Karimnagar Robbery: స్వేచ్చ బ్యూరో: కరీంనగర్ జిల్లా కేంద్రంలో బుధవారం అర్థరాత్రి భారీ దోపిడీ కలకలం సృష్టించింది. భగత్ నగర్‌కు చెందిన అజ్మాత్ అలీ ఇంట్లోకి చొరబడిన ఐదుగురు సాయుధ దొంగలు, కుటుంబ సభ్యులను బొమ్మ తుపాకులతో బెదిరించి భయాందోళనకు గురిచేశారు. అనంతరం వారిని ఒక గదిలో బంధించి, ఇంట్లోని రూ.15 లక్షల నగదు, 65 తులాల బంగారం, కిలో వెండి ఆభరణాలను దోచుకెళ్లారు. పారిపోయే క్రమంలో ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న రెండు మోటార్ సైకిళ్లను దొంగిలించి అక్కడి నుంచి పరారయ్యారు. పట్టణ నడిబొడ్డున జరిగిన ఈ దారుణం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది.
కరీంనగర్ పోలీస్ కమిషనర్ మహ్మద్ గౌస్ ఆలం ఆధ్వర్యంలో విచారణ ముమ్మరం చేసిన కొద్దిసేపటికే ముఖ్యమైన ఆధారం లభించింది. హుజూరాబాద్ మండలం పెద్దపాపయ్యపల్లి గ్రామ శివారులోని ఎస్ఆర్‌ఎస్పీ (SRSP) కెనాల్ వద్ద అనుమానాస్పదంగా పడి ఉన్న రెండు మోటార్ సైకిళ్లను స్థానిక గ్రామస్థులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దొంగలు వాడిన వాహనాలుగా నిర్ధారించుకున్న పోలీసులు వెంటనే హుజూరాబాద్ ఏసీపీ వాసంశెట్టి మాధవి, సీఐలు , కరుణాకర్, శ్రీనివాస్ లతో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కరీంనగర్ నుంచి డీసీపీ వెంకటరమణ, సీఐ కోటేశ్వర్‌లతో పాటు క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ బృందాలు అక్కడకు చేరుకుని క్షుణ్ణంగా ఆధారాలు సేకరించాయి.
దోపిడీ దొంగలు సొత్తుతో పాటు ద్విచక్రవాహనాలను ఈ ప్రాంతంలోనే వదిలి వెళ్లడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిందితులు ఈ ప్రాంతానికే చెందినవారా? లేక విచారణను దిశమార్చి పోలీసులను తప్పుదారి పట్టించేందుకు వ్యూహాత్మకంగా వాహనాలను ఇక్కడ వదిలేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల పట్టణంలోని ఓ జ్యువెలరీ షాపులో జరిగిన చోరీ ఘటన మరవకముందే మళ్లీ ఇంతటి పెద్ద దోపిడీ జరగడాన్ని సీపీ గౌస్ ఆలం తీవ్రంగా పరిగణించారు. నిందితులను త్వరితగతిన పట్టుకునేందుకు 11 ప్రత్యేక గాలింపు బృందాలను రంగంలోకి దించారు.
హుజూరాబాద్ ప్రాంతంలో వాహనాలు దొరకడంతో నిందితులు రైలు లేదా బస్సుల్లో పారిపోయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఉప్పల్, జమ్మికుంట, బిజిగిరి షరీఫ్ రైల్వే స్టేషన్లతో పాటు పరిసర ప్రాంతాల్లోని ఆర్టీసీ బస్టాండ్ల సీసీటీవీ (CCTV) ఫుటేజీలను నిశితంగా పరిశీలిస్తున్నారు. కరీంనగర్ నుంచి హుజూరాబాద్ మార్గంలో ఉన్న మానకొండూరు, శంకరపట్నం, హుజూరాబాద్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని కెమెరా రికార్డింగ్స్‌ను విశ్లేషిస్తున్నారు. ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ బృందాలు సైతం రంగంలోకి దిగి సమాచారాన్ని సేకరిస్తున్నాయి. దోపిడీ ముఠాను త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని పోలీస్ ఉన్నతాధికారులు ధీమా వ్యక్తం చేశారు.
Also read: Delhi Protests: ఢిల్లీ పోలీసుల లాఠీఛార్జ్‌పై కోర్టు సీరియస్.. కీలక ఆదేశాలు జారీ!