ఇటీవల వైసీపీ నేతలు, కార్యకర్తలు కామన్ గా ఓ డైలాగ్ చెబుతున్నారు. 2029లో మేం అధికారంలోకి వస్తాం, మీ సంగతి తేలుస్తామంటూ వార్నింగ్ లు ఇస్తున్నారు. ఈ వార్నింగ్ లకు ఘాటుగా బదులిచ్చారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. 2029లో అధికారంలోకి వస్తే అంతు చూస్తామంటూ వైసీపీ నేతలు అంటున్నారని, అంతు చూడాలంటే వారు అధికారంలోకి రావాలికదా అని ప్రశ్నించారు. వైసీపీ అధికారంలోకి ఎలా వస్తుందూ తానూ చూస్తానంటూ హెచ్చరించారాయన. వ్యక్తిగతంగా తనకు ఎవరిపై కక్ష ఉండదని, కానీ వైసీపీ నేతలు రౌడీయిజం, గూండాయిజంతో ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేశారన్నారు పవన్. సగటు మనిషిని బెదిరించడం వల్లే వైసీపీకి ఈ పరిస్థితి వచ్చిందన్నారు.
2029లో అధికారంలోకి వస్తే మీ అంతు చూస్తామని అంటున్నారు..మీరు అధికారంలోకి రావాలి కదా! మీరు ఎలా వస్తారో నేనూ చూస్తాను !
– జగన్ కు పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ కౌంటర్#PawanKalyan pic.twitter.com/v1KA1a35pj
— Telugu360 (@Telugu360) July 4, 2025
నేనే పర్యవేక్షిస్తా..
ప్రకాశం జిల్లాలోని మార్కాపురం సమీపంలో నరసింహపురంలో తాగునీటి పథకానికి పవన్ కల్యాణ్ శంకుస్థాపన చేశారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత తొలిసారిగా ప్రకాశం జిల్లాలో ఏర్పాటు చేస్తున్న అతిపెద్ద తాగునీటి పథకం ఇదేనని చెప్పారాయన. దాదాపు 10 లక్షలకు పైగా జనాభాకు తాగునీటిని అందించబోతున్నామని వివరించారు. జల్ జీవన్ మిషన్ మొదటి విడతలో రూ.1,290 కోట్లతో ఈ పథకాన్ని మొదలు పెడుతున్నట్టు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నుంచి కూటమి తరపున 21మంది ఎంపీలు గెలవడం.. కేంద్రంలోని కూటమి ప్రభుత్వానికి ఆక్సిజన్ లా మారిందని, అందువల్లే ఏపీకి నిధులు వస్తున్నాయని వివరించారు పవన్ కల్యాణ్. సకాలంలో నిధులు వస్తే 18 నుంచి 20 నెలల్లోనే ఈ ప్రాజెక్ట్ పూర్తి చేస్తామన్నారు పవన్. తాను ప్రత్యేకంగా ఈ పథకాన్ని పర్యవేక్షిస్తానన్నారు.
చొక్కా విప్పి చూపిస్తామా..?
అనంతరం బహిరంగ సభలో మాట్లాడిన పవన్ వైసీపీపై నిప్పులు చెరిగారు. 2019లో వైసీపీకి 151 సీట్లు వచ్చి తాను రెండు చోట్లా ఓడిపోయినా కూడా వారిని బలంగా ఎదుర్కొన్నానని గుర్తు చేశారు పవన్. తాను సినిమా నుంచి వచ్చిన వాడినే.. కానీ సినిమా డైలాగులు చెప్పనన్నారు. “గొంతులు కోసేస్తాం… మెడకాయలు కోసేస్తాం అంటే మేమైనా చొక్కా విప్పి చూపిస్తామా.” అన్నారు. సినిమాలో డైలాగులు నిజ జీవితంలో చెప్పడానికి తాను ఇబ్బంది పడుతుంటానన్నారాయన. వైసీపీ నాయకుల పాలన బాగోలేదు కాబట్టే ప్రజలు 11 సీట్లకు పరిమితం చేశారన్నారు. ప్రతిపక్షంలో ఉన్నా కూడా వైసీపీ నేతల మాటతీరు మారలేదని, ఇంకా ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసేలా మాట్లాడుతున్నారని చెప్పారు. 2029లో అధికారంలోకి వస్తే అంతుచూస్తామంటున్నారని, అసలు వారు అధకారంలోకి రావాలికదా అని ఎద్దేవా చేశారు. 11 సీట్లు వచ్చిన పార్టీగా వైసీపీని గౌరవిస్తామని అన్నారు పవన్. చంద్రబాబు సారథ్యంలో నడుస్తున్న కూటమి ప్రభుత్వంలో తప్పొప్పులు ఉంటే చెప్పాలని ప్రజల్ని కోరారు. తప్పులుంటే సరిదిద్దుకుంటామన్నారు పవన్.
నీకు 151 సీట్లు వచ్చిన, నేను రెండు చోట్ల ఓడిపోయిన, నిన్ను ఎదుర్కొని నిలబడ్డానుగా..
మీ అహంకారాన్ని అనిచి 11 సీట్లకు పరిమితం చేసాం కదా??
కుతుకులు కోస్తాం, రప్ప రప్ప నరుకుతాం, అంటూ ఎగస్ట్రాలు చేస్తే 11 కాస్త 1 అయిపోతుంది జాగ్రత్త జగన్ రెడ్డి!!
AP Deputy C M @PawanKalyan garu.🔥🔥 pic.twitter.com/3crkglePwh
— JanaSena Samhitha (@JSPSamhitha) July 4, 2025
ఆ భూముల జోలికి వెళ్లొద్దు..
దేవదాయ, అటవీ శాఖ భూముల జోలికి వెళ్లొద్దని కబ్జాదారుల్ని హెచ్చరించారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. ఖాళీగా కనిపించిన భూములపై గత ప్రభుత్వంలో పెద్దలు వాలిపోయారని, వారు ఆక్రమించిన భూములపై తమ ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్పారు. దేవాలయ భూములకు రక్షణ కల్పించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుందన్నారు పవన్. లక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయ భూములు దోచుకోవాలనుకుంటే అంతే సంగతి అని హెచ్చరించారు.