BigTV English

Chaya Someswara Temple : ఛాయా సోమేశ్వరుడిని కోవెల విశేషాలు తెలుసా?

Chaya Someswara Temple : ఛాయా సోమేశ్వరుడిని కోవెల విశేషాలు తెలుసా?
Chaya Someswara Temple

Chaya Someswara Temple : తెలంగాణలోని అత్యంత ప్రాచీన శివాలయాల్లో ఛాయా సోమేశ్వరాలయం ఒకటి. సుమారు వెయ్యేళ్ల ఏళ్ల చరిత్ర గల ఈ కోవెలలో పరమశివుడు ఛాయా సోమేశ్వరుడనే పేరుతో పూజలందుకుంటున్నాడు. తెలంగాణలోని నల్లగొండ పట్టణానికి కేవలం 4 కి.మీ దూరంలో ఉన్న పానగల్లు గ్రామంలోని పచ్చని పొలాల మధ్య ఈ ఆలయం కొలువై ఉంటుంది.


సుమారు పదో శతాబ్దంలో పానగల్లు రాజధానిగా నేటి నల్లగొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్‌ జిల్లాలున్న ప్రాంతాన్ని పాలించిన కందూరు చోడులు తమ కులదైవమైన పరమేశ్వరునికి నిర్మించిన ఆలయాలలో ఛాయా సోమేశ్వరాలయం ప్రధానమైనది. దీనినే పచ్చల సోమేశ్వరాలయం అనీ అంటారు.

ఈ అలయ ప్రాంగణంలో మొత్తం 3 చతురస్రాకారపు గర్భాలయాలున్నాయి. అందులో ఒకటి సోమేశ్వరాలయం. రెండవది దత్తాత్రేయుని కోవెల. మరో గర్భాలయం ఖాళీగా దర్శనమిస్తుంది. ఆలయానికి ఎలాంటి రాజగోపురం ఉండదు. ఇక్కడి సోమేశ్వరాలయంలో పరమేశ్వరుడు తూర్పు ముఖంగా భక్తులకు దర్శనమిస్తాడు.


ఇక్కడి ప్రధాన విశేషమేమిటంటే.. గర్బగుడిలో శివలింగము వెనుక వున్న గోడపై ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒకేలా ఒక నీడ కనిపిస్తుంది. అదెక్కడి నుంచి పడుతుందో కూడా నేటికీ ఒక మిస్టరీయే. అది ఒక స్తంభం నీడలా కనిపించినా.. ఆలయంలోని 8 స్తంభాల్లో అది దేని నీడ అనేది నేటికీ ఎవరూ కనిపెట్టలేకపోయారు. ఆ నీడను మన చేతితో తాకితే మన చేయి కనిపించకపోవటం విశేషం.

మూడు గర్భగుడులు ఒకేలా నిర్మించినప్పటికీ కేవలం సోమేశ్వరాలయంలోనే ఈ నీడ కనిపిస్తుంది. నిజానికి సూర్యకాంతి అంతరాలయంలోకి ప్రవేశించే క్రమంలో ప్రతీ గది కూడా ఎదురుగా ఉన్న గదిలోనూ ఏకఛాయ ఏర్పడాలి. కానీ నీడలను ఏర్పరచడానికి శిల్పి సూర్యకాంతిని నేరుగా ఉపయోగించకుండా పరిక్షేపణం చెందిన సూర్యకాంతిని ఉపయోగించడం విశేషం.

ఇక్కడి మరో విశేషం.. ఆలయానికి సమీపంగా ఉండే చెరువు. ఏడాదిలో చెరువులో నీళ్లున్న రోజుల్లో సోమేశ్వరుడి శివలింగం వద్ద నీరు ఉబికి వస్తుంది. చెరువు ఎండిపోయిన రోజుల్లో గర్బగుడిలో నీటి చెమ్మ కనిపించదు. ఇక్కడి శివలింగానికి ఎదురుగా నందీశ్వరుడు కనిపించకపోవటం మరొక విశేషం. అలాగే.. సోమేశ్వరుడి గర్భాలయానికి ఇరువైపులా.. వినాయకుడు, నాగరాజు దర్శనమిస్తారు.

పూర్తిగా రాతితో నిర్మించిన ఈ ఆలయపు మండప స్తంభాలపై రామాయణ, భారత, శివలీలా ఘట్టాలు నేటికీ చెక్కుచెదరకుండా దర్శనమిస్తాయి. ఇక్కడి ద్వారపాలక విగ్రహాలు, గర్భాలయ ద్వారం పైనున్న తోరణానికి రాతిలోనే చెక్కిన పూల మొక్కలు, అద్భుతమైన శిల్పాలు మనోహరంగా ఉంటాయి. ఆలయానికి సమీపంలోని ఒక శిధిలావస్థలోని కోట దర్శనమిస్తుంది. అక్కడి ప్రతాపరుద్రుడు వేయించిన శాసనం.. కాకతీయుల కాలంలో జరిగిన ఆలయ అభివృద్ధి విశేషాలను ఆలయానికి సమీపంలోని శిధిలమైన కోటలోని ప్రతాపరుద్రుడి శాసనం మనకు వివరిస్తుంది.

మధ్యయుగపు ఛాయలతో శిల్ప కళానైపుణ్యానికి ప్రతీకగా నల్లరాతిలో చెక్కిన శిల్పకళాకృతులతో పశ్చిమ చాళుక్యులు, కుందూరు చోడులు, కాకతీయుల కళాతృష్ణకు నిదర్శనంగా, వెయ్యేళ్ల దండయాత్రల తర్వాత కూడా ఈ ఛాయా సోమేశ్వరాలయం అదేశోభతో నిలవటం విశేషం.

Related News

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Raksha Bandhan 2025: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు

Big Stories

×