Chanakya Niti: లోకంలో చాలా మంది మంచి లక్షణాలు ఉన్నవారు, తెలివితేటలు ఉన్నవారు కూడా జీవితంలో ఒక సాధారణ స్థాయిలోనే ఉండిపోతారు. మనం తరచుగా చూస్తుంటాం. ఎంతో ప్రతిభ ఉండి కూడా వారు ఎందుకు వెనుకబడిపోయారు? అని. ఆచార్య చాణక్యుడు తన ‘చాణక్య నీతి’లో దీనికి గల కారణాలను విశ్లేషించారు. లోక జ్ఞానం లేకపోవడం, అతి వినయం, సందర్భోచితంగా వ్యవహరించకపోవడం వంటివి మంచి వ్యక్తులను సగటు మనుషులుగా మిగిల్చేస్తాయి. “అడవిలో తిన్నగా ఉండే చెట్టునే ముందు నరుకుతారు” అనే చాణక్యుడి వాక్యం, అతి మంచితనం వల్ల కలిగే నష్టాన్ని తెలియజేస్తుంది. మంచి వ్యక్తులు సగటు స్థాయిలోనే ఆగిపోవడానికి గల 5 ప్రధాన కారణాలను తెలుసుకుందాం.
మంచి వ్యక్తులు సగటు స్థాయిలోనే ఉండిపోవడానికి 5 కారణాలు:
1. అతి మంచితనం:
“అత్యంత సరళైర్న భావ్యం గత్వా పశ్య వనస్థలీమ్ |
ఛిద్యంతే సరళాస్తత్ర కుబ్జాస్తిష్ఠంతి పాదపాః ||”
దీని అర్థం.. అడవిలోకి వెళ్లి చూస్తే మొదట తిన్నగా ఉన్న చెట్లనే నరుకుతారు. వంకరగా ఉన్నవి అలాగే మిగిలిపోతాయి. లోకంలో అతి మంచితనాన్ని ఎదుటివారు బలహీనతగా చూస్తారు. మంచి వ్యక్తులు అందరినీ నమ్ముతారు. దీని వల్ల వారు మోసపోవడమే కాకుండా వృత్తిపరంగా వెనుకబడిపోతారు.
2. సందర్భాన్ని బట్టి మారలేకపోవడం:
మంచి వ్యక్తులు తరచుగా తమ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటారు. అది మంచిదే. కానీ.. మారిన పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలను మార్చుకోలేరు. చాణక్యుడి దృష్టిలో విజేత కావాలంటే.. కొంత ‘రాజతంత్రం’ తెలిసి ఉండాలి. లోకరీతిని అర్థం చేసుకుని, ఎప్పుడు మౌనంగా ఉండాలో, ఎప్పుడు గళం విప్పాలో తెలియని వారు ఎంతటి మంచివారైనా సరే.. ఆఫీసుల్లో లేదా సమాజంలో సగటు స్థాయిలోనే మిగిలిపోతారు.
3. రిస్క్ తీసుకోవడానికి భయపడటం:
చాలా మంది సజ్జనులు భద్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఓటమి ఎదురైతే పరువు పోతుందేమోనని లేదా ఉన్నది ఎక్కడ పోతుందోనని భయపడి రిస్క్ తీసుకోరు. చాణక్యుడి ప్రకారం.. సాహసం లేనిదే సామ్రాజ్యాలను నిర్మించలేరు. సగటు మనుషులు తమ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రాకపోవడం వల్లే గొప్ప విజయాలను అందుకోలేరు.
Also Read: పేదలను హింసించే.. వారికి శని శిక్ష తప్పదట!
4. శత్రువును లేదా పోటీని తక్కువ అంచనా వేయడం:
మంచి వ్యక్తులు అందరూ తనలాగే ఆలోచిస్తారని అనుకుంటారు. కానీ చాణక్యుడు “లోకం దుర్మార్గులతో నిండి ఉంది. అప్రమత్తంగా ఉండాలి” అని హెచ్చరిస్తారు. ఎదుటివారి కుతంత్రాలను గమనించలేకపోవడం, పోటీ ప్రపంచంలో తగిన వ్యూహాలు సిద్ధం చేసుకోకపోవడం మంచి వారిని వెనక్కి నెట్టేస్తుంది. కేవలం కష్టపడి పని చేయడం మాత్రమే సరిపోదు. మన చుట్టూ ఉన్న వ్యక్తుల స్వభావం తెలిసి ఉండాలి.
5. లక్ష్యం పట్ల మొండితనం లేకపోవడం:
మంచి వారు తరచుగా ఇతరుల కోసం తమ లక్ష్యాలను వదులుకుంటారు లేదా సర్దుకుపోతారు. కానీ గొప్ప స్థాయికి ఎదిగిన వారు తమ లక్ష్యం పట్ల అత్యంత కఠినంగా ఉంటారు. చాణక్యుడు చెప్పినట్లు, కార్యసాధకుడు తన పని పూర్తయ్యే వరకు విశ్రమించకూడదు. సగటు మనుషులు చిన్న అడ్డంకి రాగానే లేదా ఎవరైనా ఏదైనా అన్నారని తమ ప్రయాణాన్ని ఆపేస్తారు.