BigTV English

Significance Of Kanuma : కోటి సంతోషాల కనుమ..!

Significance Of Kanuma : కోటి సంతోషాల కనుమ..!
significance of kanuma festival

Significance Of Kanuma : మూడు రోజుల సంక్రాంతి పండుగలో చివరిరోజును కనుమగా జరుపుకోవటం మన సంప్రదాయం. ఇది ప్రధానంగా పశువుల పండుగ. ఏడాది పొడవునా సేద్యంలో సాయం చేసిన పశువులను ఈ రోజు ఏ పనీ చేయించకుండా కొమ్ములకు ఇత్తడి తొడుగులు, మూపురాలకు రంగురంగుల అలంకరణలు, కాళ్లకి గజ్జెలు, మెడలో పూచెండులు కట్టి పూజలు చేస్తారు. మద్ది, మాను, నల్లేరు, మారేడు, బెల్లం తదితరాలు నూరిన మిశ్రమాన్ని ఉప్పుచెక్క పేరుతో పశువులకు తినిపిస్తారు. దీనివల్ల వాటి ఆరోగ్యం బాగుంటుందని చెబుతారు.


‘కనుమ రోజు మినుము తినాలి’ అనే సామెత కూడా ఉంది. పితృదేవతలను తల్చుకుంటూ గారెలు వండుకోవాలన్న సూచన ఇందులో కనిపిస్తుంది. అలాగే సూర్యుడు ఉత్తరాయణంలోకి మారే ఈ సమయంలో క్రమేపీ వాతావరణంలోని ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉంటాయి కాబట్టి, మినుములు అందుకు అనుగుణంగా శరీరాన్ని సంసిద్ధం చేస్తాయి. మినుములు తింటే ఒంట్లో వేడి పుడుతుంది. రాబోయే పనులకు తగిన సత్తువ లభిస్తుంది.

ఊళ్లో ఎటు చూసినా తనకు సమృద్ధిగా తిండి లభిస్తోంది కాబట్టి కాకి ఇక ఎటూ ఆహారం కోసం వెళ్లాల్సిన పని ఉండదు గనుకే.. ‘కనుమరోజు కాకి కూడా కదలదు’ అన్న సామెత వచ్చింది. పండుగకు వచ్చిన కూతురూ, అల్లుడూ ఇంకో రోజు ఉంటే బాగుండనే ఉద్దేశమూ ఈ సామెత వెనక ఉంది.


కనుమ రోజున కాటమరాయుడు(పశువుల దేవుడు)ని పూజించే సంప్రదాయమూ కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది. చక్కగా అలంకరించిన పశువులను ఆ కాటమరాయుడి గుడి లేదా గ్రామ దేవత గుడి వద్దకు తీసుకెళ్లి, మూడుసార్లు తిప్పి వచ్చే ఏడాదంతా తమ పశువులు ఆరోగ్యంగా ఉండాలని మొక్కుకుంటారు.

కనుమ నాడు తప్పని సరిగా ఇంటిముందు రథం ముగ్గు వేస్తారు. మనిషి శరీరమూ ఒక రథమేనని, ఈ రథాన్ని నడిపేవాడు పరమాత్ముడేననే భావన రథం ముగ్గులో ఉంది. తనను సరైన దారిలో నడిపించమని కోరుతూ పరమాత్మని ప్రార్థించటమే.. ఈ రథం ముగ్గులోని ఆంతర్యం. ఉత్తరాయణ పుణ్యకాలంలో.. వచ్చిన ‘సంక్రాంతి’ పురుషుడు సకల శుభాలని కలిగించాలని కోరుతూ.. ఇంటి ముంగిట రథం ముగ్గుని వేసి.. వేసి పువ్వులు, పసుపు, కుంకుమతో పూజచేసి గౌరవంగా ఇంటి నుంచి పొలిమేర వరకూ సాగనంపుతారు. అందరితో కలిసి జీవిస్తామనేందుకు ప్రతీకగా.. పక్కింటివారి రథం ముగ్గుతో తమ ముగ్గును కలుపుతారు.

కనుమ రోజు ఈ కనుమ రోజునే పొలం నుంచి తెచ్చిన ధాన్యం కంకులను గుత్తులుగా కట్టి ఇంటి వసారాల్లో వేలాడదీస్తారు. దీనివల్ల ఏడాది పొడవునా ఇంటి ప్రాంగణంలో పక్షుల కిలకిలారావాలు వినే అవకాశం కలుగుతుంది. అలాగే.. స్నేహితులతో కలిసి కోడి పందేలు, ఎడ్ల పందాలు, పొట్టేలు పందేలలో పాల్గొనటం, విందు వినోదాలతో కాలక్షేపం చేయటం ప్రత్యేకం.

Related News

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Big Stories

×