Fire Crackers Ban In Trains: రైలులో ప్రయాణించేటప్పుడు కొన్ని వస్తువులను తీసుకెళ్లడం రైల్వే శాఖ నిషేధించింది. ప్రయాణికులు రైళ్లలో మండే స్వభావం కలిగిన పదార్థాలు, దీపావళి పటాకులు తీసుకెళ్లడానికి అనుమతి లేదు.
భారతదేశంలో దీపావళి పండుగను ఎంతో వైభవంగా జరుపుకుంటారు. ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు తిరిగి స్వగ్రామాలకు చేరుకుంటారు. దీపావళి నాడు కుటుంబం తో కలిసి పటాకులు కాల్చుతూ సంతోషంగా గడుపుతారు. తమ స్వస్థలాలకు వెళ్లే సమయాల్లో ప్రయాణికులు స్వీట్లు, బట్టలు, బహుమతులు తీసుకెళ్తుంటారు. దీంతో పండుగ సమయాల్లో రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతుంటాయి.
కొన్ని వస్తువులను మాత్రం రైళ్లలో తీసుకెళ్లేందుకు అనుమతి లేదు. మండే పదార్థాలు, దీపావళి పటాకులను రైళ్లలో అనుమతించరు. ఎందుకంటే చిన్న నిప్పురవ్వ రేగినా భారీ ప్రమాదానికి దారితీస్తుంది. అందువల్ల దీపావళి క్రాకర్స్ ను రైళ్లలో తీసుకెళ్లడానికి అనుమతించారు. ప్రతి ఒక్కరి భద్రత కోసం ప్రయాణికులు అలాంటి మండే పదార్థాలు తీసుకెళ్లకుండా ఉండాలని అధికారులు సూచించారు.
దీపావళి సమయంలో రైల్వే అధికారులు భద్రతను కట్టుదిట్టం చేస్తారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ స్టేషన్లలో, రైళ్లలో ప్రత్యేక తనిఖీలు చేస్తుంటుంది. బాణసంచా లేదా మండే పదార్థాలను తీసుకెళ్లే ప్రయాణికులను గుర్తిస్తారు. నిబంధనలను ఉల్లంఘించిన రైళ్లలో పటాకులు తీసుకెళ్లే వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు.
Also Read: Indian Railways Lower Berth: ఏంటీ.. ఇక లోయర్ బెర్తులు వారికేనా? రైల్వే రూల్స్ మారాయండోయ్!
భారతీయ రైల్వే చట్టంలోని సెక్షన్ 164 ప్రకారం, రైలులో నిషేధిత వస్తువులను తీసుకెళ్లడం శిక్షార్హమైన నేరం. ఈ కేసుల్లో దోషులుగా తేలితే రూ. 1,000 వరకు జరిమానా, మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా రెండూ విధించే అవకాశం ఉంది. ప్రయాణికుల భద్రత నేపథ్యంలో మండే పదార్థాలు, రసాయనాలు, బాణసంచా, గ్యాస్ సిలిండర్లు, ప్రమాదకరమైన వస్తువులను రైళ్లలో తీసుకెళ్లకుండా నిషేధించారు.