
Drashta Vidyaranyulu : మహాపురుషుల ఆవిర్భావం మానవ కల్యాణానికేనని ఆధునిక కాలంలో నిరూపించిన వారిలో విద్యారణ్య స్వామి ముందువరుసలో ఉంటారు. విజయనగర సామ్రాజ్య స్థాపకులైన హరిహరరాయలు, బుక్కరాయలకు గురువుగా మార్గదర్శకత్వం వహించి, అంతరించి పోతున్న సనాతన ధర్మాన్ని తిరిగి పున: ప్రతిష్ట చేసిన ద్రష్ట విద్యారణ్యులు. సనాతన ధర్మ పునరుజ్జీవానికి బాటలు పరిచిన విద్యారణ్యులు.. క్రీ.శ 1331లో కార్తీక శుద్ధ సప్తమి నాడు శృంగేరీ పీఠాధిపతిగా అభిషిక్తులయ్యారు. వారు పీఠాధిపత్యం వహించిన ఈ పుణ్యదినాన.. వారి జీవన విశేషాలను రేఖామాత్రంగా తెలుసుకుందాం.
శ్రీ విద్యారణ్యులు.. దుర్ముఖినామ సంవత్సరం వైశాఖ శుద్ధ సప్తమి బుధవారం-పుష్యమీ నక్షత్రం ధనుర్లగ్నంలో(11 ఏప్రిల్ 1296) నేటి వరంగల్లు పట్టణంలో ఒక పేద నియోగి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఆయన చిన్ననాటి పేరు మాధవుడు. ఇద్దరన్నదమ్ముల్లో ఈయనే పెద్దవారు. తండ్రి వద్దనే తర్కము, వేదాధ్యయనం, వ్యాకరణం, మీమంశ తదితరాలను అధ్యయనం చేసిన మాధవుడు… తదుపరి విద్యకోసం శంకరానందుల వద్దకు వెళ్లారు.
బాల మాధవుని ప్రతిభా విశేషాలు చూసిన శంకరానందులకు ఆ వచ్చిన బాలుడు అవతారపురుషుడని, వేద, ధర్మ రక్షణకై అవతరించిన మహాయోగి అని తెలుసుకుని, సకల విద్యలనూ వాత్సల్యంతో బోధించారు. అనంతరం మాధవుడు తిరిగి వరంగల్లు తిరిగివచ్చారు. అయితే.. ఎంత పాండిత్యం సంపాదించినా మాధవుడికి ఏదో తెలియని అసంతృప్తి వెంటాడేది. ధర్మరక్షణకై జీవితాంతం పనిచేయాలనే తపన అతడిని నిద్రపట్టనిచ్చేది కాదు.
సరిగ్గా ఆ సమయంలోనే మాధవునికి.. శృంగేరీ శంకర పీఠాధిపతులు.. శ్రీశ్రీశ్రీ విద్యాతీర్థ మహాస్వామి నుంచి తక్షణం శృంగేరి బయలుదేరి రావాలనే కబురొచ్చింది. అప్పటికే మాధవుని తపఃశక్తి, వేద వేదాంగాలలో సాధించిన అపూర్వ పాండిత్యము, మంత్ర శాస్త్రాలలో పట్టు సాధించిన వైనాన్ని స్వామీజీ విని ఉన్నారు. ఆనాడు దేశం ఎదుర్కొంటున్న సమస్యలను మాధవునితో చర్చించిన స్వామీజీ, పీఠాధిపత్యాన్ని స్వీకరించి.. ధర్మ ప్రతిష్టాపన చేయాలని ఆదేశించారు.
అలా.. 1331లో కార్తీక శుద్ధ సప్తమి నాడు మాధవాచార్యులు సన్యసించి శ్రీ విద్యారణ్య స్వామిగా అవతరించారు. గురువుల కఠిన పరీక్షలను ఎదుర్కొని కరోర నియమాలు ఆచరించిన విద్యారణ్యులు.. పీఠం ఉత్తరాధికారిగా విశేష కీర్తిని ఆర్జించారు. పిదప రెండేళ్లకు గురువు శివైక్యం చెందటంతో విద్యారణ్యులు శృంగేరీ పీఠాన్ని అధిరోహించారు.
అనంతర కాలంలో విద్యారణ్యులు వారణాసి యాత్ర చేపట్టారు. ఆ సమయంలో గంగా స్నానానికై మణికర్ణికా ఘాట్‌కు వెళ్లగా సాక్షాత్తూ వ్యాస భగవానుని దర్శనమైంది. సనాతన ధర్మాన్ని రక్షించేలా కర్ణాటక రాజ్య సంస్థాపనకు పూనుకోమని, అది 300 ఏళ్ల పాటు సనాతన ధర్మానికి ఆలవాలంగా నిలుస్తుందని వ్యాసులు సూచించి ఆశీర్వదించారట.
