బాబా వంగా గురించి అందరికీ తెలిసిందే. ఈమె భూమిపై జరిగే సంఘటనలను ముందుగా ఊహించి చెప్పిందని అంటారు. అందులో చాలా అంశాలు నిజమయ్యాయి అని కూడా అంటారు. ఇప్పుడు ఆమెలాగే జపాన్‌కు చెందిన ఒక మహిళ భవిష్యవాణి వినిపిస్తోంది. ఈమెను జపాన్ బాబా వంగా అని పిలుస్తున్నారు. ఈమె చేసిన అంచనా ప్రకారం జులై 5, 2025న పెద్ద ప్రళయం రాబోతోంది. జపాన్ కు చెందిన ఈమె పేరు రియో టాట్సుకి. ఇప్పుడు ఆమె ఎంతో ఫేమస్ అయ్యింది.
ఈమె గతంలో చెప్పిన విషయాలు చాలా వరకు జరిగాయి అనే ప్రచారం ఉంది. అయితే ఆమె జూలై 5న అంటే రేపు జపాన్లో మహాప్రళయం రాబోతోందని, అది జపాన్ ను నాశనం చేస్తుందని జోస్యం చెప్పింది. దీంతో జపాన్ ప్రజలు భయంతో వణికిపోతున్నారు.
పోతులూరి కాలజ్ఞానం ఏం చెబుతోంది?
మన తెలుగువారిలో కూడా పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానం గురించి చెప్పుకుంటారు. ఆయన కూడా ఇలాంటి జోస్యాలు ముందుగానే చెప్పారని అంటారు. అలాగే బ్రహ్మంగారు చెప్పిన జోస్యంలో జరిగినవి కూడా ఎన్నో ఉన్నాయి. కాలజ్ఞానం అనేది ఒక పెద్ద గ్రంథం దాన్ని అనేక భాగాలుగా విభజించారు. ఆయన చెప్పిన వాటిలో ఎన్ని నిజమయ్యాయో చూడండి.
మానవులలో ధర్మం, సత్యం, నీతి వంటివి తగ్గిపోతాయని, భూమిపై అధర్మం పెరుగుతుందని చెప్పారు. అది నిజంగానే జరిగింది. అలాగే ప్రజల్లో స్వార్ధం, దురాశ, అనాచారాలు ఎక్కువైపోతాయని చెప్పారు. పురుషులు స్త్రీల వలే, స్త్రీలు పురుషులవలే ప్రవర్తిస్తారని రాసుకొచ్చారు. అది ఇప్పటికే జరిగింది.
ప్రకృతి విపత్తులు వస్తాయి
ప్రకృతి విపత్తుల గురించి చెబుతూ భూకంపాలు, వరదలు, కరువులు వంటివి ఎక్కువగా వస్తాయని కాలజ్ఞానంలో రాశారు. నదులు ఎండిపోతాయని భూమి కదిలిపోతుందని చెప్పారు. ఇవన్నీ కూడా ప్రతి ఏడాది ఎక్కడో దగ్గర జరుగుతూనే ఉన్నాయి.
ఇక రాజుల పాలన అంతమైపోతుందని రాజ్యాలు కూలిపోతాయని వివరించారు. కొత్త రాజ్యాలు పుట్టుకొచ్చి కొత్త నాయకులు ఉద్భవిస్తారని చెప్పారు. దేశాలన్నీ కలిపి ఒకటిగా కలుస్తాయని జోస్యం చెప్పారు. మన భారత దేశంలో అదే జరిగింది. రాజ్యాలన్నీ కూలిపోయి, సంస్థానాలన్నీ కలిసి ఒక పెద్ద దేశంగా ఏర్పడ్డాయి.
గాలిలో మాటలు
సాంకేతిక పురోగతి గురించి చెబుతూ పక్షులుగా మనుషులు ఆకాశంలో ఎగిరే రోజులు వస్తాయని, నీటిలో ఇనుపు ఓడలు తిరుగుతాయని అన్నారు. అప్పుడే విమానాలు ఆధునికమైన ఓడలు పుట్టుకొచ్చాయి. అలాగే మాటలు గాలిలో తిరుగుతాయని వివరించారు. అంటే టెలిఫోన్, రేడియో, ఇంటర్నెట్ ద్వారా మనము మాట్లాడుకోగలము. లేదా ఎవరికైనా సందేశాన్ని వినిపించగలము. ఇది కూడా జరిగింది.
కలియుగంలో అధర్మంలో అధిక స్థాయికి చేరుకుంటుందని, అప్పుడు ఒక దైవిక శక్తి వచ్చి ధర్మాన్ని తిరిగి స్థాపిస్తుందని చెప్పారు. ఇప్పుడు మనము ఆ గొప్ప గురువు కోసమే ఎదురు చూస్తున్నాము.
రక్త సంబంధాలు క్షీణిస్తాయి
సామాజిక బంధుత్వాల గురించి చెబుతూ రక్త సంబంధాల్లో కూడా
ద్రోహం, అవిశ్వాసం పెరిగిపోతాయని.. తల్లిదండ్రులు పిల్లలను గౌరవించరని, గురువులు శిష్యులు ఒకరికొకరు దూరమవుతారని చెప్పారు. ఇప్పటికే గురు శిష్యులు బంధం ఎప్పుడో బలహీనపడింది.
పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చెప్పినట్టు చాలా విషయాలు కలియుగంలో జరుగుతూ ఉన్నాయి. అందుకే జ్యోతిష్కులు చెప్పినవి ప్రజలు నమ్మే పరిస్థితుల్లోనే ఉన్నారు. కాలజ్ఞానంలో చెప్పిన జోస్యాలన్నీ కూడా సంకేత భాషలో రాసినవి. అంటే ఒకే పద్యానికి ఎన్నో రకాల అర్థాలు ఉండవచ్చు. అది అర్థం చేసుకున్న దాన్నిబట్టి ఉంటుంది. ఈయన రాసిన పద్యాలు లేదా జోస్యాలు, గ్రామీణ కథలు, ఆధునిక మాధ్యమాల ద్వారా వ్యాప్తి చెందాయి.