
కుజదోషం ఉన్నవారు ఇలా చేయండి
సుబ్రహ్మణ్య షష్టికి ముందు రోజు పంచమినాడు ఉపవాసం ఉండి షష్టినాడు స్వామిని పూజించాలి. ముగ్గురు లేక ఐదుగురు బ్రహ్మచారులను పిలిచి తలంటు స్నానం చేయించి, పీటల మీద కూర్చోబెట్టి , వారినే సుబ్రహ్మణ్య స్వామి స్వరూపులుగా భావించి పూజించాలి. వారికి నూతన వస్త్రాలు అందించి, భోజనం పెట్టి దక్షిణతో కూడిన తాంబూలాలు కూడా సమర్పించాలి. సుబ్రహ్మణ్య షష్టినాడు నాగులుకు చేసే పూజ ప్రత్యేకమైనది. పుట్టల వద్ద కాకుండా ఆలయాల్లో సర్పరూపి అయిన సుబ్రహ్మణ్య స్వామిని కూడా భక్తులు కొలుస్తారు. ఇదే రోజు సర్పదోషం ఉన్నవారు దాని పరిహారం కోసం సర్ప సూక్తాన్ని పఠించే ప్రత్యేక పూజలు చేస్తారు.
జాతకరీత్యా కుజదోషం ఉన్నవారు ఆ దోష నివారణ కోసం సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధిస్తారు. తారకసురుడి సంహార నిమిత్తం సేన సమేతంగా కుమారస్వామి బయలుదేరి వెళ్లినప్పుడు ఆ మార్గంలో ఆరు చోట్ల విడిది చేస్తారు. ఆ ప్రాంతాలే ఇప్పుడు గొప్ప సుబ్రహ్మణ్య క్షేత్రాలుగా మారాయి. ఇవి అన్ని తమిళనాడులోనే ఉన్నాయి. వాటిని ” పడైవీడు గళ్” అని అంటారు. అంటే సుబ్రహ్మణ్య నివాస స్థలమని అర్థం. బిక్కవోలు, రామకుప్పం మోపిదేవి నాగుల మడకలలో ప్రసిద్ధ కుమారస్వామి ఆలయాలు ఉన్నాయి. పంజాబ్ రాష్ట్రంలో గుజరాత్ రాష్ట్రంలో సుబ్రహ్మణ్య ఆలయాలు ఉన్నాయి. నాగాలాండ్ ప్రాంతంలో కూడా నాగేంద్ర స్వరూపంలో కుమారస్వామి పూజలు అందుకుంటున్నారు. – డాక్టర్ శృతి