అటు పిమ్మట.. పరవశులై విద్యారణ్యులు వ్యాసుని పాదధూళిని స్వీకరించి, బదరి, త్రివేణీ సంగమం, గయ, మధుర, అయోధ్యలను దర్శించి తుంగభద్రా నదీ తీరాన హంపీ సమీపంలోని మాతంగ పర్వతం మీద తపస్సును ఆచరించారు.
సరిగ్గా ఆ సమయానికి నాటి ఢిల్లీ సుల్తాను దక్షిణ భారతదేశ దండయాత్ర అనంతరం.. హరిహర రాయలు, బుక్కరాయలను బందీలుగా చేసి, ఢిల్లీ తీసుకెళ్ళుతాడు. వీరిద్దరినీ ఇస్లాంలోకి మారమని కోరటం, వారు నిరాకరించటం, వీరి శౌర్య పరాక్రమాలు భవిష్యత్తులో తనకు దక్షిణాదిన ఉపయోగపడతాయనే దూరాలోచనతో.. మతం మారే విషయాన్ని పునరాలోచించమని హెచ్చరిస్తూనే వారిని సేనాధిపతులుగా ప్రకటించి వదిలిపెడతాడు.
వారిద్దరూ తుంగభద్రా నదీ తీరానికి చేరుకుని, తాము ఢిల్లీకి బానిసలం కాదనీ, సర్వ స్వతంత్రులమని ప్రకటించుకుని, కలలో కనిపించిన విద్యారణ్య స్వామి కోసం మాతంగ పర్వతానికి వచ్చి అక్కడ తపస్సు చేస్తున్న స్వామి పాదాలమీద పడతారు. విద్యారణ్యుడు వారిని ఆశీర్వదించి, తుంగభద్ర నదికి కుడి వైపు సామ్రాజ్యస్థాపన చెయ్యమని సూచిస్తారు. రాజ్యం నదికి ఎడమ వైపుకు విస్తరణ జరిగినప్పుడు విద్యారణ్యుని గౌరవార్థంగా రాజధానికి విద్యానగరం అని వారు నామకరణం చేశారు.
హంపినగరం రూపానికి శ్రీచక్రము ఆధారంగా 12 క్రోసుల నగరాన్ని రూపొందించి, 20 అడుగుల మందంతో, 30 అడుగుల ఎత్తు, 4 క్రోసుల పొడవుతో కోట నిర్మాణానికి రూపకల్పన చేశారు. నగరం మధ్యలో విరూపాక్ష దేవాలయము, కోటకు 9 గుమ్మాలతో నగరాన్ని నిర్మింపజేశారు. సామ్రాజ్యానికి రాజధాని పేరు క్రమంగా విజయనగరం (విజయాన్ని ప్రసాదించే నగరం కాబట్టి) గా మారుతుంది.
సా.శ.1336 రాగి ఫలకం ఆధారంగా ‘విద్యారణ్యుడి ఆధ్వర్యములో హరిహర రాయలు సింహాసనాన్ని అధిష్టించాడు’ అని తెలుస్తోంది. దీంతో.. నాటి నుంచి నేటివరకు శృంగేరీ శారదా పీఠాధిపతుల బిరుదుల్లో ‘కర్ణాటక సింహాసన ప్రతిష్ఠాపనాచార్య’ అనేది కొనసాగుతూ వస్తోంది. ప్రాయశ్చిత సుధానిధి, ద్వాదశ లక్ష్మణి అనే పూర్వ మీమాంస గ్రంథం, సంగీతసారం అనే సంగీత గ్రంథం, అద్వైత సిద్ధాంత గ్రంథం, పంచదశి మొదలైన 100కి పైగా గ్రంథాలను రచించారు.
నాడు విద్యారణ్యులు విజయనగర స్థాపనకు మందుకురాకుంటే.. నేడు కృష్ణానదినుంచి తుంగభద్ర వరకు సనాతన ధర్మం మచ్చుకైనా మిగిలేది కాదని పరిశోధకులు చెబుతారు. మహాయోగి, కవి, తాత్వికుడు, ద్రష్ట, వేదత్రయ భాష్య కర్త, బ్రహ్మవిద్య పారంగతుడు, శతాధిక గ్రంథకర్త, ముఖ్యంగా.. విజయనగర సామ్రాజ్య నిర్మాత, మహామంత్రి, విరూపాక్ష పీఠ స్థాపకుడు, శృంగేరీ పీఠాధిపతి.. ఇలా ఒక జీవితకాలంలో అనేక పాత్రలు పోషించిన మహాపురుషులుగా విద్యారణ్యులు నేటికీ ప్రజల్లో మనసుల్లో నిలిచిపోయారు.
Revanth Reddy: ఎవరా శ్రీధర్‌రాజు? ధరణి దొరల గుట్టు రట్టు!.. రేవంత్ లీక్స్..