
Ayanavilli Kshetra:- అమలాపురానికి సమీపంలోని అయినవిల్లి సిద్ధివినాయకస్వామి పేరు తెలియని వారుండరు. స్వామిని మనసులతో భక్తితో తలచుకుని ఏ పని తలపెట్టినా విజయవంతం నెరవేరుతుందని భక్తుల నమ్మకం. ఇక్కడ వినాయకుడికి గరిక పూజలన్నా, కొబ్బరికాయ మొక్కులన్నా ఎంతో ఇష్టమట. ఇక్కడకొచ్చే భక్తులు మొక్కుల రూపంలో ఏటా స్వామికి సమర్పించే కొబ్బరికాయల సంఖ్య ఇరవై లక్షలు పైమాటే . స్వయంభువు గణపతి క్షేత్రాలలో ఒకటైన ఈ అయినవిల్లి క్షేత్రం కృతయుగం నాటిదని…అక్కడి స్థలపురాణం వివరిస్తోంది. 14వ శతాబ్ది కాలంలో శంకరభట్టు రాసిన శ్రీపాద శ్రీవల్లభ చరిత్ర గ్రంథంలో క్షేత్ర ప్రస్తావన కనిపిస్తుంది.
ప్రతీ రోజు రకరకాల పళ్ల రసాలతో సిద్దివినాయకుడ్ని ప్రత్యేకంగా అభిషేకిస్తారు. ప్రతి సంవత్సరం మాఘశుద్ధ సప్తమి రోజు సప్త జీవనదుల జలాలతో సప్తనదీ జలాభిషేకం నిర్వహిస్తుంటారు. ప్రతియేటా విద్యార్థుల కోసం -వార్షిక పరీక్షల ముందు ఫిబ్రవరి రెండు, మూడు తేదీల్లో దాదాపు లక్ష పెన్నులతో శ్రీ స్వామివారికి అభిషేకం చేసి, వాటిని విద్యార్థులకు ప్రసాదంగా ఇస్తుంటారు. ఇలా స్వామి వారి బహుమతిగా ఇచ్చిన పెన్నులతో పరీక్ష రాస్తే తప్పకుండా మంచి మార్కులతో పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తారని విద్యార్థుల విశ్వాసం. స్వామి వారి పాదాల చెంత ఉంచిన కలం విద్యాభివృద్ధికి తోడ్పడుతుందనేది భక్తుల విశ్వాసం. మూడు వారాలు పాటు నిర్వహించే పెన్నుల పంపిణీకి భక్తుల నుంచి విశేష స్పందన కనిపిస్తుంది. ఈ ఆచారం చాలా కాలంగా వస్తోంది.
అయినవిల్లి ఆలయ ప్రాంగణంలో నిత్యం లక్ష్మీ గణపతి హోమం నిర్వహిస్తారు. భక్తులెవరైనా రూ.300 చెల్లిస్తే చాలు ఈ హోమంలో భాగస్వాములు కావచ్చు. మామూలుగా అయితే ఈ హోమానికి వేల రుపాయలు ఖర్చవుతుంది. వినాయకచవితి నవరాత్రి మహోత్సవాలు ఇక్కడ చాలా ఘనంగా జరుగుతాయి.