
Jhansi Lakshmi Bai : ఆమె ఓ గొప్ప పోరాట యోధురాలు. ప్రాణాలకు భయపడక శత్రువును ఢీకొట్టిన ధీర. దౌర్జన్య, దురాగత ఆంగ్లేయుల పాలనకు చరమగీతం పాడేలా జాతిని తట్టిలేపిన వీర శిరోమణి. తాను అబల కాదు సబల అని నిరూపించి.. కోట్లాది జనం గుండెల్లో స్వాతంత్య్ర కాంక్షను రగిల్చిన అగ్నిశిఖ.. ఆమె మరెవరో కాదు.. ఝాన్సీ లక్ష్మీబాయ్. నేడు ఆమె జయంతి.
నేటి మహారాష్ట్రలోని సతారాలో 1835 నవంబర్ 19వ తేదీన జన్మించారు. తల్లిదండ్రులు భాగీరథీబాయి, మోరోపంత్‌లు. ఈమె అసలు పేరు మణికర్ణిక. మోరోపంత్ బితూర్ జిల్లాకు చెందిన పీష్వా ఆస్థానంలో ఉద్యోగి. మణికర్ణిక నాలుగేళ్ళ వయసులో తల్లి మరణించారు. ఇంట్లోనే చదవడం, వ్రాయడం నేర్చుకున్నారు. పీష్వాల దత్తపుత్రుడు నానా సాహెబ్‌తో కలిసి పెరిగారు. బాల్యం నుండే కత్తిసాము, గుర్రపుస్వారీ, తుపాకీ పేల్చడం వంటి యుద్ధవిద్యలను కూడా అభ్యసించారు.
పదమూడేళ్ళ వయసులో 1842లో ఝాన్సీ రాజు గంగాధర రావుతో వివాహం జరిగింది. వివాహానంతరం ఆనాటి ఆచారాల ప్రకారం ఆమె పేరు లక్ష్మీబాయిగా పేరు మారింది. వీరికి కుమారుడు పుట్టి చనిపోవడంతో ఈ దంపతులు ఓ బాలుడిని దత్తత తీసుకున్నారు. తర్వాత కొద్ది రోజులకే అనారోగ్యం పాలయిన భర్త గంగాధరరావు కన్నుమూశారు.
దీంతో రాజ్యభారం లక్ష్మీబాయిపై పడింది. మరోవైపు దత్తత తీసుకున్న బాలుడిని రాజ్యానికి వారసుడిగా గుర్తించబోమని, ఝాన్సీని బ్రిటిష్ రాజ్యంలో విలీనం చేస్తే కొంత భరణం ఇస్తామని బ్రిటిష్ పాలకులు కబురుపంపగా, ఆమె ఆలోచనలో పడింది. కుమారుడు చిన్నవాడు కావటం, రాజ్య ఆర్థిక స్థితి బాగా లేకపోవటంతో బ్రిటిష్ వారితో చర్చలు కొనసాగిస్తూ వచ్చి.. ఆ సమయంలో స్వాతంత్ర్య పోరాటానికి పునాదులు వేసింది.
ఈ కీలక సమయంలోనే రాణి దినచర్యలో మార్పు వచ్చింది. బాల్యంలో నేర్చుకున్న గుర్రపు స్వారీ, తుపాకీ, ఖడ్గం, బల్లెం ప్రయోగించడం మళ్లీ మొదలుపెట్టింది. అలాగే.. మరో స్వాతంత్ర్య వీరుడు తాంతియా తోపేతో రహస్య చర్చలు జరిపి.. 1857 మే 31న దేశమంతా భారత స్వదేశీ సంస్థానాధీశులు కలిసి తిరుగుబాటు చేయాలని నిర్ణయించారు. ఆ పోరాటం.. దశల వారీగా 20 నెలల పాటు సాగింది.
కొందరు ద్రోహుల కారణంగా పోరాటాన్ని బ్రిటిషర్లు అణిచివేశారు. అనంతరం 1858 మార్చ్ 23న బ్రిటీష్ సైన్యాధికారి సర్ రోజ్ ఝాన్సీపై యుద్ధం ప్రకటించాడు. పది, పన్నెండు రోజుల పాటు బ్రిటిష్ సేనలను ఝాన్సీ సేనలు ఎదుర్కొన్నాయి. ఓటమి దృశ్యం స్పష్టం కావటంతో, కోట నుంచి బయటపడి అనుచరులతో కలిసి తాంతియా తోపే, నానా సాహెబ్‌లను కలుసుకుని కాల్పీలోని వారి సైన్యాన్నీ కూడగట్టింది.
ఈ సంగతి తెలుసుకున్న బ్రిటిష్ సైన్యాధికారి రోజ్.. కాల్పీని ముట్టడించారు. మళ్లీ ఓడిపోయే పరిస్థితి ఎదురుకావటంతో పురుష దుస్తులు ధరించి, అనుచరులతో కలిసి గ్వాలియర్ మీద దాడిచేసి ఆ కోటని వశపరచుకుని, వారి సాయాన్ని అర్థించినా అక్కడి పాలకుడు వీరికి సాయం అందించలేదు. దీంతో అక్కడి నుంచి తిరిగి వస్తుండగా ఆంగ్లేయ సేనలు వీరికి ఎదురుపడ్డాయి. అప్పుడు జరిగిన హోరాహోరీ పోరులో రాణి తీవ్రంగా గాయపడింది. బిడ్డను అనుచరులకు ఇచ్చి వెనక్కి పంపిన రాణి.. యుద్ధాన్ని కొనసాగించింది.
ఈ క్రమంలో ఆమె కుడిచేయి తెగిపోయింది. కడుపులోనూ కత్తిపోట్లు. దీంతో అనుచరుడైన కుల్ మొహమ్మద్ మహారాణిని భుజాలపై ఎత్తుకుని సమీపంలోని గంగాదాస్ ఆశ్రమానికి తరలించాడు. ఆ రోజు జూన్ 28, 1858. చుట్టూ చిమ్మచీకటి. ఆ చీకట్లోనే బాబా గంగాదాస్ రక్తసిక్తమైన రాణి ముఖాన్ని గంగాజలంతో కడిగి, గుక్కెడు గంగాజలాన్ని తాగించాడు. రాణికి కొద్దిగా స్పృహ వచ్చింది. వణుకుతున్న కంఠంతో ఒక్కసారి ‘హరహర మహాదేవ’ అని సృహతప్పింది. మరికొన్ని నిమిషాలకు తిరిగి సృహలోకి వచ్చి కన్నులు తెరిచి,
‘ ఓ కృష్ణా.. నీ ముందు నేను ప్రణమిల్లుతున్నాను.’ అంది. అవే ఆమె చివరి మాటలు.
తన శరీరం విదేశీయుల చేతికి చిక్కరాదనే ఆమె ఆదేశం మేరకు.. అక్కడే చితిపేర్చి ఆమె అంత్యక్రియలు చేయటం జరిగింది. రాణితో అనేకసార్లు పోరాడి ఓడిన సర్ రోజ్.. ‘ఈమె విప్లవకారులదరిలో అత్యంత సాహసి, అందరికంటే గొప్ప సేనాపతి’అని లక్ష్మీబాయి పరాక్రమాన్ని కొనియాడారు.
Revanth Reddy : బీఆర్ఎస్ కార్యకర్తల్లా ఆ అధికారులు.. బదిలీ చేయాలని రేవంత్ డిమాండ్..